
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్–గజ్వేల్ మధ్య నడపనున్న రైలు మార్చిలో పట్టాలెక్కబోతోంది. తొలుత పుష్‌పుల్ ప్యాసింజర్ సేవలను ప్రారంభించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు ప్రారంభించింది. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసిన రైల్వే, రామాయపల్లి వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై వంతెన నిర్మాణ పనులు చేపట్టేందుకు సిద్ధమైంది. ఈనెల 20 నుంచి ఆ పనులు మొదలుకానున్నా యి. వాటిని రెండు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం గా పెట్టుకుంది. ఫిబ్రవరి చివరినాటికి ఆ పనులు పూర్తి చేసి మార్చి మొదటి వారంలో రైలును నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
స్టేషన్లు... ట్రాక్ సిద్ధం
సికింద్రాబాద్‌తో కరీంనగర్‌ను రైల్వే లైన్ ద్వారా అనుసంధానించే మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజె క్టులో తొలి దశ పనులు దాదాపు పూర్తయ్యాయి. మనోహరాబాద్ స్టేషన్ నుంచి ఈ కొత్త లైన్ ప్రారం భమైంది. అక్కడికి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజ్వేల్ పట్టణం వరకు పనులు పూర్తి చేయటం ప్రాజెక్టు తొలిదశ. ఇందులో మనోహరాబాద్ వద్ద కొత్త స్టేషన్ భవనం సిద్ధమైంది. ఆ తర్వాత నాచారం, అప్పాయిపల్లి, గజ్వేల్‌లలో స్టేషన్‌లు ఉంటా యి. జనవరి నాటికి పనులన్నీ పూర్తవుతాయి.
జాతీయ రహదారిని కట్‌చేసి...
ఇక ఈ 32 కిలోమీటర్ల మార్గంలో ఆరు రోడ్ ఓవర్ బ్రిడ్జీలు మూడు రోడ్ అండర్ బ్రిడ్జీ, నాలుగు చోట్ల పెద్ద వంతెన పనులు పూర్తయ్యాయి. ఇక నిజామాబాద్ మీదుగా సాగే 44వ నంబర్ జాతీయ రహదారిని రైల్వే లైన్ క్రాస్ చేసే చోట వంతెన నిర్మించాల్సి ఉంది. జాతీయ రహదారిని కట్ చేసి పని చేపట్టాల్సి ఉన్నందున అనుమతి కోసం వేచి చూడాల్సి వచ్చింది. ఈనెల 20 నుంచి అక్కడ పనులు చేసుకోవచ్చంటూ తాజాగా జాతీయ రహదారుల విభాగం అనుమతించడంతో పనులు చకచకా సాగనున్నాయి. ఫిబ్రవరిలో ట్రయల్ రన్ పూర్తి చేసి మార్చి తొలివారంలో ప్రారంభించనున్నట్లు అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment