హైదరాబాద్: హైదరాబాద్ ప్రాపర్టీ మార్కెట్లో డిమాండ్ – సరఫరా మధ్య అసమతుల్యత నెలకొందని, దీని ఫలితంగా మార్చి త్రైమాసికంలో ప్రాపర్టీల ధరలు 5.8 శాతం పెరిగినట్టు ‘మ్యాజిక్‌బ్రిక్స్ ప్రాప్ ఇండెక్స్’ నివేదిక వెల్లడించింది. 2023 జనవరి–మార్చి కాలానికి ఈ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. ఇళ్లకు డిమాండ్ త్రైమాసికం వారీగా 6 శాతం పెరగ్గా, అదే సమయంలో ఇళ్ల సరఫరా 14.2 శాతం తగ్గినట్టు తెలిపింది.
పశ్చిమ హైదరాబాదులో గచ్చిబౌలి, మియాపూర్, కొండాపూర్ ప్రాంతాలకు నివాస పరంగా అధిక డిమాండ్ నెలకొందని, ప్రధాన ఉపాధి కేంద్రాలకు, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్)కు చేరువగా ఉండడమే అధిక డిమాండ్ కు కారణమని వివరించింది. ఇళ్ల మార్కెట్లో డిమాండ్ అందుబాటు ధరల నుంచి మధ్య స్థాయి (రూ.5000 – 7000 చదరపు అడుగు)కి మారిందని, ప్రస్తుతం నగరంలోని ఇళ్ల డిమాండ్, సరఫరాలో ఈ విభాగమే 50 శాతం వాటా ఆక్రమిస్తోందని తెలిపింది.
విశాలమైన ఇళ్లకు ప్రాధాన్యత పెరిగిందని తెలియజేస్తూ.. 90 శాతం డిమాండ్ రెండు, మూడు పడక గదుల ఇళ్లకే ఉన్నట్టు పేర్కొంది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ 2022–23 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్ధిక వ్యవస్థ 6–7 శాతం వరకు పెరుగుతుందని ఎన్నో ఏజెన్సీలు అంచనా వేశాయి. ఇటీవలి కేంద్ర బడ్జెట్ సైతం పలు ప్రోత్సాహక కార్యక్రమాలకుతోడు పిఎంఏవై, యూఐడిఎఫ్‌కు గణనీయమైన కేటాయింపులు చేసింది. ఈ చర్యలు ఉపాధి అవకాశాలను, మౌలిక సదుపాయాల అభివృద్ధిని పెంచుతాయి.
సరసమైన, మధ్యస్థాయి విభాగాల్లో రాబోయే త్రైమాసికాలలో డిమాండ్ బాగుంటుందని ఆశిస్తున్నాం’’అని మ్యాజిక్‌బ్రిక్స్ సీఈవో సుధీర్ పాయ్ తెలిపారు. మార్చి త్రైమాసికంలో అత్యధికంగా మెహిదీపట్నం ప్రాంతంలో ప్రాపర్టీ ధరలు 4.27 శాతం పెరగ్గా (త్రైమాసికం వారీగా), కొండాపూర్‌లో 3.96 శాతం, బాలా నగర్‌లో 3.75 శాతం చొప్పున పెరిగినట్టు ఈ నివేదిక తెలిపింది. అలాగే, బంజారాహిల్స్‌లో 3.94 శాతం, బోడుప్పల్‌లో 3.77 శాతం, నానక్‌రామ్ గూడలో 3.39 శాతం చొప్పున తగ్గినట్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment