ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్(ఐడీపీ)లకు ఏటేటా డిమాండ్ పెరుగుతోంది. ఉన్నత చదువులు..ఉద్యోగాలు..టూరిస్ట్ వీసాలపై విదేశాలకు వెళ్లేవారు ఐడీపీ కోసం ఆర్టీఏ కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు. హైదరాబాద్ నుంచి వివిధ దేశాలకు వెళ్లిన నగరవాసుల్లో ఈ ఏడాది 42,471 మంది ఐడీపీ తీసుకున్నారు. – సాక్షి, హైదరాబాద్
అమెరికాకే ఎక్కువగా..
ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం ఏటా లక్షలాది మంది తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకు వెళుతున్నారు. వారే పెద్దసంఖ్యలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ తీసుకుంటున్నారు. అమెరికాతోపాటు అన్ని దేశాల్లోనూ మన డ్రైవింగ్ లైసెన్సులను అనుమతించడం వల్ల డిమాండ్ ఎక్కువగా ఉందని ఆర్టీఏ అధికారులు తెలిపారు.
వివిధ ఆర్టీఏ కార్యాలయాల్లో నగరవాసులు తీసుకొనే ఐడీపీలో 60 % వరకు అమెరికాలో డ్రైవింగ్ కోసమే కావడం గమనార్హం. హెచ్ 4 వీసాపై డిపెండెంట్‌గా వెళుతున్న మహిళలు అక్కడకు వెళ్లిన తర్వాత ఉద్యోగాన్వేషణలో భాగంగా డ్రైవింగ్ తప్పనిసరిగా భావిస్తున్నారు.
అలా ఐడీపీలు తీసుకుంటున్న మహిళల సంఖ్య కూడా ఏటా పెరు గుతూనే ఉంది. ‘హైదరాబాద్‌లో కారు డ్రైవింగ్ వస్తే చాలు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరుగులు తీయొచ్చు. అందుకే ఎక్కువ మంది ఐడీపీల కోసం వస్తారు.’అని ఆర్టీఏ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
అమెరికా తర్వాత మలేసియా, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రిటన్, స్విట్జర్లాండ్, దక్షిణాఫ్రికా, స్వీడన్, సింగపూర్, హాంకాంగ్, స్పెయిన్, ఫ్రాన్స్, ఫిన్‌లాండ్, ఇటలీ, మారిషస్, ఐర్లాండ్ తదితర దేశాల్లో ఇండియన్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్‌లను అనుమతిస్తున్నారు.
» అమెరికాతోపాటు కొన్ని దేశాల్లో ఏడాదిపాటు అనుమతిస్తుండగా, యూరోప్ దేశాల్లో 6 నెలల వరకు మాత్రమే అనుమతి ఉంది.
» ఐడీపీపై మలేసియాలో బండి నడపాలంటే ఆ దేశ అధికార భాష మలేలోకి ఐడీపీ వివరాలు నమోదు చేసుకోవాలి.
భారత రాయబార కార్యాలయం నుంచి ఈ సదుపాయం లభిస్తుంది.
» ఫ్రాన్స్‌లోనూ ఐడీపీని ఫ్రెంచిలోకి తర్జుమా చేసుకోవడం తప్పనిసరి.
» ఆ్రస్టేలియాలో మూడు నెలల వరకే అనుమతి ఉంటుంది.
» కెనడాలో మూడు నెలల్లోపు అక్కడి నిబంధనల మేరకు లైసెన్సు తీసుకోవాలి.
ఐడీపీ ఈజీనే...
» అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ తీసుకోవడం ఎంతో తేలిక. నగరంలోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, ఉప్ప ల్, మెహదీపట్నం, మణికొండ, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, మలక్‌పేట్, కూకట్‌పల్లి, బండ్లగూడ, తదితర ఆర్టీఏ కార్యాలయాల నుంచి ఐడీపీ తీసుకోవచ్చు.
పాస్‌పోర్టు, వీసాతో పాటు, పర్మనెంట్ లైసెన్సు డాక్యుమెంట్‌లను అందజేసి రూ.1500 ఫీజు చెల్లించాలి. సాధారణంగా అన్ని రకాల ఆర్టీఏ సేవలు ఆన్‌లైన్‌లో లభిస్తుండగా, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ మాత్రం అధికారులు నేరుగా దరఖాస్తుదారులకే అందజేస్తారు.
స్పెయిన్‌లో డ్రైవింగ్ చేశా..
విదేశాలకు ఎక్కువగా వెళతాను. అక్కడికి వెళ్లిన తర్వాత బంధువులు, స్నేహితుల వాహనాలు అందుబాటులో ఉంటాయి. కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వల్ల ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. దీంతో హైదరాబాద్ నుంచి ఐడీపీతో వెళితే ఆ ఇబ్బంది ఉండదు. స్పెయిన్‌లో మూడు నెలలు ఐడీపీతోనే డ్రైవింగ్ చేశాను. – సుబ్బారెడ్డి, టూరిస్టు
థాయ్‌లాండ్‌లో రైట్ డ్రైవింగే
డాక్యుమెంటరీల షూటింగ్‌కు తరచుగా విదేశాలకు వెళతా. ఇటీవల థాయ్‌లాండ్‌లో ఓ డాక్యుమెంటరీ షూటింగ్ సందర్భంగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్‌తో వెళ్లాను. అక్కడ మన ఇండియాలోలాగే రైట్ డ్రైవింగ్. ఏ ఇబ్బంది లేకుండా హాయిగా కారులో అన్ని చోట్లకు వెళ్లాను. – మిద్దె బాలరాజు, ఆర్టిస్ట్
జర్మనీలో నిబంధనలు కఠినం..
జర్మనీలో మన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్‌లపై బండి నడపడం చాలా కష్టం. మన డ్రైవింగ్ లైసెన్స్‌ను వారు పరిగణనలోకి తీసుకోలేదు. స్టూడెంట్‌గా వెళ్లాను. ఇప్పుడు ఉద్యోగం చేస్తూ జర్మనీలోనే ఉంటున్నారు. మొదట్లో హైదరాబాద్ నుంచి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ తీసుకొని వెళ్లగా, 6 నెలలు మాత్రమే అనుమతించారు. ఉద్యోగరీత్యా అక్కడే ఉండాల్సి రావడంతో అక్కడి నిబంధనల మేరకు మొదట లెర్నింగ్, ఆ తర్వాత పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నా. జర్మనీలో నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. – తన్యా కొండ
Comments
Please login to add a commentAdd a comment