రైలు కూత పెట్టేదెన్నడు?
మోర్తాడ్ : ‘ నీవు ఎక్కాల్సిన రైలు.. జీవిత కాలం లేటు’ అన్న ఓ సినీ కవి మాటలు నిజామాబాద్, పెద్దపల్లిల మధ్య ప్రయాణం చేయాలనుకునే వారికి అచ్చంగా సరిపోతాయి. నిజామాబాద్ ప్రాంతంలో పూర్తి కావల్సిన రైల్వే ట్రాక్ నిర్మాణానికిఅవసరం అయిన భూమి సేకరణ సక్రమంగా జరుగక పోవడంతో రైలు కూతకు ఇంకా మోక్షం లభించడం లేదు.నిజామాబాద్, పెద్దపల్లిల మధ్య 177.49 కిలోమీటర్ల పొడవునా రైల్వే నిర్మాణానికి నిజాం ప్రభువు కాలంలోనే ప్రతిపాదనలు జరిగాయి.
1993-94లో ఈ రైల్వే లైన్‌కు మోక్షం లభించింది. కాగా ప్రతి బడ్జెట్‌లో తక్కువగా నిధులు కేటాయించడంతో ఇప్పటికీ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. పెద్దపల్లి, జగిత్యాల్ మధ్యన రైలు ప్రయాణం జరుగుతోంది. మోర్తాడ్ వరకుట్రాక్ పూర్తి కాగా స్టేషన్ నిర్మాణం కూడా పూర్తయ్యింది. దీంతో మోర్తాడ్ నుంచి మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల్‌ల మీదుగా పెద్దపల్లి వరకు ప్యాసింజర్ రైలును నడపాలని గత మార్చిలోనే అధికారులు ప్రతిపాదనలు చేశారు.
మోర్తాడ్, లక్కోర వరకు జగిత్యాల్ నుంచి రైలింజన్ ట్రయల్న్‌న్రు పూర్తి చేశారు. చిన్న చిన్న లోపాలు తలెత్తగా వాటిని సరిదిద్దారు. రైల్వే సేఫ్టీ బృందం తనిఖీలను నిర్వహించి సర్టిఫై చేస్తే జగిత్యాల్, మోర్తాడ్‌ల మధ్య ప్యాసింజర్ రైలును నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
28 కిలో మీటర్ల రైల్వే లైన్ పూర్తి అయితే...
నిజామాబాద్, పెద్దపల్లిల మధ్య రైల్వే ట్రాక్ నిర్మాణం మొత్తం 177.49 కిలో మీటర్లు. ఇప్పటివరకు 149.49 కిలో మీటర్ల ట్రాక్ నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. అక్కడక్కడ వంతెనల నిర్మాణ పనులు కొంత పెండింగ్‌లో ఉన్నాయి. నిజామాబాద్ పరిసరాల్లో 28 కిలో మీటర్ల పరిధిలో ట్రాక్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ఇంకా పూర్తి కావడం లేదు.
రూ. 200 కోట్ల నిధులు ఉంటే రైల్వే లైన్ నిర్మాణం, స్టేషన్‌ల పనులు, వంతెనల పనులు పూర్తి చేయవచ్చని ఉన్నతాధికారులు అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం బడ్జెట్‌లో రూ. 35 కోట్లు కేటాయించింది. అవసరం ఉన్న నిధుల్లో కనీసం సగం కేటాయించినా పనులు ఒక కొలిక్కి వచ్చేవి. నిధుల కేటాయింపులో మొదటి నుంచి నిర్లక్ష్యం కనిపిస్తూనే ఉంది. నిధుల కేటాయింపు విషయంలో ఎంపీలు కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుక రావడం లేదని తెలుస్తోంది.
ఎన్నికల సమయంలో హడావుడి...
సాధారణ ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న అప్పటి నాయకుల ఒత్తిడితో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కొంత హడావుడి చేశారు. మార్చి 29న జగిత్యాల్ నుంచి మోర్తాడ్, లక్కోర వరకు రైలింజన్ ట్రయల్న్ నిర్వహించారు. త్వరలోనే సేఫ్టీ బృందంతో తనిఖీలు పూర్తి చేయించి ప్యాసింజర్ రైలును నడుపుతామని ప్రకటించారు. అప్పటి అధికార పార్టీ నాయకులు ఒత్తిడి మేరకు రైల్వే అధికారులు హడావుడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇప్పటివరకు సేఫ్టీ బృందం తనిఖీలను నిర్వహించక పోవడాన్ని పరిశీలిస్తే ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసమే ట్రయల్న్ ్రఒక ఎత్తుగడ అని స్పష్టం అవుతోంది. చివరకు ఎన్నికల ఫలితాలు కూడా అప్పటి నాయకులకు ప్రతికూలంగానే వచ్చాయి. కాగా ఇప్పటి ప్రజాప్రతినిధులు స్పందించి తనిఖీలను పూర్తి చేయించి ప్యాసింజర్ రైలును ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.