సాక్షి, తిమ్మాపూర్(మానకొండూర్): ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారుతోంది. ఎంత ప్రతిభ ఉన్నా ఉద్యోగసాధనలో కొంతమంది విఫలం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యువకులు మోటార్‌డ్రైవింగ్‌పై ఆసక్తి చూపుతున్నారు. డ్రైవింగ్‌లో అవకాశాలు మెండుగా ఉండటం, విదేశాల్లో మంచి వేతనాలు లభిస్తుండటంతో ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు.
అంతర్జాతీయస్థాయి లైసెన్స్‌లు పొందేందుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. తెలంగాణ రోడ్లపై కారు నడిపినా, బైక్ నడిపినా ప్రపంచంలోఎక్కడైనా సరే ఇట్టే దూసుకుపోవచ్చు. ఇరుకైన రోడ్లు, వాహనాల రద్దీ, ట్రాఫిక్ నిబంధనలు, నిరంతర అప్రమత్తత వాహనదారులకు ప్రతీరోజు పాఠాలు నేర్పుతూనే ఉంటాయి. అందుకే ఇక్కడ వాహనాలు నడిపేవాళ్లు విదేశీ రహదారులపై పరుగు పెడుతున్నారు. ఈ కారణంగా కూడా అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సులకు డిమాండ్ పెరుగుతోంది.
నిత్యం పదుల సంఖ్యలో జారీ
కరీంనగర్ ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతీరోజు సాధారణ డ్రైవింగ్ లైసెన్సులతోపాటు పదుల సంఖ్యలో అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సులు జారీ అవుతున్నాయి. 2021లో ఇప్పటి వరకు 381 ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్సులు అందజేశారు. ఈ లైసెన్సులకు అంతర్జాతీయస్థాయిలో సముచితమైన గుర్తింపు, అర్హత ఉండడమే ఇందుకు కారణం. విద్య, ఉద్యోగం, వ్యాపారం కోసం వెళ్లేవాళ్లే కాదు.. పర్యాటక వీసాలపైన వెళ్లేవాళ్లు, బంధువుల ఇళ్లకు వెళ్లేవాళ్లు సైతం తప్పనిసరిగా అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సులు తీసుకుంటున్నారు.
చదవండి: తీన్మార్ మల్లన్నపై బీజేపీ సీరియస్! హిమాన్షును అలా అనలేదని వివరణ?
ఏడాది పాటు చెల్లుబాటు
తెలంగాణ రవాణాశాఖ అందజేసే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్సులకు విదేశాల్లో ఏడాది పాటు చెల్లుబాటు ఉంటుంది. ఇక్కడ తీసుకున్న లైసెన్సుల ఆధారంగా ఆయా దేశాల్లో బండి నడిపేందుకు అనుమతినిస్తారు. ఒకవేళ విదేశాల్లో శాశ్వత డ్రైవింగ్ లైసెన్సు తీసుకోవాలంటే అక్కడి నిబంధనల మేరకు లైసెన్సులు తీసుకోవలసి ఉంటుంది. చాలా దేశాల్లో ఈ నిబంధనలు కఠినంగా ఉండడం వల్ల ఎక్కువ మంది ఇక్కడినుంచి ఇంటర్నేషనల్ లైసెన్సులను తీసుకుంటున్నారు. అమెరికాతోపాటు అన్ని యురోప్ దేశాల్లో, ఆసియా దేశాల్లో మన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్సులకు ఏడాది పాటు చెల్లుబాటు ఉండడం వల్ల అక్కడికి వెళ్లిన వెంటనే వాహనం నడిపేందుకు అవకాశం లభిస్తుంది. ఏడాది దాటిన తరువాత కూడా అక్కడే ఉండాలనుకుంటే తప్పనిసరిగా అక్కడి నిబంధనలకు అనుగుణంగా లైసెన్సుతీసుకోవలసిందే.
ఇవీ నిబంధనలు
సొంతదేశంలో లైసెన్సుఉండాలి: చాలా మంది భారతీయులు ఈ రోజుల్లో విదేశాల్లో నివా సముంటున్నారు.ఎన్‌ఆర్‌ఐలుగా ఆయా దేశాల్లో ఉంటున్న వీరు అక్కడడ్రైవింగ్ చేయాలంటే తప్పనిసరిగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసె న్సు కావాలి. ఇందుకోసం ముందుగా సొంతదేశంలో లైసెన్సును కలిగి ఉండాలి. ఇది లేకపోతే కుదరదు. ఇందుకోసం అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సుకు దరఖాస్తు చేసుకోవాలి.
► పాస్ పోర్టు తప్పనిసరి: అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసే టప్పుడు సొంత దేశంలో లైసెన్సుతో పాటు పాస్‌పోర్టును సమర్పించాలి. దీని వాలిడిటీ పీరియడ్ కనీసం ఆరు నెలలు ఉండాలి.
► ఎయిర్‌లైన్ టిక్కెట్: అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్సుకు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఏ దేశమైతే మీరు వెళ్తున్నారు.. అందుకు సంబంధించిన ఎయిర్ లైన్ టిక్కెట్ పొందుపరచాలి. మీ రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ అధికారి ప్రకారం కొన్నిసార్లు రిటర్న్ ఎయిర్ లైన్ టిక్కెట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది.
► వీసా: పైన చెప్పిన పత్రాలతో పాటు మీరు ఏ దేశమైతే వెళ్తున్నారో ఆ దేశానికి సంబంధించిన వీసా కూడా వీటికి జత చేయాలి. ఒకవేళ వీసా త్వరలో వస్తుందనుకుంటే అందుకు సంబంధించిన ప్రూఫ్ సమర్పించాలి.
► ఫొటోలు: లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు పొందుపరచాలి. దీంతోపాటు ఫామ్ సీఎంవీ4 అప్లికేషన్ ఫిల్ చేసి స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో సమర్పించాలి.
► మెడికల్ ప్రూఫ్: మీరు శారీరకంగా ధ్రుడంగా ఉన్నారా లేరా అని తెలుసుకునేందుకు ప్రభుత్వంచేత గుర్తింపు పొందిన వైద్యుడు ధ్రువీకరించిన మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాలి. వేరే దేశంలో నివసిస్తున్నట్లయితే ఆర్టీఓ జారీ చేసిన నో అబ్జక్షన్ సర్టిఫికెట్‌ను సమర్పించాలి.
► ఫీజు: ఈ మొత్తం ప్రొసెస్ చేసేందుకు రీజనల్ ట్రాఫిక్ ఆఫీస్ (ఆర్టీఓ)లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసేసమయంలో కొంత మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించాలి. అప్లికేషన్ సమర్పించిన రెండు మూడు రోజుల అనంతరం మీ దరఖాస్తును సంబంధిత అధికారులు ఆమోదించి తర్వాతే కార్యచరణకు పిలుపునిస్తారు. అప్పుడు పరీక్షలో పాసైతే.. లెర్నింగ్ జారీ చేస్తారు.
విదేశాల్లో ఉపాధికి తోడ్పాటు..
సంవత్సరం పాటు టూరిజం వాళ్లతోపాటు విదేశాల్లో స్థిరపడ్డవ్యక్తులకు డ్రైవింగ్ ద్వారా ఉపాధి పొందాలనుకునేవారికి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉపయోగపడుతుంది. మన దేశం తీసుకున్న లైసెన్స్ అక్కడ లెర్నింగ్‌గా ఉపయోగించుకోవచ్చు. ఈ లైసెన్స్ ద్వారా అక్కడి దేశాల్లో లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు. ఈ లైసెన్స్ ఉంటే వారికి త్వరగా లైసెన్స్ వస్తుంది.
– మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, డీటీసీ
Comments
Please login to add a commentAdd a comment