సిద్దిపేట జోన్: మూడు దశాబ్దాల సిద్దిపేట వాసుల రైల్వే లైన్ ఆశలు మళ్లీ చిగురించాయి. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైను నిర్మాణానికి రైల్వేబోర్డు అనుమతి మంజూరు చేయడంతో సిద్దిపేట ప్రాంత వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మూడు నిబంధనలతో రైల్వే బోర్డు నూతన మార్గానికి ఆమోదముద్ర వేయడం, సీఎం కేసీఆర్ కూడా సిద్దిపేట బిడ్డే కావడంతో ఈ సారి సిద్దిపేట రైల్వే లైనుకు తప్పకుండా మోక్షం కలుగుతుందని ఇక్కడి వారు భావిస్తున్నారు.
మూడు దశాబ్దాల కల
కరీంనగర్, మెదక్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ జిల్లాలకు కేంద్ర బిందువుగా ఉన్న సిద్దిపేట వ్యాపార, వాణిజ్యపరంగా దినదినాభివృద్ధి చెందుతోంది. సరిగ్గా 3 దశాబ్దాల క్రితం అప్పటి పాలకులు ఎన్నికల హామీగా సిద్దిపేటకు రైల్వే మార్గం అనే నినాదాన్ని తెరమీదకు తెచ్చారు. ఒక దశలో దివంగత నేత ఇందిరాగాంధీ హయాంలోనే రైల్వే మార్గం కోసం తొలి అడుగు పడింది. నాటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఇదే హామీని పాలకులు వినిపిస్తున్నారు.
1999లో 154 కిలోమీటర్ల మేర రైల్వే లైన్‌కు ప్రతిపాదనలు రూపొందించారు. కానీ తదుపరి చర్యలు కొనసాగలేదు. ఇదే సమయంలో కేంద్ర కార్మిక శాఖా మంత్రి హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ 2006లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పూర్తి స్థాయిలో ప్రాజెక్టు రూపకల్పనలో సఫలీకృతం అయ్యారు. అప్పట్లోనే కేంద్రం కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్ కోసం రూ.40 కోట్లను రైల్వే బడ్జెట్‌లో కేటాయించి, రాష్ట్ర ప్రభుత్వానికి మూడు నిబంధనలు విధించింది. అప్పుడు రాష్ట్రంలో ఉన్న సర్కార్ కేంద్ర నిబంధనలన్నీ ఒప్పుకున్నప్పటికీ తదుపరి చర్యలు తీసుకోలేదు.
అయితే తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టగానే కొత్తపల్లి- మనోహరాబాద్ ప్రాజెక్టుపై దృష్టి సారించారు. ప్రాజెక్టు వ్యయం రూ. 935 కోట్లలో మూడవ వంతు భారం భరించడంతోపాటు రైల్వేలైన్ కోసం అయ్యే భూసేకరణకు ముందుకు వచ్చారు. అంతేకాకుండా కేంద్రం విధించిన నిబంధన మేరకు 5 సంవత్సరాల పాటు నష్టాన్ని భరించడానికి అంగీకారం తెలిపారు. దీంతో రైల్వే బోర్డు కొత్తపల్లి-మనోహరాబాద్ మార్గానికి అనుమతిని ఇచ్చింది.
వ్యాపార, వాణిజ్య పురోగతి
ఇప్పటికే కేవలం రహదారి మార్గాల ద్వారా రవాణ వ్యవస్థను వినియోగించుకుని దినదినాభివృద్ధి చెందుతున్న సిద్దిపేట భవిష్యత్‌లో మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైను ద్వారా సికింద్రాబాద్, మేడ్చల్, గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, కొత్తపల్లి వరకు సిద్దిపేటతో అనుసంధానం పెరగనుంది. వ్యాపార, వాణిజ్య పరంగా అభివృద్ధి చెందుతున్న సిద్దిపేటలో రైల్వే లైన్ ఆధారంగా భవిష్యత్‌లో రాక్ పాయింట్ ఏర్పాటు చేసే అవకాశం మెండుగా ఉంది.
దీంతో వ్యాపారస్తులకు మేలు జరుగుతుంది. అదేవిధంగా సిద్దిపేట నుంచే నేరుగా సుదూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఏర్పడుతుంది. అన్ని రంగాల్లో సిద్దిపేట అగ్రగామిగా నిలిచే అవకాశం పుష్కలంగా ఉందన్న వాదనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
సిద్దిపేట రైల్వే లైన్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Published Thu, Nov 20 2014 11:09 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
Advertisement
Advertisement