డబ్లింగ్‌ పనుల్లో గ్యాంబ్లింగ్‌ | Gambling On Railway Line Dubbing Works In prakasam | Sakshi
Sakshi News home page

డబ్లింగ్‌ పనుల్లో గ్యాంబ్లింగ్‌

Published Mon, Sep 9 2019 10:45 AM | Last Updated on Mon, Sep 9 2019 10:46 AM

Gambling On Railway Line Dubbing Works In prakasam - Sakshi

కూలిన ప్లాట్‌ఫాం

సాక్షి, ప్రకాశం : గుంటూరు–గుంతకల్లు రైల్వేలైన్‌ డబ్లింగ్‌ పనులు ప్రారంభమయ్యాయి. ఇటు కాంట్రాక్టర్లు, అటు అధికారులకు పంట పండింది. తూతూమంత్రంగా నాసిరకం పనులు చేసి అందిన కాడికి దండుకుంటున్నారు. ఇదేమని ప్రశ్నించే పర్యవేక్షకులు లేకపోవడంతో పనులు ఇష్టానుసారం సాగుతున్నాయి. కురిచేడు రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం కోటి రూపాయల ఖర్చుతో 70 మీటర్ల మేర ప్లాట్‌ఫాం నిర్మించారు. నిర్మాణం జరిగి ఆరు నెలలు కూడా నిండకముందే అది కూలిపోయింది. ప్లాట్‌ఫాం కూలడంతో దానికి ఏర్పాటు చేసిన బెంచీలు, విద్యుత్‌ లైట్లు కూడా కూలిపోయాయి. ప్లాట్‌ఫాం నిర్మాణ దశలోనే కూలిపోయినా అధికారులు కాంట్రాక్టర్లకే వత్తాసు పలకడం గమనార్హం. దీన్నే అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనేందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. 108–109 కిలోమీటర్ల మధ్య ఉన్న వాగుపై బ్రిడ్జి కింద బెడ్‌ కాంక్రీటు వేయకుండా కేవలం సిమెంటు పాలు పోసి మమ అనిపించారు. రైల్వే పనులు ఏ చిన్న పనైనా రూ.కోట్లల్లో ఉండటంతో కాంట్రాక్టర్లకు కల్పవృక్షంగా మారింది. దీంతో రైల్వే అధికారులకు అది వరంగా మారింది. 

పర్యవేక్షణ కనుమరుగు 
రైల్వే ఇంజినీరింగ్‌ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిపై ఆధారపడి వారు ఇచ్చిన మామూళ్లు లెక్క లేసుకుంటూ ఏసీ గదులు దాటి బయటకు రావడం లేదు. క్వాలిటీ అధికారులు సైతం క్షేత్రస్థాయి అధికారులు కనుసన్నల్లో మెలగడం గమనార్హం. రైళ్ల మార్గాన వేలాది మంది ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అంతేకాకుండా ఏదైనా ప్రమాదం సంభవించి ప్రయాణికుల ప్రాణాలకే ముప్పు వాటిళ్లడంతో పాటు రైల్వే శాఖ అధికారులు కూడా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇవేమీ పట్టని రైల్వే ఇంజినీరింగ్‌ అధికారులు తమ జేబులు నిండితే సరి అనుకుంటూ పచ్చనోట్లు లెక్క లేసుకుంటున్నారేగానీ పనుల నాణ్యతను పరిశీలించిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా కేంద్ర రైల్వేశాఖ నిజాయితీపరులైన అధికారులను నియమించి పనుల నాణ్యతను పరిశీలించి, నాణ్యత డొల్లగా ఉన్న పనులపై పర్యవేక్షణ చేస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement