International driving licence
-
విదేశాల్లో.. రయ్ .. రయ్
ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్(ఐడీపీ)లకు ఏటేటా డిమాండ్ పెరుగుతోంది. ఉన్నత చదువులు..ఉద్యోగాలు..టూరిస్ట్ వీసాలపై విదేశాలకు వెళ్లేవారు ఐడీపీ కోసం ఆర్టీఏ కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు. హైదరాబాద్ నుంచి వివిధ దేశాలకు వెళ్లిన నగరవాసుల్లో ఈ ఏడాది 42,471 మంది ఐడీపీ తీసుకున్నారు. – సాక్షి, హైదరాబాద్అమెరికాకే ఎక్కువగా.. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం ఏటా లక్షలాది మంది తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకు వెళుతున్నారు. వారే పెద్దసంఖ్యలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ తీసుకుంటున్నారు. అమెరికాతోపాటు అన్ని దేశాల్లోనూ మన డ్రైవింగ్ లైసెన్సులను అనుమతించడం వల్ల డిమాండ్ ఎక్కువగా ఉందని ఆర్టీఏ అధికారులు తెలిపారు. వివిధ ఆర్టీఏ కార్యాలయాల్లో నగరవాసులు తీసుకొనే ఐడీపీలో 60 % వరకు అమెరికాలో డ్రైవింగ్ కోసమే కావడం గమనార్హం. హెచ్ 4 వీసాపై డిపెండెంట్‌గా వెళుతున్న మహిళలు అక్కడకు వెళ్లిన తర్వాత ఉద్యోగాన్వేషణలో భాగంగా డ్రైవింగ్ తప్పనిసరిగా భావిస్తున్నారు. అలా ఐడీపీలు తీసుకుంటున్న మహిళల సంఖ్య కూడా ఏటా పెరు గుతూనే ఉంది. ‘హైదరాబాద్‌లో కారు డ్రైవింగ్ వస్తే చాలు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరుగులు తీయొచ్చు. అందుకే ఎక్కువ మంది ఐడీపీల కోసం వస్తారు.’అని ఆర్టీఏ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అమెరికా తర్వాత మలేసియా, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రిటన్, స్విట్జర్లాండ్, దక్షిణాఫ్రికా, స్వీడన్, సింగపూర్, హాంకాంగ్, స్పెయిన్, ఫ్రాన్స్, ఫిన్లాండ్, ఇటలీ, మారిషస్, ఐర్లాండ్ తదితర దేశాల్లో ఇండియన్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్లను అనుమతిస్తున్నారు. » అమెరికాతోపాటు కొన్ని దేశాల్లో ఏడాదిపాటు అనుమతిస్తుండగా, యూరోప్ దేశాల్లో 6 నెలల వరకు మాత్రమే అనుమతి ఉంది.» ఐడీపీపై మలేసియాలో బండి నడపాలంటే ఆ దేశ అధికార భాష మలేలోకి ఐడీపీ వివరాలు నమోదు చేసుకోవాలి. భారత రాయబార కార్యాలయం నుంచి ఈ సదుపాయం లభిస్తుంది. » ఫ్రాన్స్‌లోనూ ఐడీపీని ఫ్రెంచిలోకి తర్జుమా చేసుకోవడం తప్పనిసరి. » ఆ్రస్టేలియాలో మూడు నెలల వరకే అనుమతి ఉంటుంది. » కెనడాలో మూడు నెలల్లోపు అక్కడి నిబంధనల మేరకు లైసెన్సు తీసుకోవాలి. ఐడీపీ ఈజీనే... » అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ తీసుకోవడం ఎంతో తేలిక. నగరంలోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, ఉప్ప ల్, మెహదీపట్నం, మణికొండ, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, మలక్‌పేట్, కూకట్పల్లి, బండ్లగూడ, తదితర ఆర్టీఏ కార్యాలయాల నుంచి ఐడీపీ తీసుకోవచ్చు. పాస్‌పోర్టు, వీసాతో పాటు, పర్మనెంట్ లైసెన్సు డాక్యుమెంట్లను అందజేసి రూ.1500 ఫీజు చెల్లించాలి. సాధారణంగా అన్ని రకాల ఆర్టీఏ సేవలు ఆన్లైన్లో లభిస్తుండగా, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ మాత్రం అధికారులు నేరుగా దరఖాస్తుదారులకే అందజేస్తారు. స్పెయిన్‌లో డ్రైవింగ్ చేశా.. విదేశాలకు ఎక్కువగా వెళతాను. అక్కడికి వెళ్లిన తర్వాత బంధువులు, స్నేహితుల వాహనాలు అందుబాటులో ఉంటాయి. కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వల్ల ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. దీంతో హైదరాబాద్ నుంచి ఐడీపీతో వెళితే ఆ ఇబ్బంది ఉండదు. స్పెయిన్‌లో మూడు నెలలు ఐడీపీతోనే డ్రైవింగ్ చేశాను. – సుబ్బారెడ్డి, టూరిస్టు థాయ్‌లాండ్‌లో రైట్ డ్రైవింగే డాక్యుమెంటరీల షూటింగ్‌కు తరచుగా విదేశాలకు వెళతా. ఇటీవల థాయ్‌లాండ్‌లో ఓ డాక్యుమెంటరీ షూటింగ్ సందర్భంగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్‌తో వెళ్లాను. అక్కడ మన ఇండియాలోలాగే రైట్ డ్రైవింగ్. ఏ ఇబ్బంది లేకుండా హాయిగా కారులో అన్ని చోట్లకు వెళ్లాను. – మిద్దె బాలరాజు, ఆర్టిస్ట్ జర్మనీలో నిబంధనలు కఠినం.. జర్మనీలో మన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్లపై బండి నడపడం చాలా కష్టం. మన డ్రైవింగ్ లైసెన్స్‌ను వారు పరిగణనలోకి తీసుకోలేదు. స్టూడెంట్‌గా వెళ్లాను. ఇప్పుడు ఉద్యోగం చేస్తూ జర్మనీలోనే ఉంటున్నారు. మొదట్లో హైదరాబాద్ నుంచి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ తీసుకొని వెళ్లగా, 6 నెలలు మాత్రమే అనుమతించారు. ఉద్యోగరీత్యా అక్కడే ఉండాల్సి రావడంతో అక్కడి నిబంధనల మేరకు మొదట లెర్నింగ్, ఆ తర్వాత పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నా. జర్మనీలో నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. – తన్యా కొండ -
లైసెన్స్‌కు అప్లై చేసిన బన్నీ.. అందుకోసమేనా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్‌లో సందడి చేశారు, ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే బన్నీ అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేయడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఇతర దేశాల్లో రోడ్ ట్రిప్ వెళ్లేవారు తప్పనిసరిగా ఈ లైసెన్స్ తీసుకుంటారు. కానీ అల్లు అర్జున్ ఎందుకు తీసుకుంటున్నారన్న దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. విదేశాల్లో పుష్ప-2 షూటింగ్ కోసమే లైసెన్స్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో జపాన్‌లో పుష్ప-2 షూటింగ్ జరగనుందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అందుకోసమే దరఖాస్తు చేసి ఉండవచ్చని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్ షెడ్యూల్ నంద్యాల జిల్లాలోని యాగంటి క్షేత్రంలో జరుగుతోంది. అక్కడ ఆలయంలో రష్మిక మందన్నాపై ముఖ్యమైన సీన్స్ తెరకెక్కించారు. దీనికి సంబంధించిన ఫోటోలను రష్మిక ఇన్‌స్టాలో పంచుకున్నారు. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బన్నీ లైసెన్స్ అప్లై చేయడం చూస్తే త్వరలోనే విదేశాల్లో షూటింగ్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇప్పటికే పుష్ప-2 సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు సుకుమార్ ప్రకటించారు. ఈ మూవీ వాయిదా పడే ఛాన్స్ లేదని గతంలోనే చెప్పారు. -
అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సులకు డిమాండ్.. ఇక్కడ లైసెన్స్ తీసుకొని..
సాక్షి, తిమ్మాపూర్(మానకొండూర్): ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారుతోంది. ఎంత ప్రతిభ ఉన్నా ఉద్యోగసాధనలో కొంతమంది విఫలం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యువకులు మోటార్డ్రైవింగ్పై ఆసక్తి చూపుతున్నారు. డ్రైవింగ్‌లో అవకాశాలు మెండుగా ఉండటం, విదేశాల్లో మంచి వేతనాలు లభిస్తుండటంతో ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. అంతర్జాతీయస్థాయి లైసెన్స్‌లు పొందేందుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. తెలంగాణ రోడ్లపై కారు నడిపినా, బైక్ నడిపినా ప్రపంచంలోఎక్కడైనా సరే ఇట్టే దూసుకుపోవచ్చు. ఇరుకైన రోడ్లు, వాహనాల రద్దీ, ట్రాఫిక్ నిబంధనలు, నిరంతర అప్రమత్తత వాహనదారులకు ప్రతీరోజు పాఠాలు నేర్పుతూనే ఉంటాయి. అందుకే ఇక్కడ వాహనాలు నడిపేవాళ్లు విదేశీ రహదారులపై పరుగు పెడుతున్నారు. ఈ కారణంగా కూడా అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సులకు డిమాండ్ పెరుగుతోంది. నిత్యం పదుల సంఖ్యలో జారీ కరీంనగర్ ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతీరోజు సాధారణ డ్రైవింగ్ లైసెన్సులతోపాటు పదుల సంఖ్యలో అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సులు జారీ అవుతున్నాయి. 2021లో ఇప్పటి వరకు 381 ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్సులు అందజేశారు. ఈ లైసెన్సులకు అంతర్జాతీయస్థాయిలో సముచితమైన గుర్తింపు, అర్హత ఉండడమే ఇందుకు కారణం. విద్య, ఉద్యోగం, వ్యాపారం కోసం వెళ్లేవాళ్లే కాదు.. పర్యాటక వీసాలపైన వెళ్లేవాళ్లు, బంధువుల ఇళ్లకు వెళ్లేవాళ్లు సైతం తప్పనిసరిగా అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సులు తీసుకుంటున్నారు. చదవండి: తీన్మార్ మల్లన్నపై బీజేపీ సీరియస్! హిమాన్షును అలా అనలేదని వివరణ? ఏడాది పాటు చెల్లుబాటు తెలంగాణ రవాణాశాఖ అందజేసే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్సులకు విదేశాల్లో ఏడాది పాటు చెల్లుబాటు ఉంటుంది. ఇక్కడ తీసుకున్న లైసెన్సుల ఆధారంగా ఆయా దేశాల్లో బండి నడిపేందుకు అనుమతినిస్తారు. ఒకవేళ విదేశాల్లో శాశ్వత డ్రైవింగ్ లైసెన్సు తీసుకోవాలంటే అక్కడి నిబంధనల మేరకు లైసెన్సులు తీసుకోవలసి ఉంటుంది. చాలా దేశాల్లో ఈ నిబంధనలు కఠినంగా ఉండడం వల్ల ఎక్కువ మంది ఇక్కడినుంచి ఇంటర్నేషనల్ లైసెన్సులను తీసుకుంటున్నారు. అమెరికాతోపాటు అన్ని యురోప్ దేశాల్లో, ఆసియా దేశాల్లో మన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్సులకు ఏడాది పాటు చెల్లుబాటు ఉండడం వల్ల అక్కడికి వెళ్లిన వెంటనే వాహనం నడిపేందుకు అవకాశం లభిస్తుంది. ఏడాది దాటిన తరువాత కూడా అక్కడే ఉండాలనుకుంటే తప్పనిసరిగా అక్కడి నిబంధనలకు అనుగుణంగా లైసెన్సుతీసుకోవలసిందే. ఇవీ నిబంధనలు సొంతదేశంలో లైసెన్సుఉండాలి: చాలా మంది భారతీయులు ఈ రోజుల్లో విదేశాల్లో నివా సముంటున్నారు.ఎన్ఆర్ఐలుగా ఆయా దేశాల్లో ఉంటున్న వీరు అక్కడడ్రైవింగ్ చేయాలంటే తప్పనిసరిగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసె న్సు కావాలి. ఇందుకోసం ముందుగా సొంతదేశంలో లైసెన్సును కలిగి ఉండాలి. ఇది లేకపోతే కుదరదు. ఇందుకోసం అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సుకు దరఖాస్తు చేసుకోవాలి. ► పాస్ పోర్టు తప్పనిసరి: అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసే టప్పుడు సొంత దేశంలో లైసెన్సుతో పాటు పాస్‌పోర్టును సమర్పించాలి. దీని వాలిడిటీ పీరియడ్ కనీసం ఆరు నెలలు ఉండాలి. ► ఎయిర్‌లైన్ టిక్కెట్: అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సుకు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఏ దేశమైతే మీరు వెళ్తున్నారు.. అందుకు సంబంధించిన ఎయిర్ లైన్ టిక్కెట్ పొందుపరచాలి. మీ రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారి ప్రకారం కొన్నిసార్లు రిటర్న్ ఎయిర్ లైన్ టిక్కెట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. ► వీసా: పైన చెప్పిన పత్రాలతో పాటు మీరు ఏ దేశమైతే వెళ్తున్నారో ఆ దేశానికి సంబంధించిన వీసా కూడా వీటికి జత చేయాలి. ఒకవేళ వీసా త్వరలో వస్తుందనుకుంటే అందుకు సంబంధించిన ప్రూఫ్ సమర్పించాలి. ► ఫొటోలు: లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు పొందుపరచాలి. దీంతోపాటు ఫామ్ సీఎంవీ4 అప్లికేషన్ ఫిల్ చేసి స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో సమర్పించాలి. ► మెడికల్ ప్రూఫ్: మీరు శారీరకంగా ధ్రుడంగా ఉన్నారా లేరా అని తెలుసుకునేందుకు ప్రభుత్వంచేత గుర్తింపు పొందిన వైద్యుడు ధ్రువీకరించిన మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాలి. వేరే దేశంలో నివసిస్తున్నట్లయితే ఆర్టీఓ జారీ చేసిన నో అబ్జక్షన్ సర్టిఫికెట్‌ను సమర్పించాలి. ► ఫీజు: ఈ మొత్తం ప్రొసెస్ చేసేందుకు రీజనల్ ట్రాఫిక్ ఆఫీస్ (ఆర్టీఓ)లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసేసమయంలో కొంత మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించాలి. అప్లికేషన్ సమర్పించిన రెండు మూడు రోజుల అనంతరం మీ దరఖాస్తును సంబంధిత అధికారులు ఆమోదించి తర్వాతే కార్యచరణకు పిలుపునిస్తారు. అప్పుడు పరీక్షలో పాసైతే.. లెర్నింగ్ జారీ చేస్తారు. విదేశాల్లో ఉపాధికి తోడ్పాటు.. సంవత్సరం పాటు టూరిజం వాళ్లతోపాటు విదేశాల్లో స్థిరపడ్డవ్యక్తులకు డ్రైవింగ్ ద్వారా ఉపాధి పొందాలనుకునేవారికి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉపయోగపడుతుంది. మన దేశం తీసుకున్న లైసెన్స్ అక్కడ లెర్నింగ్‌గా ఉపయోగించుకోవచ్చు. ఈ లైసెన్స్ ద్వారా అక్కడి దేశాల్లో లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు. ఈ లైసెన్స్ ఉంటే వారికి త్వరగా లైసెన్స్ వస్తుంది. – మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, డీటీసీ -
ఓ జ్ఞాపకం.. నెట్టింట్లో వైరల్‌గా కేటీఆర్ ఫొటో
సాక్షి, హైదరాబాద్: ‘1998లో జారీ చేసిన నా అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కన్పిం చింది. (గత శతాబ్దపు నాటిది). ఇదో జ్ఞాపకం’ అని పేర్కొంటూ మంత్రి కేటీఆర్ ఆదివారం తన అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఫొటోలను ట్వీట్ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్‌పై అతికించి ఉన్న యువ కేటీఆర్ ఫొటో నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. -
అమ్మాయిలు అదరగొట్టారు
సాక్షి, హైదరాబాద్: విదేశీ రహదారులపై హైదరాబాదీ మహిళలు దూసుకెళ్తున్నారు. చదువు, ఉద్యోగం, వ్యా పారం తదితరాల కోసం ఇతర దేశాలకు వెళ్తున్న వనిత లు.. అక్కడ సొంత డ్రైవింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ పొందిన వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారంటే వ్యక్తిగత వాహనాల వినియోగానికి వారు ఎంత ప్రాధాన్యమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది ఇప్పటివరకు 14,365 మంది పర్మిట్ తీసుకోగా అందులో 8, 549 మంది మహిళలే ఉన్నారు. విదేశాల్లో ప్రజా రవాణా తక్కువగా ఉండటం, వ్యక్తిగత డ్రైవింగ్ తప్పనిసరి కావడం, పటిష్టమైన రహదారి భద్రత నిబంధనలు కూడా తోడవడంతో సొంత డ్రైవింగ్‌పై ఆసక్తి చూపుతున్నారు. సొంత వాహనాలకే ప్రాధాన్యం అమెరికా వంటి దేశాల్లో చాలా ప్రాంతాల్లో ప్రజా రవాణా తక్కువ. దీంతో ప్రతి ఒక్కరూ సొంత వాహనాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. అయితే హైదరాబాద్‌లో సొంత వాహనాలపై పరుగులు తీసిన వాళ్లు విదేశాల్లో మరింత ఉత్సాహంగా దూసుకెళ్తున్నారు. నగరంలో పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్‌లో వాహనాలు నడిపిన వారికి అక్కడ డ్రైవింగ్ సులువవుతోంది. కొద్దిపాటి మెళకువలతో చక్కగా డ్రైవింగ్ చేస్తున్నారు. అక్కడి పటిష్టమైన రహదారి భద్రత నిబంధనలు, సురక్షిత డ్రైవింగ్‌కు ఎక్కువ అవకాశాలు ఉండటం, ట్రాఫిక్ తక్కువగా ఉండటం ఇందుకు దోహదపడుతున్నాయి. రహదారులు, ట్రాఫిక్‌కు అనుగుణమైన వేగ నియంత్రణ విధానం, పోలీసుల నిఘా కూడా వాహనదారులకు భరోసా ఇస్తున్నాయి. దీంతో నగరం నుంచి వెళ్తున్న వారు సొంత వాహనాలకే ప్రాధాన్యమిస్తున్నారు. వెంటనే పర్మిట్ అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ తీసుకోవడం చాలా తేలిక. పాస్‌పోర్టు, వీసా తీసుకున్న నగరవాసులు.. రవాణా శాఖ అధికారిక వెబ్సైట్లో అంతర్జాతీయ పర్మిట్ కోసం స్లాట్ నమోదు చేసుకొని ఆన్లైన్ ద్వారా లేదా ఈ–సేవలో రూ.1,500 ఫీజు చెల్లించాలి. స్లాట్ ప్రకారం ఆర్టీఏ అధికారులను సంప్రదిస్తే అదే రోజు పర్మిట్ అందజేస్తారు. ఆయా దేశాల్లో ఏడాది పాటు ఇది చెల్లుబాటులో ఉంటుంది. ఆ లోపు అక్కడి నిబంధనల మేరకు లైసెన్సు తీసుకుంటే చాలు. గ్రేటర్లో 48 వేల పర్మిట్లు రాష్ట్రంలో ఇప్పటివరకు 68,078 అంతర్జాతీయ పర్మిట్లు ఇచ్చారు. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే 48 వేల వరకు ఉన్నాయి. పర్మిట్లు ఏటా 10–15 శాతం పెరుగుతున్న రవాణా అధికారులు అంచనా వేస్తున్నారు. ‘మన దగ్గర జూన్‌లో స్కూళ్లు, విద్యా సంస్థలు తెరుచుకున్నట్లు అక్కడ ఆగస్టులో ప్రారంభమవుతాయి. దీంతో అప్పటివరకు సెలవుల కోసం నగరానికి వచ్చిన వారు తిరిగి వెళ్లే సమయంలో తప్పనిసరిగా అంతర్జాతీయ పర్మిట్లతో వెళ్తున్నారు. సాధారణంగా ఆగస్టు, డిసెంబర్ నెలల్లో ఎక్కువ మంది అంతర్జాతీయ పర్మిట్ల కోసం వస్తున్నారు’అని ఓ ఆర్టీఏ అధికారి తెలిపారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాల కోసం ఎక్కువ మంది పర్మిట్లు తీసుకుంటున్నట్లు చెప్పారు. గత నాలుగేళ్లలో పర్మిట్లు పొందిన వారిలో మగవారు ఎక్కువగా ఉండగా.. ఈ సారి మాత్రం మహిళలు ఎక్కువగా ఉన్నారు. -
కేటీఆర్‌కు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్
హైదరాబాద్ సిటీ: తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లిన ఆయన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ను పొందారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కు రవాణాశాఖ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు.