సాక్షి, న్యూఢిల్లీ : అత్యంత వివాదాస్పదమైన ‘హుబ్బలి–అంకోలి రైల్వే లైన్ ప్రాజెక్ట్’కు కర్నాటక రాష్ట్ర వైల్డ్‌లైవ్ బోర్డు మార్చి 20వ తేదీన అనుమతిచ్చింది. ప్రజలతోపాటు కొంత మంది బోర్డు సభ్యుల అభ్యంతరాలను కూడా ఖాతరు చేయకుండా అనుమతివ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రపంచ హెరిటేజ్ సైట్‌గా ఐక్యరాజ్యసమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తించిన వెస్టర్న్ ఘాట్‌లో 164.44 కిలోమీటర్ల రైల్వే మార్గాన్ని ఈ ప్రాజెక్ట్ కింద నిర్మిస్తారు. ఈ ప్రాజెక్ట్ వల్ల 2.2 లక్షల చెట్లను కొట్టివేయాల్సి వస్తోంది. దీనికోసం మొత్తం 995.64 హెక్టార్ల స్థలం అవసరం కాగా, అందులో 595.64 హెక్టార్లు పూర్తిగా అడవిలోనిదే. 184.6 హెక్టార్లు చిత్తడి నేల కాగా, 190 హెక్టార్లు మాత్రమే బీడు భూమి. వర్షాకాలంలో రవాణా సంబంధాలు తెగిపోతున్న ఉత్తర, హైదరాబాద్–కర్ణాటక ప్రాంతం సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ ఎంతో ఉపయోగపడుతుందని, ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరగుతాయని బోర్డులో సభ్యుడైన కర్ణాటక అడవుల ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ సంజయ్ మోహన్ తెలిపారు. చదవండి: కేంద్ర మంత్రికి సీఎం వైఎస్ జగన్ లేఖ
ఇది అందరికి చెప్పే కారణం. అసలు ప్రాజెక్ట్ ఉద్దేశం కర్ణాటకలోని బళ్లారి, హోస్పేట్ నుంచి బొగ్గును రాష్ట్రంలోని అంకోలా, కర్వోర్ ప్రాంతాలకు, గోవాలోని వాస్కో, మడ్గావ్ రేవులకు తరలించేందుకని సామాజిక కార్యకర్తలు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 1.8 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించిన వెస్టర్న్ ఘాట్స్ (పడమటి కనుమలు) 30 శాతంపైగా అన్ని రకాల మొక్కలు, చేపలు, పక్షులతోపాటు పలు జీవరాశులున్నాయి. అందుకని వీటిని జీవ వైవిద్యానికి ప్రతీకలు అంటారు. ఈ కనుమల గుండా 38 నదులు తూర్పునకు ప్రవహిస్తుండగా వాటిలో 27 నదులు అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి. గోదావరి, కృష్ణ, మాండవి, కావేరి, జౌరి లాంటి ప్రధాన నదులు పశ్చిమ కనుమల్లోనే పుట్టి ప్రవహిస్తున్నాయి. భారత్ ద్వీపకల్ప రాష్ట్రాల్లో నివసిస్తోన్న దాదాపు 25 కోట్ల మంది ప్రజలకు నీటిని సరఫరా చేస్తున్నవి ఈ నదులే. చదవండి: భారత సైన్యం కీలక నిర్ణయం..!
ఈ కనుమల్లో 2,500 రకాల మొక్కలు, జంతువులు, ఉభయచరాలు, క్రిమికీటకాలతో విరాజిల్లుతూ ప్రపంచంలో ప్రముఖ జీవవైవిధ్య ప్రాంతంగా గుర్తింపు పొందిందని, అభివృద్ధి పేరిట రైల్వే ప్రాజెక్ట్‌ను చేపట్టినట్లయితే అనేక జాతుల జీవ వైవిధ్యం నశించి పోతాయని బెంగళూరు మహానగర పాలిక అటవీ విభాగానికి చెందిన జీవవైవిధ్య మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యుడు విజయ్ నిశాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. రైలు ప్రాజెక్ట్ వర్షపాతాన్ని దెబ్బతీయడంతోపాటు వాతావరణ సమతౌల్యాన్ని దెబ్బతీస్తుందని బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో సెంటర్ ఫర్ ఎకాలోజికల్ సైన్స్‌కు చెందిన శాస్త్రవేత్త టీవీ రామచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: అదే పాత సింహాలు ఇప్పుడు కొత్త పేరుతో
Comments
Please login to add a commentAdd a comment