​​​​​​​‘ఎప్పుడెక్కామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్‌ వేగంతో చేరుకున్నామా లేదా..’ | - | Sakshi
Sakshi News home page

​​​​​​​‘ఎప్పుడెక్కామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్‌ వేగంతో చేరుకున్నామా లేదా..’

Published Thu, Jun 15 2023 12:52 PM | Last Updated on Thu, Jun 15 2023 12:52 PM

- - Sakshi

‘ఎప్పుడెక్కామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్‌ వేగంతో చేరుకున్నామా లేదా..’ అనే డైలాగ్‌ ప్రయాణికులు చెప్పుకునేలా.. సరికొత్త ఆధునిక రైల్వే లైన్ల నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. విశాఖ నుంచి విజయవాడ మీదుగా శంషాబాద్‌, విశాఖ నుంచి విజయవాడ మీదుగా కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్‌ రైలు మార్గాలు రానున్నాయి. ఈ రెండు మార్గాలకు సంబంధించిన పీఈటీఎస్‌ సర్వే నిర్వహించేందుకు రైల్వే శాఖ సమాయత్తమైంది.

సాక్షి, విశాఖపట్నం : రైళ్ల వేగంలో మార్పులు మొదలయ్యాయి. ఇప్పటికే వందేభారత్‌ రైళ్లతో కొత్త శకానికి నాంది పలికిన భారతీయ రైల్వే శాఖ.. ఇప్పడు అంతకు మించి అన్నట్లుగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్ని కలుపుతూ అత్యాధునిక సెమీ హై స్పీడ్‌ రైల్వే లైన్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్‌ల సామర్థ్యం 110 నుంచి గరిష్టంగా 150 కిలోమీటర్లు. ముఖ్య నగరాల్ని కలుపుతూ గంటకు 220 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే విధంగా సెమీ హైస్పీడ్‌ రైల్వే లైన్‌లను ఏర్పాటు చేయనున్నారు.

మూడు రాజధానుల్ని అనుసంధానం చేస్తూ..
ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల్ని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా.. అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా అభివృద్ధి కానున్నాయి. తాజాగా వస్తున్న రైల్వే లైన్లు కూడా ఈ మూడు రాజధానుల్ని అనుసంధానిస్తున్నట్లుగానే డిజైన్‌ చేశారు. అదేవిధంగా.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కీలకంగా ఉన్న శంషాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుతో ఈ లైన్లు అనుసంధానం కానున్నాయి. అంటే.. శంషాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా కర్నూలు టౌన్‌ రైల్వే స్టేషన్‌ వరకూ ఈ సెమీ హైస్పీడ్‌ రైలు మార్గాలు రానున్నాయి. మొత్తం 942 కిలోమీటర్ల మేర.. గంటకు 220 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయేలా ట్రాక్‌లు నిర్మించనున్నారు.

5 గంటల్లో విశాఖ టూ హైదరాబాద్‌
ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం చేరుకోవాలంటే 11 నుంచి 12 గంటల సమయం పడుతుంది. కానీ.. ఈ సెమీ హైస్పీడ్‌ ట్రాక్‌ నిర్మాణం పూర్తయితే.. 4 నుంచి 5 గంటల్లో విశాఖ నుంచి హైదరాబాద్‌ చేరుకోవచ్చు. ప్రస్తుతం నడుస్తున్న వందేభారత్‌ రైళ్లు గరిష్ట వేగం 160 కిలోమీటర్లు అయినా.. ప్రస్తుతం 80 నుంచి 120 కి.మీ వేగంతో నడుస్తున్నాయి. భవిష్యత్తులో వందేభారత్‌ రైళ్లను అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు. వందేభారత్‌లోనూ స్లీపర్‌ కోచ్‌లు రాబోతున్నాయి. కొత్తగా రాబోతున్న ఈ ట్రైన్లు గంటకు 200 కి.మీ వేగంతో దూసుకెళ్లేలా తయారు కాబోతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మార్గాల్లో ఎక్కువ శాతం ఈ ట్రైన్‌లు నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. అందుకే.. ఈ సెమీ హైస్పీడ్‌ కారిడార్స్‌ ప్రాజెక్టుపై దృష్టి సారించింది.

పీఈటీఎస్‌కు టెండర్లు
ఈ రెండు కారిడార్లకు సంబంధించి ప్రిలిమినరీ ఇంజినీరింగ్‌ కమ్‌ ట్రాఫిక్‌ సర్వే(పీఈటీఎస్‌)కు రైల్వే బోర్డు టెండర్లు ఖరారు చేసింది. సింగిల్‌ పాకెట్‌లో ఈ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. రూ.2.70 కోట్లతో నిర్వహించనున్న ఈ సర్వేను ఆరు నెలల్లో పూర్తి చేయాలని సదరు సర్వే సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది చివరి నాటికి సర్వే పూర్తయిన వెంటనే.. ఈ సెమీ హై స్పీడ్‌ కారిడార్‌ పనులకు సంబంధించిన ప్రాథమిక అంచనా వ్యయాన్ని నిర్ధారిస్తూ.. డీపీఆర్‌ సిద్ధం చేయనున్నారు. డీపీఆర్‌ పూర్తయిన వెంటనే పనులకు టెండర్లు పిలవాలని రైల్వే శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ కారిడార్‌ పనులు పూర్తయితే.. ఏపీ తెలంగాణ మధ్య రవాణా మరింత సులభతరం, వేగవంతం కానుందని వాల్తేరు డివిజన్‌ అధికారులు భావిస్తున్నారు. విశాఖను అనుసంధానం చేస్తూ జరుగుతున్న ఈ కారిడార్‌కు రైల్వే శాఖ ప్రాధాన్యమివ్వడం శుభపరిణామంగా చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement