
కరీంనగర్–కాజీపేట రైల్వే లైన్‌పై సర్వే చేయాలి
తెలంగాణలో వస్తు, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా కాజీపేట–కరీంనగర్ రైల్వే మార్గానికి సర్వే చేయాలని టీఆర్‌ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ కేంద్రాన్ని కోరారు.
లోక్‌సభలో కేంద్రాన్ని కోరిన ఎంపీ వినోద్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వస్తు, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా కాజీపేట–కరీంనగర్ రైల్వే మార్గానికి సర్వే చేయాలని టీఆర్‌ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ కేంద్రాన్ని కోరారు. మంగళవారం లోక్‌సభలో రైల్వే పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. కాజీపేట నుంచి హసన్‌పర్తి రోడ్, ఎల్లాపూర్, హుజురాబాద్, శంకరపట్నం, మానకొండూరుల మీదుగా కరీంనగర్‌కు రైల్వే లైను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉందని పేర్కొన్నారు. ఈ 70 కి.మీ.లను అనుసంధానించడం ద్వారా కరీంనగర్, వరంగల్ ప్రజలకు మేలు జరుగుతుందని వివరించారు. ప్రస్తుతం పెద్దపల్లి–నిజామాబాద్ రైల్వే లైన్ ద్వారా కరీంనగర్.. రైల్వే సేవలు పొందుతోందని తెలిపారు. మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారని, కాజీపేట్–కరీంనగర్ లింకును కూడా పూర్తిచేస్తే దక్షిణాది నుంచి వచ్చే రైళ్లను ఈ మార్గం ద్వారా మహారాష్ట్ర, గుజరాత్ తదితర పశ్చిమ ప్రాంతాలకు మళ్లించవచ్చని పేర్కొన్నారు.