
విజయ్ మాల్యా అశ్వశాల మీదుగా రైల్వేలైను!
అపర కుబేరుడు విజయ్ మాల్యాకు రోజులు బాగున్నట్లు లేవు.
అపర కుబేరుడు విజయ్ మాల్యాకు రోజులు బాగున్నట్లు లేవు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ సంక్షోభం తర్వాత ఆయనకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మాల్యాకు చెందిన చరిత్రాత్మక కునిగల్ అశ్వశాల మీదుగా హసన్ - బెంగళూరు రైల్వేలైను పడబోతోంది. వీలైనంత వరకు దీన్ని తప్పిస్తామని, ప్రత్యామ్నాయమార్గం చూస్తామని దక్షిణ రైల్వే హామీ ఇచ్చినా, కుదరలేదు. మొత్తం 425 ఎకరాల సువిశాల స్థలంలో ఉన్న ఈ అశ్వశాలలోంచి దాదాపు 1.05 కిలోమీటర్ల పొడవున రైల్వేలైను వెళ్తుంది. ఇందుకు సంబంధించిన పనులు కూడా మొదలైపోయాయి.
కునిగల్ సమీపంలో 300 మంది రైతులకు చెందిన 70 ఎకరాల భూమి లోంచి రైల్వేలైను వెళ్లడానికి వీల్లేదని కర్ణాటక హైకోర్టు గట్టిగా చెప్పడంతో దక్షిణ రైల్వేకు మాల్యా అశ్వశాల తప్ప మరో మార్గం ఏదీ దొరకలేదు. అయితే.. రైళ్లు తమ అశ్వశాల మీదుగా వెళ్లడం వల్ల గుర్రాలు ఆ శబ్దాన్ని భరించలేవని, ప్రధానంగా గర్భంతో ఉన్న ఆడ గుర్రాలకు ఇది పెద్ద సమస్య అవుతుందని యునైటెడ్ రేసింగ్ అండ్ బ్లడ్స్టాక్ బ్రీడర్స్ లిమిటెడ్ (యూఆర్బీబీ) మేనేజింగ్ డైరెక్టర్ జైన్ మిర్జా తెలిపారు.
కొన్ని వందల సంవత్సరాల నాటి చెట్లు దాదాపు 35 వరకు ఉన్నాయని, వాటన్నింటినీ రైల్వే లైను కోసం త్యాగం చేయాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికే చెట్లు నరకడం మొదలైపోయిందని మీర్జా అన్నారు. వాటిలో కొన్ని గంధపుచెట్లు కూడా ఉన్నాయి. గుర్రాల పునరుత్పత్తికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు దక్షిణ రైల్వే ఇంజనీర్లు మూడు అండర్పాస్లు ఏర్పాటుచేశారు.