గ్రాండ్‌ ట్రంక్‌ రైల్వేలైన్‌పై ఒత్తిడి, వేగంగా మూడో లైన్‌ పనులు, కొన్ని రైళ్లు రద్దు! | - | Sakshi
Sakshi News home page

గూడూరు– బల్లార్ష గ్రాండ్‌ ట్రంక్‌ రైల్వేలైన్‌పై ఒత్తిడి.. వేగంగా మూడో లైన్‌ పనులు.. కొన్ని రైళ్లు రద్దు!

Jul 2 2023 4:58 AM | Updated on Jul 2 2023 11:50 AM

- - Sakshi

హైదరాబాద్: ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలను కలిపే ప్రధాన మార్గంలో మూడోలైన్‌ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. దీంతో వివిధ మార్గాల్లో నడిచే రైళ్ల రాకపోకల్లో జాప్యం చోటుచేసుకొంటోంది. ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాలకు రాకపోకలు సాగించే మార్గాల్లో గూడూరు– బల్లార్ష గ్రాండ్‌ ట్రంక్‌ రైల్వేలైన్‌ అత్యంత కీలకమైనది.

ఈ మార్గంలో ప్రతిరోజూ వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. దీంతో పట్టాలపై ఒత్తిడి కారణంగా రైళ్ల రాకపోకల్లో జాప్యం నెలకొంటోంది. ఈ జాప్యాన్ని నివారించేందుకు దక్షిణమధ్య రైల్వే గూడూరు– బల్లార్ష మధ్య మూడు దశలుగా మూడోలైన్‌ నిర్మాణ పనులను చేపట్టింది. కాజీపేట్‌–బల్లార్ష, విజయవాడ–గూడూరు మధ్య పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

దీంతో సికింద్రాబాద్‌, కాజీపేట్‌ల మీదుగా నడిచే రైళ్లలో కొన్నింటిని అధికారులు నిలిపివేశారు. ముఖ్యంగా రద్దీ లేని వేళల్లో కొన్ని ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేశారు. మరోవైపు నగరంలోని వివిధ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ట్రాక్‌ నిర్వహణ పనుల దృష్ట్యా ఎంఎంటీఎస్‌, సబర్బన్‌ రైళ్లకు కూడా అంతరాయం ఏర్పడింది. మరికొద్ది రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.

మూడోలైన్‌ పరిష్కారంగా..
దక్షిణమధ్య రైల్వే పరిధిలో సుమారు 6,800 ట్రాక్‌ కిలోమీటర్ల పరిధిలో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతిరోజూ సుమారు 800 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. వీటిలో 300 వరకు గూడ్స్‌ రైళ్లు ఉన్నాయి.అలాగే వివిధ జోన్‌ల నుంచి దక్షిణమధ్య రైల్వే జోన్‌మీదుగా పెద్ద సంఖ్యలో రైళ్లు నడుస్తాయి. దీంతో ట్రాక్‌లపై ఒత్తిడి పెరుగుతోంది. సకాలంలో సిగ్నళ్లు లభించకపోవడంతో వివిధ రూట్లలో రైళ్లు ముందుకు కదలలేని పరిస్థితి.

ఉదాహరణకు కాజీపేట్‌ మీదుగా నగరానికి చేరుకొనే రైళ్లకు సిగ్నల్‌ లభించకపోవడంతో చర్లపల్లి వద్ద నిలిపివేస్తున్నారు. కాజీపేట్‌ మీదుగా వెళ్లే రైళ్లకు సైతం గూడూరు, బల్లార్ష మధ్యలో బ్రేకులు పడుతున్నాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు మూడోలైన్‌ నిర్మాణ పనులను చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులు తుది దశకు చేరుకున్నాయి. మూడోలైన్‌ అందుబాటులోకి వస్తే రైళ్ల సగటు వేగం బాగా పెరగనుంది.

ట్రాక్‌ల పటిష్టతకు చర్యలు..
మరోవైపు ఇటీవల జరిగిన ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటన నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వే అప్రమత్తమైంది. వర్షాకాలం దృష్ట్యా కూడా ట్రాక్‌లలో ఎలాంటి లోపాలు లేకుండా నివారించేందుకు ట్రాక్‌ల పటిష్టతకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు వివిధ డివిజనల్‌ మేనేజర్‌లతో దక్షిణమధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ ఇటీవల సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

వర్షాల వల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉన్న రైల్వేలైన్‌లు, వంతెనలు, సొరంగాలు, తదితర మార్గాల నిర్వహణపైన దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. అనూహ్యమైన అవాంతరాలు ఏర్పడితే తొలగించేందుకు అత్యవసర పరికరాలను అన్ని చోట్ల అందుబాటులో ఉంచాలని చెప్నారు. ఇసుక, బండరాళ్లు,పైపులు నిల్వ ఉంచాలని పేర్కొన్నారు.

భారీ వర్షాల కారణంగా ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉన్న వంతెనల వద్ద 24 గంటల పాటు నిఘాను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ట్రాక్‌లపైకి వరదనీరు వచ్చి చేరకుండా ఎప్పటికప్పుడు తొలగించేందుకు చర్యలు తీసుకొనేందుకు కూడా యంత్రాంగం అప్రమత్తమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement