సీఎం హోదాలో తొలిసారి బుధవారం సిద్దిపేటకు విచ్చేసిన కేసీఆర్‌కు వివిధ వర్గాలు..
సీఎంకు వినతుల వెల్లువ
సిద్దిపేట అర్బన్: సీఎం హోదాలో తొలిసారి బుధవారం సిద్దిపేటకు విచ్చేసిన కేసీఆర్‌కు వివిధ వర్గాలు, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాలను అందజేశారు. ఎంఐఎం పట్టణ అధ్యక్షులు అబ్దుల్ బషీర్ ఆధ్వర్యంలో మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌లు త్వరగా అమలు చేయాలని, అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని, కొండపాక మండలం బందారం దర్గా దారిని బీటీ రోడ్డుగా మార్చాలని, ముస్లింలకు కబ్రస్థాన్ కోసం 5 ఎకరాల భూమిని కేటాయించాలని, హజ్‌హౌస్ నిర్మాణం కోసం 2 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించి నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు అసెంబ్లీ ప్రాంగణంలోలాగా సిద్దిపేట మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో గాంధీ విగ్రహం పక్కన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజిరెడ్డి, భుజంగరావు, జిల్లా అధ్యక్షులు సడిమెల యాదగిరిల ఆధ్వర్యంలో ఉద్యోగుల సంక్షేమం కోసం పదవ పీఆర్సీని అమలు చేయడంతో పాటు, హెల్త్ కార్డుల పంపిణీ సత్వరమే చేపట్టాలని కోరారు. 63 శాతం ఫిట్ మెంట్‌తో పీఆర్సీని ప్రకటించాలని, సీనియర్ ఉపాధ్యాయుల, ఉద్యోగుల సర్వీసులను పరిగణలోకి తీసుకుని వెయిటేజ్ ఇంక్రిమెంట్‌లు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఆయుష్ పారా మెడికల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు యాదగిరి ఆధ్వర్యంలో ఉద్యోగులు సీఎంకు వినతి పత్రాన్ని అందజేశారు. పారా మెడికల్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, వేతనాలు పెంచాలని, ఖాళీలను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
మాల మహానాడు జిల్లా అధికార ప్రతినిధి కోదాది శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎంకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఎస్సీ, ఎస్టీ దళిత గిరిజనుల వ్యవసాయ భూముల అభివృద్ధి కోసం ఇందిర జలప్రభకు 10 నుంచి 5 ఎకరాలకు అమలు చేయాలని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నోడల్ ఏజెన్సీ ద్వారా దళిత గిరిజనుల వాడల్లో అభివృద్ధి పథకం కాంట్రాక్టు విధానం రద్దు చేసి దళిత, గిరిజన యువకులకు పని చేసుకునే విధానం అమలు చేయాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నోడల్ ఏజెన్సీ ద్వారా 1990 నుంచి ఇప్పటి వరకు తీసుకున్న రుణాలను రద్దు చేయాలని, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకు మంజూరు చేసిన నిధులను బ్యాంకు అనుబంధం పెట్టకుండా నిరుద్యోగ వాటా ద్వారా రూ. 2 లక్షల రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో పెట్టిన బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.