- సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి
రైల్వే లైన్‌ను పొడిగించాలి
Published Thu, Aug 4 2016 10:27 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
జగిత్యాల రూరల్: నూతనంగా ఏర్పాటుచేస్తున్న మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్‌ను జగిత్యాల మీదుగా మంచిర్యాల వరకు పొడిగించాలని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు తానురాసిన లేఖను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు గురువారం పంపించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం మనోహరాబాద్–సిద్దిపేట–సిరిసిల్ల–కొత్తపల్లికి రైల్వేలైన్ మంజూరు చేసిందన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర రాజధాని నుంచి కరీంనగర్ వరకు రైల్వేలైన్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రస్తుతం ప్రతిపాదించిన మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్‌ను మనోహరబాద్, గజ్వేల్, సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, ధర్మపురి, లక్సెట్‌పేట, మంచిర్యాల వరకు కొనసాగిస్తే చాలా ఉపయోగం ఉంటుందన్నారు. దీంతో ఉత్తర భారతదేశాన్ని కలిపే రైలుకు ప్రత్యామ్నాయ రైల్వేలైన్ ఏర్పాటు చేసినట్లవుతుందన్నారు. ప్రస్తుతం జిల్లాలుగా మారనున్న జగిత్యాల, మంచిర్యాల రైల్వేలైన్‌తో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 7న మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్‌కు శంకుస్థాపన చేస్తున్నందున ముఖ్యమంత్రి చొరవ తీసుకుని రైల్వేలైన్ జగిత్యాల మీదుగా మంచిర్యాల వరకు పొడిగించేలా చూడాలని కోరారు. నిజామాబాద్ ఎంపీ కవిత, పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్‌కు లేఖలు పంపినట్లు పేర్కొన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బండ శంకర్, మండల ఉపాధ్యక్షుడు గంగం మహేశ్ పాల్గొన్నారు.
Advertisement