సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని రెండు ప్రధాన రూట్‌లతో రైల్వే ప్రాజెక్టులకు లైన్‌క్లియర్ అయ్యింది. ముద్ఖేడ్–మేడ్చల్–మహబూబ్‌నగర్–డోన్, గుంటూరు–బీబీనగర్ సెక్షన్ల మధ్య రెండో రైల్వేలైన్ చేపట్టేందుకు మార్గం సుగమమైంది. వాస్తవానికి ఈ రెండు రైల్వే రూట్‌లలో ప్రాజెక్టులు ఎన్నో ఏళ్ల క్రితమై మంజూరై, సర్వేలు కూడా చేశారు. కానీ ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదు. బుధవారం ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఏడు ప్రాజెక్టులకు మొత్తం రూ.32,512.39 కోట్ల అంచనా వ్యయంతో ఆమోదం తెలిపింది.
బుధవారం ప్రధాని అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశ అనంతరం కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర సమాచారప్రసార శాఖ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్‌లు కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు. ఏడు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుల్లో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, గుజరాత్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 35 జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న రైల్వే నెట్‌వర్క్‌ల అభివృద్ధి మరింత జరుగుతుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా మారే ముద్ఖేడ్– డోన్, గుంటూరు– బీబీనగర్ ప్రాజెక్టులను రూ. 7,539 కోట్ల నిధులతో చేపట్టనున్నారు. వచ్చే బడ్జెట్‌లో వీటికి నిధులు మంజూరు చేస్తారు.
► సికింద్రాబాద్ టు డోన్, సికింద్రాబాద్ టు ముద్ఖేడ్ వరకు డబ్లింగ్ పనులు రెండు భాగాలుగా కొనసాగుతాయి.
► సికింద్రాబాద్ టు ముద్ఖేడ్ రూట్‌ను ఒక్కసారి పరిశీలిస్తే...సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్ రెండోదశ కింద రెండో లైన్ పూర్తయింది. ఇప్పుడు మేడ్చల్ నుంచి ముద్ఖేడ్ వరకు వయా నిజామాబాద్ మీదుగా డబ్లింగ్ పనులు చేయాల్సి ఉంటుంది.
► ఇక సికింద్రాబాద్ టు డోన్ రూట్‌లో ఇప్పటికే మహబూబ్‌నగర్ వరకు డబ్లింగ్ పూర్తయింది. ఇప్పుడు మహబూబ్‌నగర్ నుంచి డోన్ వరకు రెండో రైల్వేలైన్ పనులు చేపడతారు.
► సికింద్రాబాద్ టు ముద్ఖేడ్ రూట్‌లో ప్రస్తుతం సింగిల్ రూట్ ఉన్న కారణంగా లైన్ సామర్థ్య వినియోగం 167 శాతానికి చేరుకుంది. ట్రాఫిక్ అధికంగా ఉండటం, సామర్థ్యానికి మించి రైళ్లు తిరుగుతుండటంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. డిమాండ్ దృష్ట్యా కొత్త రైళ్లు నడపటం సాధ్యం కావటం లేదు. దీంతో డబ్లింగ్ అనివార్యమైంది. మూడేళ్ల క్రితమే ప్రాజెక్టు మంజూరు చేసినా, నిధుల విడుదలకు ఇప్పుడు మార్గం సుగమమైంది.
► ముద్ఖేడ్ ఆవల మన్‌మాడ్ వరకు వెళ్లి ప్రధాన ట్రంక్ లైన్‌తో కలుస్తుంది. ముద్ఖేడ్ తర్వాత పర్బణి–మన్మాడ్ మధ్య డబ్లింగ్ పూర్తి కాగా, ఇప్పుడు ఈ పనులు మొదలవుతున్నాయి. ఇది పూర్తయితే, అటు బెంగుళూరు నుంచి హైదరాబాద్ మీదుగా ముంబైకి అనుసంధానం అయ్యే ప్రధాన ప్రత్యా మ్నాయ మార్గంగా మారుతుంది. అప్పుడు బెంగుళూరు–హైదరాబాద్–ముంబై ప్రధాన నగరాల మధ్య ప్రయాణికుల రైళ్ల సంఖ్య పెరగటంతోపాటు వాటి వేగం పెరుగుతుంది. ట్రంక్ లైన్‌తో పోలిస్తే దూరం తగ్గి ప్రయాణ సమయం తగ్గుతుంది.
► బల్హర్షా–కాజీపేట–సికింద్రాబాద్, కాజీపేట –విజయవాడ సెక్షన్ల మధ్య కూడా ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. బల్హర్షా–రామగుండం–సికింద్రాబాద్–వాడి– గుంతకల్ సెక్షన్లకు బొగ్గు, స్టీల్ రవాణాకు ప్రత్యామ్నాయ మార్గంగా ఉంటుంది.
► హైదరాబాద్ నుంచి వరంగల్ రైల్వే రూట్‌లో బీబీనగర్‌కు డబ్లింగ్ ఉంది. ఇక్కడి నుంచి గుంటూరు మీదుగా తెనాలి వద్ద ప్రధాన లైన్‌ను కలిసే ప్రత్యామ్నాయమార్గంగా బీబీనగర్–గుంటూరు మధ్య రెండో లైన్ నిర్మా ణానికి రంగం సిద్ధమైంది. ఎట్టకేలకు ఇప్పుడు కేంద్రం కనికరం చూపి దానికి నిధులు మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే, హైదరాబాద్– విజయవాడ ప్రధాన లైన్‌పై ఒత్తిడి బాగా తగ్గుతుంది. ప్రస్తుతం ట్రంక్‌లైన్ సామర్థ్యానికి మించి 137 శాతం వినియోగంలో ఉంది.
ఫలితంగా కొత్త రైళ్లు నడిపేందుకు కష్టంగా మారింది. ౖòప్రధాన ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గించే కీలక ప్రాజెక్టు ఇప్పుడు ఎట్టకేలకు సాకారం కాబోతోంది. గుంటూరు–బీబీనగర్ సెక్షన్ లైన్ సామర్థ్య వినియోగం 148 శాతంగా ఉంది. రెండో లైన్‌నిర్మాణంతో ఆ సమస్య పరిష్కారమై కొత్త రైళ్లు ఆ మార్గంలో మళ్లించేందుకు అవకాశం ఉంటుంది. కొన్నేళ్లలో ఈ మార్గంలో కొత్తగా సిమెంటు కార్మాగారాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో గూడ్స్ రైళ్ల సంఖ్య కూడా పెరుగుతుంది.
ఈ రూట్‌లో ఉన్న ప్రధానమైనవి
► ఇనుము–ఉక్కు: చిట్యాల– నార్కట్‌పల్లి .
► సిమెంట్ ప్లాంట్లు: విష్ణుపురం, నడికుడి, తుమ్మలచెరువు, జాన్‌పహాడ్, మేళ్లచెరువు, మఠంపల్లి, జగ్గయ్యపేట, రామాపురం
► థర్మల్ పవర్ ప్లాంట్: విష్ణుపురం సమీపంలో 4000 ఎంవీ థర్మల్ ప్లాంట్ (అందుబాటులోకి రావాలి)
► ఆహార ధాన్యాలు: నాగిరెడ్డిపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ ఎఫ్‌సీఐలు
► ఇండ్రస్టియల్ క్లస్టర్: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విష్ణుపురం, నార్కట్‌పల్లి
► గిడ్డంగులు: హైదరాబాద్ చుట్టూ 100కి పైగా వేర్ హౌస్‌లు – గుంటూరు చుట్టూ 50కి పైగా కోల్డ్ స్టోరేజీలు
ఈ రూట్‌లో ఉన్న ప్రధానమైనవి
► బొగ్గు: రామగుండం, మంచిర్యాల, మందమర్రి
► ఆర్థిక కారిడార్లు: రాయచూరు–దేవరకద్ర, కర్నూలు –పీలేరు, కొడంగల్–మహబూబ్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్–చిట్యాల, సంగారెడ్డి–హైదరాబాద్, ముత్తంగి–మంచిరేవుల
► థర్మల్ పవర్ ప్లాంట్లు: పర్లి వద్ద మహా జెన్‌కో కర్ణాటకలోని రాయచూర్, యెర్మరస్‌లో కేపీసీసీ, ఆంధ్రప్రదేశ్‌లోని ముద్దనూరు వద్ద ఏపీజెన్‌కో
► ఆహార ధాన్యాల తరలింపు ప్రాంతాలు: ముద్ఖేడ్, బోధన్, నిజామాబాద్, కామారెడ్డి, జడ్చర్ల, మహబూబ్‌నగర్, కర్నూలు
► ఇండ్రస్టియల్ క్లస్టర్: హైదరాబాద్, నిజామాబాద్, నాందేడ్ , మెదక్, కర్నూలు, గద్వాల, ఇటిక్యాల, గుండ్లపోచంపల్లి, బహదూర్‌పల్లి
► గిడ్డంగులు–శీతల గిడ్డంగులు: నిజామాబాద్, బోధన్ , సారంగాపూర్ , బండమల్లారం , మహబూబ్‌నగర్, గద్వాల
ఖోర్దా రోడ్ –విజయ నగరం రూట్‌లో..
భద్రక్–విజయనగరం సెక్షన్‌లోని ఖోర్దా రోడ్–విజయనగరం రూట్‌లో ఒడిశాలోని భద్రక్, జజ్‌పూర్, ఖోర్దా, కటక్, గంజాం జిల్లాలో 184 కి.మీ, ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలోని 201 కి.మీ మేర మూడోలేన్ పనులు జరుగుతాయి. దీనికి రూ.5618.26 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఎంతగానో ఉపయోగపడే ముద్ఖేడ్ –మేడ్చల్, మహబూబ్‌నగర్ –డోన్ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసిన ప్రధాని మోదీ, రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌లకు ఎంపీ అరవింద్ ధన్యవాదాలు తెలిపారు. డబుల్ రైల్వేలైన్ పూర్తయితే నిజామాబాద్ నుంచి ముంబై, పూణె, షిరిడీలతో పాటు నిజామాబాద్ నుంచి బెంగళూరుల మధ్య రైల్వే కనెక్టివిటీ పెరగి, ప్రయాణ మార్గం సులభతరం అవుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment