సిరిపురం వెళ్లే దారిలో నిర్మించిన అండర్‌పాస్ బ్రిడ్జి, బోగారం వద్ద అండర్‌పాస్‌ను కలుపుతూ వేసిన సీసీరోడ్డు
సాక్షి, రామన్నపేట: మండల పరిధిలోని పలు గ్రామాలకు వెళ్లే మార్గంలో రైల్వేలైన్ కింద నిర్మిస్తున్న అండర్‌పాస్ బ్రిడ్జిలతో ప్రయాణికుల అవస్థలు తీరనున్నాయి. ఇప్పటికే బోగారం, సిరిపురం, ఇంద్రపాలనగరం గ్రామాలకు వెళ్లేదారిలో అండర్‌పాస్‌ల నిర్మాణం పూర్తయింది. రామన్నపేట శివారులో చేపట్టిన అండర్‌పాస్ పనులు ముగింపు దశలో ఉన్నాయి.
తప్పనున్న నిరీక్షణ
రామన్నపేట మండలం మీదుగా సికింద్రాబాద్–నడికుడి రైలుమార్గం ఉంది. మండలంలో రామన్నపేట–సిరిపురం, బోగారం–సిరిపురం, ఇంద్రపాలనగరం–సిరిపురం, ఇంద్రపాలనగరం–వెల్లంకి, రామన్నపేట–కొమ్మాయిగూడెం గ్రామాలకు వెళ్లే రోడ్డు మార్గంలో రైల్వే ట్రాక్ ఉంది. ఈ మార్గంలో సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు పదుల సంఖ్యలో నడుస్తుంటాయి. అయితే ఈ క్రమంలో పగటిపూట పదిహేను సార్లకుపైగా గేట్ వేయవలసి వస్తోంది. ఈ మార్గంలో ద్విచ్రక వాహనదారులతో పాటు బస్సులో ప్రయాణించే ప్రయాణికులు గేట్ పడినప్పుడల్లా పది నిమిషాలకుపైగా నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో అత్యవసర పనిమీద వెళ్లేవారు, స్కూలు విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడేవారు.
తొలగనున్న ఇబ్బందులు
రైల్వే శాఖ వారు గత ఆర్థిక సంవత్సరంలో మండల పరిధిలోని ఇంద్రపాలనగరం–వెల్లంకి గ్రామాల మధ్య అండర్‌పాస్ నిర్మించి వినియోగంలోకి తీసుకువచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బోగారం–సిరిపురం, రామన్నపేట–సిరిపురం గ్రామాల మధ్య అండర్‌పాస్‌ల నిర్మాణం చేపట్టారు. బోగారం–సిరిపురం గ్రామాల మధ్య బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. సిరిపురం–రామన్నపేట మధ్య పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఈ అండర్‌పాస్‌లు వినియోగంలోకి వస్తే వాహనదారులు నిరీక్షించే బాధ తప్పుతుంది. రైల్వే శాఖ వారు అండర్‌పాస్ బ్రిడ్జిల నిర్మాణంతో తమ కష్టాలు తప్పనున్నాయని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వర్షాకాలంలో నీరు నిల్వకుండా చూడాలి
అండర్‌పాస్ నిర్మాణం వల్ల నిరీక్షించే బాధ తప్పింది. ముఖ్యంగా రైతులకు సౌకర్యవంతంగా ఉంది. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా చేయాలి. రాత్రిపూట ప్రమాదాలు జరుగకుండా లైట్లు ఏర్పాటు చేయాలి. కార్నర్ వద్ద రెడ్‌లైట్లు ఏర్పాటు చేయాలి.
– గోగు హరిప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment