సాక్షి, మహబూబ్‌నగర్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాల్లో పాగా వేసేందుకు వ్యూహం రచిస్తోంది. సుదీర్ఘ కసరత్తు తర్వాత లోక్‌సభ అభ్యర్థులను ఖరారు చేసిన ఆ పార్టీ ఎలాగైనా వారిని గెలిపించుకునే పనిలో పడింది. ఈ క్రమంలో ఈ నెల 29న మహబూబ్‌నగర్‌లోని భూత్పూర్ మండలం అమిస్తాపూర్ వద్ద ఉన్న 50ఎకరాల్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకానున్నారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ పరిధి నుంచి లక్ష మంది చొప్పున రెండు లక్షల మంది జనాన్ని తరలించాలని పార్టీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నుంచి మూడ్రోజుల పాటు రెండు సెగ్మెంట్లలో తిరిగి జనసమీకరణ చేయనున్నారు. 29న బహిరంగసభ ముగిసిన మరుసటి రోజు నుండే రెండు లోక్‌సభ స్థానాల్లోనూ ప్రచారం మొదలు ప్రారంభించే యోచనలో పార్టీ నేతలు ఉన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర, జిల్లా నాయకులు రెండు పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటనకు షెడ్యూల్ ఖరారు చేసే పనిలో పార్టీ శ్రేణులు ఉన్నారు.
పాలమూరులో పాగా వేయాలి..
మహబూబ్‌నగర్ స్థానం నుంచి 1999లో ఏపీ జితేందర్‌రెడ్డి బీజేపీ ఎంపీగా గెలుపొందారు. నాగర్‌కర్నూల్‌లో మాత్రం బీజేపీ ఇంత వరకు ఖాతా తెరవలేదు. దీంతో కనీసం ఈ సారైనా తెలంగాణలో అత్యధిక సీట్లు గెలుచుకోవాలనే పట్టుదలతో ఉన్న కాషాయ పార్టీ మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీనిచ్చే అభ్యర్థులను బరిలో దింపింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి కమలం గూటికి చేరుకున్న డీకే అరుణకు మహబూబ్‌నగర్ టికెట్ ఖరారు చేసిన బీజేపీ, కేంద్ర మాజీ మంత్రి బంగారు లక్ష్మణ్ తనయ బంగారు శ్రుతికి నాగర్‌కర్నూల్ టికెట్ కేటాయించింది.
అయితే పాలమూరు నుంచి పోటీ చేస్తోన్న డీకే అరుణ స్థానిక టీఆర్‌ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి మధ్య గట్టి పోటీ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వ్యక్తిగత ఇమేజ్ ఉన్న అరుణకు, బీజేపీ బలం కూడా తోడవడంతో ఈసారి మహబూబ్‌నగర్‌లో పాగా వేయగలుగుతామనే ధీమా ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. అరుణ పార్టీ చేరికకు ముందు వరకు పాలమూరు బీజేపీ అభ్యర్థిగా భావించిన రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ నాలుగేళ్ల నుంచి మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో పార్టీని బలోపేతం చేయడంలో దాదాపు సఫలీకృతమయ్యారు.
ప్రస్తుతం తనకు టికెట్ రాలేదనే అసంతృప్తి శాంతకుమార్‌కు లేదు. ఇదే క్రమంలో శాంతకుమార్ తన క్యాడర్‌తో కలిసి అరుణ గెలుపు కోసం సహకరిస్తానని మీడియా ముందు స్పష్టం చేయడం, బీజేపీ గెలుపుపై పార్టీ శ్రేణుల్లో ఆశలు రేకెత్తాయి. నాగర్‌కర్నూల్ నుంచి పోటీ చేయనున్న బంగారు శ్రుతికి ఆ ప్రాంతం కొత్త కావడం.. ఆమె తొలిసారిగా పోటీకి దిగుతుండడంతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ఎదుర్కొవడానికి బీజేపీ ఎలాంటి వ్యూహం రచిస్తుందో అనే చర్చ మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment