కల్వకుర్తి పట్టణంలో కవాతు నిర్వహిస్తున్న కేంద్ర బలగాలు, పోలీసులు
సాక్షి, కల్వకుర్తి టౌన్: పార్లమెంట్ ఎన్నికలకు పోలీసుశాఖ ద్వారా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 11న నిర్వహించే ఎన్నికల పటిష్ట బందోబస్తుకు శాఖా పరంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు పోలీ సులు తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కల్వకుర్తి డీఎస్పీ పుష్పారెడ్డి తెలిపారు. గత పంచాయతీ, అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామాల్లో అలజడులు సృష్టించి, చిన్న, చిన్న వివాదాలను సృష్టించిన వారిని గమనించి, వారిపై ఒక ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు.
గ్రామ పోలీస్ అధికారులతో సమాచారం తెప్పించుకుని వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తుగా వారిని బైండోవర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కల్వకుర్తి సబ్‌డివిజన్ పరిధిలోని కల్వకుర్తి, ఊర్కొండ, వెల్దండ, వంగూర్, చారకొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూస్తామని డీఎస్పీ తెలిపారు.
ప్రత్యేక నిఘా
కల్వకుర్తి సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను పోలీసులు గుర్తించారు. ఎన్నికల సమయంలో గ్రామాల్లో మద్యం తయారీ, విక్రయాలపై నిఘా వేశారు. విక్రయదారులను బైండోవర్ చేశారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి మద్యం, డబ్బు తరలకుండా ప్రత్యేక స్క్వాడ్ బృందం సభ్యులు చర్యలు తీసుకున్నారు.
సమస్యస్మాతక ప్రాంతాల గుర్తింపు
కల్వకుర్తి సబ్‌డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లోని 169 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో కల్వకుర్తి మండలంలో 61 పోలింగ్ స్టేషన్లలో 4 సమస్యాత్మకంగా, ఊర్కొండ మండలంలో 16 పోలింగ్ స్టేషన్లకు 9 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. అలాగే వెల్దండ మండలంలో 35 పోలింగ్ స్టేషన్లకు 13, వంగూరు మండలంలో 36 పోలింగ్ స్టేషన్లకు రెండు, చారకొండ మండలంలో 21 పోలింగ్ స్టేషన్లకు 3 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
కేంద్ర బలగాల కవాతు
కల్వకుర్తి సబ్‌డివిజన్ పరిధిలోని అన్ని మండలా ల్లో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. మంగళవారం కల్వకుర్తి పట్టణంలో కేంద్ర బలగాలతో కల్వకుర్తి డీఎస్పీ పుష్పారెడ్డి,, కల్వకుర్తి సీఐ సురేందర్, ఎస్‌ఐ నర్సింహులు కవాతులో పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సబ్‌డివిజన్ పరిధిలో ఇద్దరు సీఐలు, 5 మంది ఎస్‌ఐలు, 10 మంది ఏఎస్‌ఐలు, దాదాపు 80 మంది కానిస్టేబు ళ్లు, హోంగార్డులు, 100 మంది దాకా కేంద్ర బలగాలు, మహిళా పోలీసులు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. అలాగే కల్వకుర్తి పట్టణంలోనే ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, వాటిని భద్రపరిచేది కూడా కల్వకుర్తి పట్టణంలో ఉండడంతో మరి కొంత మంది కేంద్ర బలగాల పోలీసులు ఇక్కడ విధులు నిర్వహించనున్నారు.
స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకోవాలి
ప్రజలు ప్రశాంత వాతావరణంలో వారి ఓటుహక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పోలీసు శాఖ తరఫున ఏర్పాటు చేశాం. సబ్‌డివిజన్ పరిధిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా వెంటనే తెలిసేలా చర్యలు తీసుకుంటున్నాం. పోలీస్ సిబ్బందితో పాటుగా, ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు, ఎన్నికల ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి.
– పుష్పారెడ్డి, డీఎస్పీ, కల్వకుర్తి
Comments
Please login to add a commentAdd a comment