
సిద్దిపేట ‘వజ్రపు‘ తునక
‘సిద్దిపేట బిడ్డగా మూడు హామీలిచ్చా.. ఒకటి జిల్లా కేంద్రం.. ఇది త్వరలో సిద్ధిస్తుంది.
‘సిద్దిపేట బిడ్డగా మూడు హామీలిచ్చా.. ఒకటి జిల్లా కేంద్రం.. ఇది త్వరలో సిద్ధిస్తుంది. మరొకటి సిద్దిపేటకు రైల్వేలైన్. దీని కోసం వంద శాతం కృషి చేస్తున్నాం. ఇక మిగిలింది సాగునీరు. మంత్రి హరీష్ చొరవతో సాగునీరును సాధిస్తే ముచ్చటైన మూడు హామీల అమలుతో సిద్దిపేట వజ్రపు తునకగా మారుతుంది.’
- సీఎం హోదాలో సొంతగడ్డ సిద్దిపేట అభివృద్ధిపై కేసీఆర్ వ్యాఖ్యలు
సిద్దిపేట అర్బన్/జోన్: సిద్దిపేట తాగునీటి పథకం గురించి వివిధ శాఖల రాష్ర్ట అధికారులు, మంత్రులకు వివరించేందుకు తన సొంతగడ్డ సిద్దిపేటకు వచ్చిన సీఎం కేసీఆర్, తన పర్యటనలో భాగంగా బుధవారం స్థానిక ఎన్‌జీఓ భవన్ స్వర్ణోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్న నానుడిని తానూ నమ్ముతానన్నారు. సిద్దిపేట ప్రాంత అభివృద్ధికి తన మదిలో ముచ్చటైన మూడు హామీలున్నాయన్నారు. అందులో మొదటిది సిద్దిపేటను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడమన్నది కాగా, త్వరలో వంద శాతం సిద్దిపేట జిల్లా కావడం ఖాయమని స్పష్టం చేశారు.
అదే విధంగా రెండవ హామీ సిద్దిపేటకు రైల్వే లైన్ హామీ అనీ, దీనిపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తమవంతు వాటా చెల్లింపునకు సుముఖత వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాసిందన్నారు. త్వరలో ఈ రైల్వే కల సాకారం కానుందన్నారు. ఇక మిగిలింది పాతికేళ్లుగా సిద్దిపేటకు సాగునీరు సమస్య ప్రధానంగా ఉందన్నారు. సాగునీటి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని, తడ్కపల్లి శివారులో 30 టీఎంసీలతో భారీ రిజర్వాయర్‌ను నిర్మించి 145 గ్రామాలకు సాగునీరును అందిస్తామన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సిద్దిపేట నుంచే ప్రాతినిథ్యం వహిస్తుండడంతో సాగునీటి బాధ్యత ఆయనపైనే ఉందన్నారు. దీనికి ప్రభుత్వ పక్షాన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానన్నారు. మూడు కలలు నిజమైతే సిద్దిపేట వజ్రపు తునకగా మారుతుందన్నారు.
ఈ నేల చైతన్యానికి ప్రతీక
సిద్దిపేట ప్రాంతం కలలకు, ఉద్యమానికి, చైతన్యానికి, మేధావులకు నిలయమన్నారు. సిద్దిపేటలోని తాగునీటి పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ వాటర్ గ్రిడ్ నిర్వాహణకు శ్రీకారం చుట్టామన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ముఖ్య అధికారులతో సిద్దిపేటను సందర్శించినట్లు తెలిపారు. సిద్దిపేటలోని ఎన్‌జీఓ భవన్ పలు సామాజిక సేవ కార్యక్రమాలకు నిలయంగా మారిందన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆదర్శ వివాహం ఇదే భవనంలో జరగడం తనకు నేటి కీ గుర్తుందన్నారు. ఈ ఎన్‌జీఓ భవన్ ఎందరో మేధావులను, విద్యావేత్తలను, అణిముత్యాలను అందించిందన్నారు.
సిద్దిపేట పట్టణంలోని కోమటిచెరువును అభివృద్ధి చేసి జిల్లాకే తలమానికమైన పర్యటక కేంద్రంగా తీర్చుదిద్దుతామన్నారు. త్వరలో జరగనున్న అనంతసాగర్ సరస్వతీ ఉత్సవాలకు తాను హాజరవుతానన్నారు. అనంతరం ఎన్‌జీఓ భవన్ అభివృద్ధికి రూ. 50 లక్షలను కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా సిద్దిపేట డివిజన్‌లో పుట్టి పెరిగి ఈ ప్రాంత ఖ్యాతిని దశదిశలా చాటి, వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 26 మంది ప్రముఖులను ముఖ్యమంత్రి ఘనంగా సన్మానించారు. అనంతరం సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలకు చెందిన పలువురికి ముఖ్యమంత్రి ఆసరా పథకం కింద పింఛన్లు పంపిణీ చేశారు.
న్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తా
బుధవారం సాయంత్రం స్థానిక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. సిద్దిపేట బార్ అసోసియేషన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర అభినందనీయమన్నారు. న్యాయవాదుల కోరిక మేరకు సిద్దిపేట బార్ అసోసియేషన్‌కు కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడమే కాకుండా సిద్దిపేట పట్టణంలో న్యాయవాదుల కాలనీ కోసం రెండెకరాల స్థలాన్ని కొనుగోలు చేస్తామన్నారు. బార్ అసోసియేషన్‌లోని సభ్యులందరికీ స్థలాలు పంపిణీ జరిగేలా చొరవ చూపుతానన్నారు. అంతకు ముందు రూ. 6.80 కోట్ల నిధులతో కోమటిచెరువు కట్టపై చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు.
హరీష్‌పై ప్రసంశల జల్లు...
సిద్దిపేట పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆధ్యాంతం తన మేనళ్లుడు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావును ప్రసంశలతో ముంచెత్తారు. కోమటి చెరువు కట్టను పరిశీలిస్తున్న క్రమంలో కట్ట అభివృద్ధికి హరీష్ చూపిన చొరవను కొనియాడారు. డైనమిక్ లీడర్‌గా వివిధ శాఖల నుంచి నిధులను తీసుకొచ్చి చెరువును అందంగా తీర్చిదిద్దాలనుకోవడం అభినందనీయమన్నారు. చెరువుకట్ట డిజైన్‌ను ఆసక్తికరంగా ఉందని కట్టను వెడల్పు చేసి మరింత సుందరంగా తీర్చిదిద్దాలని మంత్రికి సూచించారు. అదేవిధంగా సిద్దిపేట ఎన్‌జీఓ భవన్‌లో మాట్లాడుతున్న సమయంలో సిద్దిపేటలో ఆణిముత్యాలు పుష్కలమంటూ అందులో హరీష్ కూడా ఒకరన్నారు.
అదే విధంగా బార్ అసోసియేషన్ సమావేశంలో న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాన్ని అందించగా, వాటిపై బుల్లెట్‌లాంటి హరీష్ ప్రత్యేక దృష్టిసారిస్తాడని చమత్కరించారు.సీఎం వెంట డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రులు రాజయ్య, మహ్మద్ అలీ, మంత్రులు హరీష్‌రావు, ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు బాబూమోహన్, సోలిపేట రామలింగారెడ్డి, రసమయి బాలకిషన్, చింత ప్రభాకర్, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, ఫారూక్ హుస్సేన్, టీఎన్‌జీఓ రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి రవీందర్‌రెడ్డి, ఐఏఎస్ అధికారులు స్మిత సబర్వాల్, జిల్లా కలెక్టర్ రాహుల్‌బొజ్జ, జేసీ శరత్, ఆర్డీఓ ముత్యంరెడ్డి, సిద్దిపేట కమిషనర్ రమణాచారి, సిద్దిపేట తహశీల్దార్ ఎన్‌వై గిరి, నాయకులు రాజనర్సు, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, చిన్న, షఫీకూర్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు.