సాక్షి, మహబూబ్‌నగర్: దశాబ్దాలుగా ఊరిస్తూ వస్తున్న తూర్పు పాలమూరు జిల్లా ప్రజల రైల్వే లైన్ కల కలగానే మిగిలిపోయింది. పదుల సంఖ్యలో పాలకులు మారినా.. ప్రభుత్వాలు మారినా గద్వాల–మాచర్ల రైల్వేమార్గం మాత్రం అమలుకు నోచడంలేదు. ఎన్నికలు వస్తున్న ప్రతీసారి పోటీలో ఉండే అభ్యర్థులు రైల్వేలైన్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయని ప్రకటనలు చేయడం.. గెలిచాక మరిచిపోవడం సర్వసాధారణమైంది.
నాలుగు దశాబ్దాలుగా ఊరిస్తున్న గద్వాల–మాచర్ల రైల్వేలైన్ నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు కలగానే మారిపోయింది. ప్రతి పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే ప్రధాన అంశంగా ఉంటోంది. పోటీ చేసే ప్రతి నాయకుడు రైల్వేలైన్‌ను సాధిస్తామని చెబుతున్నా.. 40 ఏళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. ఇటీవల టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వనపర్తిలో జరిగిన సభలో ఈ రైల్వేలైన్ గురించి ప్రస్తావించడంతో మరోసారి ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది.
ఈ ఎన్నికల్లో గద్వాల–మాచర్ల రైల్వే మార్గం కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలకు ప్రధాన రాజకీయ అస్త్రంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతిపక్షాలు టీఆర్‌ఎస్ వైఫల్యం వల్ల రైలుమార్గం ఏర్పాటుకు జాప్యం జరుగుతుందనే ప్రచారం మొదలు పెడుతుండగా, తాతల కాలం నాటి డిమాండ్ నెరవేరకపోవడానికి గత ప్రభుత్వాల పాలకులే కారణమని అధికారపక్షం వాదిస్తోంది. ఈ సారి తమకు అవకాశం కల్పిస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కూడా ఇదివరకే చెప్పారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధికంగా అధికార పార్టీ సభ్యులే ఉన్న నేపథ్యంలో గద్వాల–మాచర్ల రైల్వేలైన్‌కు రాజకీయ చదరంగంలో కీలకంగా మారితే ఎవరూ గెలిచినా రైల్వేలైన్‌కు అడుగులు పడతాయనే చర్చ కూడా జోరందుకుంది. గతంలో మొదటి సారి జిల్లాల ఏర్పాటులో చోటు దక్కని నారాయణపేటకు తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ కొత్త జిల్లాగా ఏర్పాటు చేసినట్లే.. లోక్‌సభ ఎన్నికల బాధ్యతలను నిర్వర్తిస్తున్న కేటీఆర్ గద్వాల–మాచర్ల రైల్వేలైన్‌కు చొరవ తీసుకుంటారని ప్రజలు నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని ఆ పార్టీ నాయకులు కూడా ప్రచారం చేస్తున్నారు.
ఎన్నో ప్రతిపాదనలు
గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల మీదుగా ప్రతిపాదించిన గద్వాల–మాచర్ల రైల్వేలైన్ కోసం 1980లో అప్పటి ఎంపీ మల్లు అనంతరాములు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఆ తర్వాత 2007లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి డీపీఆర్ రిపోర్టును కేంద్రానికి ఇవ్వడంతో కేంద్రం గద్వాల–మాచర్ల రైల్వేలైన్ ప్రతిపాదనలను పక్కనబెట్టి, కేవలం నల్లగొండ నుంచి మాచర్ల వరకు సర్వే నిర్వహించేందుకు రూ.20 కోట్లు మంజూరు చేశారు.
కొన్నేళ్ల అనంతరం గద్వాల–మాచర్ల రైల్వేలైన్‌కు అవకాశం ఉందని, ఇందుకు రూ.1,160 కోట్లు అంచనా వేశారు. 184 కిలోమీటర్ల మేర లైన్ ఏర్పాటుకు రూ.920 కోట్లు అవసరం అవుతాయని ఓ అంచనాకు వచ్చారు. రెండు విడతలుగా ఉన్న ఈ పథకంలో మొదటి విడత 2002లో రాయచూర్–గద్వాల రైల్వేలైన్ పనుల పూర్తి చేసుకున్నాయి. రెండో దశలో ఉన్న గద్వాల–మాచర్ల రైల్వేలైన్‌కు ఇంకా మోక్షం కలగడం లేదు. నీతిఅయోగ్, లా కమిషన్ సైతం ఈ రైల్వేలైన్‌కు అంగీకారం తెలిపినా అడుగు ముందుకు పడటంలేదు.
సర్వత్రా ఆసక్తి
తూర్పు పాలమూరు జిల్లాల గుండా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర రాçష్ట్రాలను కలిపే మాచర్ల లైన్ ఏర్పాటుపై ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మార్గం ద్వారా మూడు రాష్ట్రాలకు రాకపోకలు మెరుగుపడతాయి. కొత్త రైల్వేలైన్‌ల ఏర్పాటుకు సగం వాటా భరిస్తే రైల్వేలైన్ ఏర్పాటు చేస్తామని కేంద్రం విధించిన నిబంధనకు అనుగుణంగా ఒప్పందం అమల్లోకి వస్తే గద్వాల–మాచర్ల రైల్వేలైన్‌కు మోక్షం కలుగుతుందని నాగర్‌కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య చెబుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం వాటా భరించాలి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వమే సన్నద్ధం కావాల్సి ఉందని ఎంపీ ఎల్లయ్య వాదిస్తున్నారు. భూ సేకరణ, ఇతర అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఈ రైల్వేలైన్ ద్వారా ప్రజలకు రవాణా చౌకగా అందుబాటులోకి వస్తుంది. ముఖ్యంగా వ్యాపార, వాణిజ్య రంగాలు మెరుగుపడటమే కాకుండా పరిశ్రమల ఏర్పాటుకు పునాదులు పడతాయి.
కేటీఆర్ ప్రకటనతో..
ఈనెల 9వ తేదీన వనపర్తిలో జరిగిన టీఆర్‌ఎస్ నాగర్‌కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సభలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో హాజరైన కేటీఆర్ అనూహ్యంగా నాగర్‌కర్నూల్‌లో టీఆర్‌ఎస్ గెలిస్తే రైలు వస్తుందని ప్రకటన చేశారు. మొదటి నుంచి టీఆర్‌ఎస్ జెండా నాగర్‌కరన్నూల్‌లో ఎగరడం లేదని, ఈసారి టీఆర్‌ఎస్ జెండా ఎగిరితే కచ్చితంగా రైలు మార్గం తీసుకొస్తామని హామీ ఇవ్వడంతో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ జిల్లాల వ్యాప్తంగా ఇదే హాట్‌టాపిక్‌గా మారింది.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ రైల్వే లైన్ మార్గంపై చర్చ మొదలైంది. ఈ అంశంపై ఇన్నాళ్లూ నోరు మెదపని టీఆర్‌ఎస్ పార్టీ తొలిసారి రైలుమార్గంపై మాట్లాడటం ప్రజల్లో ఆశలు రెకేత్తిస్తోంది. ఈ అంశంపై ఇన్నాళ్లు జిల్లా ప్రజాప్రతినిధులు సైతం అంటిముట్టన్నట్లుగా స్పందిస్తూ వచ్చారు.
నాగర్‌కర్నూల్ ఎంపీగా ఉన్న నంది ఎల్లయ్య మాత్రం సీఎం కేసీఆర్ రైల్వేలైన్‌కు అమోదం తెలిపితే కూత కూస్తుందని అనేక సార్లు పత్రికల ద్వారా చెబుతూ వస్తున్నారు. వాస్తవానికి అధికార పార్టీ నుంచి ఇంతవరకు ఎవరూ, ఏనాడూ ఈ అంశంపై ప్రకటనలు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే ఈ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్న తరుణంలో కేటీఆర్ హామీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రజల ఆశలు తీర్చాలి
చాలా కాలంగా గద్వాల–మాచర్ల రైల్వేమార్గం ఏర్పాటు అవుతుందని వింటున్నాం. కానీ ఇంతవరకు ఆ హామీ నెరవేరలేదు. సీఎం కేసీఆర్ ఒక్క నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిని మూడు జిల్లాలు చేసినట్లే అదే స్ఫూర్తితో గద్వాల–మాచర్ల రైల్వేలైన్‌ను ఏర్పాటు చేయాలి.
– విజయ్‌కుమార్, వనపర్తి వాసి
సీఎం స్పందిస్తే రైలొస్తది
గద్వాల– మాచర్ల రైల్వేలైన్ ఏర్పాటుకు నావంతుగా ఎంతో కృషి చేసినా. సంయుక్త ఒప్పందానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు రావడం లేదు. దక్షిణ మధ్య రైల్వే అధికారులకు అపాయింట్‌మెంట్ సైతం ఇవ్వడం లేదు. నేను స్వయంగా చాలా సార్లు లెటర్లు రాసినా స్పందించలేదు. జిల్లాలోని ప్రజాప్రతినిధులను తీసుకెళ్లినా పట్టించుకోలేదు. కేసీఆర్ ఒప్పుకుంటే రైలు తప్పకుండా వస్తుంది.
– నంది ఎల్లయ్య, ఎంపీ, నాగర్‌కర్నూల్
Comments
Please login to add a commentAdd a comment