అమ్మాయిలు అదరగొట్టారు  | Womens is top At International driving permits in the state | Sakshi
Sakshi News home page

అమ్మాయిలు అదరగొట్టారు 

Published Tue, Aug 14 2018 1:11 AM | Last Updated on Tue, Aug 14 2018 7:14 AM

Womens is top At International driving permits in the state - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విదేశీ రహదారులపై హైదరాబాదీ మహిళలు దూసుకెళ్తున్నారు. చదువు, ఉద్యోగం, వ్యా పారం తదితరాల కోసం ఇతర దేశాలకు వెళ్తున్న వనిత లు.. అక్కడ సొంత డ్రైవింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది అంతర్జాతీయ డ్రైవింగ్‌ పర్మిట్‌ పొందిన వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారంటే వ్యక్తిగత వాహనాల వినియోగానికి వారు ఎంత ప్రాధాన్యమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది ఇప్పటివరకు 14,365 మంది పర్మిట్‌ తీసుకోగా అందులో 8, 549 మంది మహిళలే ఉన్నారు. విదేశాల్లో ప్రజా రవాణా తక్కువగా ఉండటం, వ్యక్తిగత డ్రైవింగ్‌ తప్పనిసరి కావడం, పటిష్టమైన రహదారి భద్రత నిబంధనలు కూడా తోడవడంతో సొంత డ్రైవింగ్‌పై ఆసక్తి చూపుతున్నారు.  

సొంత వాహనాలకే ప్రాధాన్యం 
అమెరికా వంటి దేశాల్లో చాలా ప్రాంతాల్లో ప్రజా రవాణా తక్కువ. దీంతో ప్రతి ఒక్కరూ సొంత వాహనాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. అయితే హైదరాబాద్‌లో సొంత వాహనాలపై పరుగులు తీసిన వాళ్లు విదేశాల్లో మరింత ఉత్సాహంగా దూసుకెళ్తున్నారు. నగరంలో పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్‌లో వాహనాలు నడిపిన వారికి అక్కడ డ్రైవింగ్‌ సులువవుతోంది. కొద్దిపాటి మెళకువలతో చక్కగా డ్రైవింగ్‌ చేస్తున్నారు. అక్కడి పటిష్టమైన రహదారి భద్రత నిబంధనలు, సురక్షిత డ్రైవింగ్‌కు ఎక్కువ అవకాశాలు ఉండటం, ట్రాఫిక్‌ తక్కువగా ఉండటం ఇందుకు దోహదపడుతున్నాయి. రహదారులు, ట్రాఫిక్‌కు అనుగుణమైన వేగ నియంత్రణ విధానం, పోలీసుల నిఘా కూడా వాహనదారులకు భరోసా ఇస్తున్నాయి. దీంతో నగరం నుంచి వెళ్తున్న వారు సొంత వాహనాలకే ప్రాధాన్యమిస్తున్నారు.  

వెంటనే పర్మిట్‌ 
అంతర్జాతీయ డ్రైవింగ్‌ పర్మిట్‌ తీసుకోవడం చాలా తేలిక. పాస్‌పోర్టు, వీసా తీసుకున్న నగరవాసులు.. రవాణా శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అంతర్జాతీయ పర్మిట్‌ కోసం స్లాట్‌ నమోదు చేసుకొని ఆన్‌లైన్‌ ద్వారా లేదా ఈ–సేవలో రూ.1,500 ఫీజు చెల్లించాలి. స్లాట్‌ ప్రకారం ఆర్టీఏ అధికారులను సంప్రదిస్తే అదే రోజు పర్మిట్‌ అందజేస్తారు. ఆయా దేశాల్లో ఏడాది పాటు ఇది చెల్లుబాటులో ఉంటుంది. ఆ లోపు అక్కడి నిబంధనల మేరకు లైసెన్సు తీసుకుంటే చాలు.   

గ్రేటర్‌లో 48 వేల పర్మిట్లు 
రాష్ట్రంలో ఇప్పటివరకు 68,078 అంతర్జాతీయ పర్మిట్లు ఇచ్చారు. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోనే 48 వేల వరకు ఉన్నాయి. పర్మిట్లు ఏటా 10–15 శాతం పెరుగుతున్న రవాణా అధికారులు అంచనా వేస్తున్నారు. ‘మన దగ్గర జూన్‌లో స్కూళ్లు, విద్యా సంస్థలు తెరుచుకున్నట్లు అక్కడ ఆగస్టులో ప్రారంభమవుతాయి. దీంతో అప్పటివరకు సెలవుల కోసం నగరానికి వచ్చిన వారు తిరిగి వెళ్లే సమయంలో తప్పనిసరిగా అంతర్జాతీయ పర్మిట్లతో వెళ్తున్నారు. సాధారణంగా ఆగస్టు, డిసెంబర్‌ నెలల్లో ఎక్కువ మంది అంతర్జాతీయ పర్మిట్ల కోసం వస్తున్నారు’అని ఓ ఆర్టీఏ అధికారి తెలిపారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాల కోసం ఎక్కువ మంది పర్మిట్లు తీసుకుంటున్నట్లు చెప్పారు. గత నాలుగేళ్లలో పర్మిట్లు పొందిన వారిలో మగవారు ఎక్కువగా ఉండగా.. ఈ సారి మాత్రం మహిళలు ఎక్కువగా ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement