High Speed Rail
-
Paris Olympics: ఫ్రాన్స్‌లో దుండగుల దుశ్చర్య
పారిస్: ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న ఫ్రాన్స్‌లో గుర్తు తెలియని వ్యక్తులు విధ్వంసానికి పాల్పడ్డారు. హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటలకు క్రీడోత్సవాలు ప్రారంభం కాగా, దుండగుల దుశ్చర్య కారణంగా ఉదయం నుంచే పలు ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ఆలస్యంగా నడిచాయి. మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్ సబ్స్టేషన్లపై దాడి చేశారు. కేబుళ్లు తెంపేశారు. ఫలితంగా ఫ్రాన్స్‌తోపాటు యూరప్‌లోని పలు ప్రాంతాల నుంచి పారిస్‌కు రైల్వే సేవలు నిలిపివేయాల్సి వచి్చంది. వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైళ్లలో వెళ్లాల్సిన ఒలింపిక్ క్రీడాకారులను బస్సుల్లో పారిస్‌కు తరలించారు. ఒలింపిక్స్ ప్రారంభమైన రోజే పథకం ప్రకారం జరిగిన ఈ చర్యల వెనుక కుట్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వామపక్షవాద మిలిటెంట్లు లేదా పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారులు ఈ దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నారు. తమ డిమాండ్లను ప్రపంచం దృష్టికి తీసుకురావాలన్నదే వారి ఎత్తుగడ కావొచ్చని చెబుతున్నారు. అయితే, ఒలింపిక్ క్రీడలతో ఈ దాడులకు ప్రత్యక్ష సంబంధం లేదని భావిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. క్రీడలను అడ్డుకోవాలన్నది దుండగుల ఆలోచన కాకపోవచ్చని తెలిపారు. హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను స్తంభింపజేసిన దుండుగులను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. నేరం రుజువైతే వారికి పదేళ్ల నుంచి 20 ఏళ్ల దాకా జైలు శిక్షపడే అవకాశం ఉందని చెప్పారు. తాజా ఘటనలపై ఫ్రాన్స్ ప్రధానమంత్రి గాబ్రియెల్ అటాల్ స్పందించారు. ఇవి ముందస్తు పథకం ప్రకారం జరిగిన దాడులేని చెప్పారు. ఉత్తర, తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుంచి పారిస్‌కు దారితీసే రైలు మార్గాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డారని తెలిపారు. పారిస్‌కు వెళ్లే రైళ్లను అడ్డుకోవాలన్నదే వారి ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. దుండగుల కోసం గాలింపు ప్రారంభమైందన్నారు. మధ్యాహ్నం తర్వాత రైళ్ల రాకపోకలు కొనసాగాయని రవాణా మంత్రి పాట్రిస్ వెర్‌గ్రిటే చెప్పారు. ఒలింపిక్స్ సందర్భంగా ముష్కరులు విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందని ఫ్రాన్స్ నిఘా వర్గాలు నెల రోజుల క్రితమే హెచ్చరించాయి. -
విమానం కంటే వేగంగా వెళ్లే రైలు.. ప్రత్యేకతలివే..
హైస్పీడ్ ట్రైన్స్ తయారుచేయడంలో చైనా మరో అడుగు ముందుకేసింది. తాజాగా అత్యాధునిక సూపర్ సోనిక్ అల్ట్రా హైస్పీడ్ ట్రైన్‌ను అభివృద్ధి చేసినట్లు ఆ దేశ పరిశోధకులు ప్రకటించారు. ఆకృతిలో రైలును పోలి, వేగంలో విమానానికి తీసిపోని ఈ ట్రైన్‌కు ‘టీ-ఫ్లైట్’ అని పేరు పెట్టారు. ప్రత్యేకతలు.. ఈ ట్రైన్‌కు చక్రాలు ఉండవు. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ శక్తితో ట్రాక్‌పై గాలిలో తేలియాడుతూ నడుస్తుంది. దీంతో పట్టాలు, చక్రాలమధ్య ఘర్షణ అనే సమస్యే ఉండకపోవడంతో లక్షిత వేగాన్ని రైలు సులభంగా అందుకోగలదు. ఎయిరో డైనమిక్స్ సూత్రాలకు అనుగుణంగా ప్యాసింజర్ల కోసం ఏర్పాటు చేసిన రైక్లెన్డ్ సీట్లును ఏర్పాటు చేశారు. టాప్ స్పీడ్‌లో వుహాన్ నుంచి బీజింగ్ (వెయ్యి కిలోమీటర్లు)కు అరగంటలో చేరుకొంటుంది. రైలుపైన ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ ద్వారా దానికి అవసరమైన శక్తి అందుతుంది. ప్రస్తుత వేగం – గంటకు 623 కి.మీ ప్రయాణిస్తుందని పరిశోధకులు చెప్పారు. మరింత అభివృద్ధి చేశాక గంటకు 2 వేల కి.మీ ప్రయాణిస్తుంది. ప్రత్యేక ట్యూబ్ గుండా ప్రయాణించే టీ-ఫ్లైట్‌లో మాగ్లెవ్ సాంకేతికత సాయంతో ఘర్షణ లేకుండా ప్రయాణించవచ్చు. ఇదీ చదవండి: ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు.. చివరి తేదీ ఎప్పుడంటే.. -
బుల్లెట్ రైలు ప్రాజెక్టు దక్కించుకున్న కంపెనీ ఇదే..
దేశంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం ఎలక్ట్రిఫికేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడానికి ఆర్డర్‌ను గెలుచుకున్నట్లు లార్సెన్ & టూబ్రో (ఎల్ అండ్ టీ) తెలిపింది. ఈ మేరకు ఎల్ అండ్ టీ కన్స్ట్రక్షన్ 508 కిలోమీటర్ల పరిధిలో ప్రాజెక్ట్ ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్ కోసం ఎలక్ట్రిఫికేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనుంది. రూట్ నిర్మాణం పూర్తయిన తర్వాత, ఈ ఎలక్ట్రిఫికేషన్ సిస్టమ్ వల్ల రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ ప్రాజెక్ట్‌కు జపాన్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ నిధులు సమకూరుస్తోందని కంపెనీ తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌కు మహారాష్ట్రలో భూసేకరణ దాదాపు పూర్తయిందని ఇటీవల రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న ఎనిమిది నదులపై వంతెనల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. ముంబై, థానే మధ్య సముద్రంలోని సొరంగం నిర్మాణం పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఉద్యోగాలు పోనున్నాయా..? దేశంలోనే ఈ తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లు. 251కి.మీ మేర పిల్లర్లు, 103 కి.మీ మేర ఎలివేటెడ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం జరిగిందని రైల్వే మంత్రి గతంలోనే చెప్పారు. ఈ రైలు సేవలు అందుబాటులోకి వస్తే కేవలం 2.58 గంటల్లో అహ్మదాబాద్ నుంచి ముంబయి చేరుకోవచ్చు. ఈ రైలు మార్గం ముంబై, థానే, వాపి, వడోదర, సూరత్, ఆనంద్, అహ్మదాబాద్‌లను కలుపుతుంది. -
భారత్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఆ కంపెనీకే.. విలువ ఎన్ని వేల కోట్లో తెలుసా?
ప్రతిష్టాత్మక భారత్ బుల్లెట్ ట్రైన్ మెగా ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో (L&T) దక్కించుకుంది. ఈ మేరకు ఆ కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ ఒప్పందం విలువపై కంపెనీ స్పష్టత ఇవ్వకపోయినా దీని విలువ రూ.7 వేల కోట్లపైనే ఉంటుందని సమాచారం. లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీ బోర్డు మీటింగ్ జులై 25న జరుగనుంది. ఈ సందర్భంగా షేర్ల బైబ్యాక్, 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేక డివిడెండ్ చెల్లింపును బోర్డు పరిశీలించనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను బోర్డు సమావేశంలో స్వీకరించనున్నట్లు లార్సెన్ అండ్ టూబ్రో ఒక ఫైలింగ్‌లో తెలిపింది. ప్రతిష్టాత్మకమైన ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్‌లో భాగమైన 135.45 కిలో మీటర్ల ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు ప్రాజెక్ట్-C3 ప్యాకేజీ నిర్మాణ కాంట్రాక్ట్‌ను నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) నుంచి తమ నిర్మాణ యూనిట్ ఎల్అండ్టీ కన్స్ట్రక్షన్ పొందినట్లు కంపెనీ ప్రత్యేక ఫైలింగ్‌లో ప్రకటించింది. ఇదీ చదవండి ➤ GST on EV Charging: ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్‌పై జీఎస్టీ! పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో వర్తింపు ఈ ప్యాకేజీ పరిధిలో స్టేషన్లు, ప్రధాన నదీ వంతెనలు, డిపోలు, సొరంగాలు, ఎర్త్ స్ట్రక్చర్లు, స్టేషన్లు తదితర నిర్మాణాలను ఎల్అండ్టీ కంపెనీ చేపట్టనుంది. ఈ ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైలు ప్రాజెక్ట్ దాదాపు 508 కిలో మీటర్ల మేర ఉంటుంది. దీన్ని ఎంఏహెచ్ఎస్ఆర్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. ఇది మహారాష్ట్ర రాష్ట్రంలో 155.76 కి.మీ, కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీలో 4.3 కి.మీ, గుజరాత్ రాష్ట్రంలో 348.04 కి.మీ మేర ఉంటుంది. మెగా ఆర్డర్ దక్కించుకున్న అనంతరం బీఎస్ఈలో ఎల్అండ్టీ షేర్లు దాదాపు 4 శాతం పెరిగి 52 వారాల గరిష్ట స్థాయి రూ.2,594.40కి చేరుకున్నాయి. 2023-24 మొదటి త్రైమాసిక పలితాలను జులై 25న జరిగే సమావేశంలో ఎల్అండ్టీ బోర్డ్ పరిగణనలోకి తీసుకోనుంది. -
‘ఎప్పుడెక్కామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ వేగంతో చేరుకున్నామా లేదా..’
‘ఎప్పుడెక్కామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ వేగంతో చేరుకున్నామా లేదా..’ అనే డైలాగ్ ప్రయాణికులు చెప్పుకునేలా.. సరికొత్త ఆధునిక రైల్వే లైన్ల నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. విశాఖ నుంచి విజయవాడ మీదుగా శంషాబాద్, విశాఖ నుంచి విజయవాడ మీదుగా కర్నూలు మధ్య సెమీ హైస్పీడ్ రైలు మార్గాలు రానున్నాయి. ఈ రెండు మార్గాలకు సంబంధించిన పీఈటీఎస్ సర్వే నిర్వహించేందుకు రైల్వే శాఖ సమాయత్తమైంది. సాక్షి, విశాఖపట్నం : రైళ్ల వేగంలో మార్పులు మొదలయ్యాయి. ఇప్పటికే వందేభారత్ రైళ్లతో కొత్త శకానికి నాంది పలికిన భారతీయ రైల్వే శాఖ.. ఇప్పడు అంతకు మించి అన్నట్లుగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్ని కలుపుతూ అత్యాధునిక సెమీ హై స్పీడ్ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్‌ల సామర్థ్యం 110 నుంచి గరిష్టంగా 150 కిలోమీటర్లు. ముఖ్య నగరాల్ని కలుపుతూ గంటకు 220 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే విధంగా సెమీ హైస్పీడ్ రైల్వే లైన్లను ఏర్పాటు చేయనున్నారు. మూడు రాజధానుల్ని అనుసంధానం చేస్తూ.. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల్ని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా.. అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా అభివృద్ధి కానున్నాయి. తాజాగా వస్తున్న రైల్వే లైన్లు కూడా ఈ మూడు రాజధానుల్ని అనుసంధానిస్తున్నట్లుగానే డిజైన్ చేశారు. అదేవిధంగా.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కీలకంగా ఉన్న శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుతో ఈ లైన్లు అనుసంధానం కానున్నాయి. అంటే.. శంషాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా కర్నూలు టౌన్ రైల్వే స్టేషన్ వరకూ ఈ సెమీ హైస్పీడ్ రైలు మార్గాలు రానున్నాయి. మొత్తం 942 కిలోమీటర్ల మేర.. గంటకు 220 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయేలా ట్రాక్‌లు నిర్మించనున్నారు. 5 గంటల్లో విశాఖ టూ హైదరాబాద్ ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకోవాలంటే 11 నుంచి 12 గంటల సమయం పడుతుంది. కానీ.. ఈ సెమీ హైస్పీడ్ ట్రాక్ నిర్మాణం పూర్తయితే.. 4 నుంచి 5 గంటల్లో విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకోవచ్చు. ప్రస్తుతం నడుస్తున్న వందేభారత్ రైళ్లు గరిష్ట వేగం 160 కిలోమీటర్లు అయినా.. ప్రస్తుతం 80 నుంచి 120 కి.మీ వేగంతో నడుస్తున్నాయి. భవిష్యత్తులో వందేభారత్ రైళ్లను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. వందేభారత్‌లోనూ స్లీపర్ కోచ్‌లు రాబోతున్నాయి. కొత్తగా రాబోతున్న ఈ ట్రైన్లు గంటకు 200 కి.మీ వేగంతో దూసుకెళ్లేలా తయారు కాబోతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మార్గాల్లో ఎక్కువ శాతం ఈ ట్రైన్లు నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. అందుకే.. ఈ సెమీ హైస్పీడ్ కారిడార్స్ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. పీఈటీఎస్కు టెండర్లు ఈ రెండు కారిడార్లకు సంబంధించి ప్రిలిమినరీ ఇంజినీరింగ్ కమ్ ట్రాఫిక్ సర్వే(పీఈటీఎస్)కు రైల్వే బోర్డు టెండర్లు ఖరారు చేసింది. సింగిల్ పాకెట్లో ఈ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. రూ.2.70 కోట్లతో నిర్వహించనున్న ఈ సర్వేను ఆరు నెలల్లో పూర్తి చేయాలని సదరు సర్వే సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది చివరి నాటికి సర్వే పూర్తయిన వెంటనే.. ఈ సెమీ హై స్పీడ్ కారిడార్ పనులకు సంబంధించిన ప్రాథమిక అంచనా వ్యయాన్ని నిర్ధారిస్తూ.. డీపీఆర్ సిద్ధం చేయనున్నారు. డీపీఆర్ పూర్తయిన వెంటనే పనులకు టెండర్లు పిలవాలని రైల్వే శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ కారిడార్ పనులు పూర్తయితే.. ఏపీ తెలంగాణ మధ్య రవాణా మరింత సులభతరం, వేగవంతం కానుందని వాల్తేరు డివిజన్ అధికారులు భావిస్తున్నారు. విశాఖను అనుసంధానం చేస్తూ జరుగుతున్న ఈ కారిడార్‌కు రైల్వే శాఖ ప్రాధాన్యమివ్వడం శుభపరిణామంగా చెబుతున్నారు. -
ప్రధాని మాటలు ఆచరణలోకి రావాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘బుల్లెట్ ట్రైన్ అహ్మదాబాద్‌కే వెళ్తుంది. హై స్పీడ్ రైలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి దక్షిణాది నగరాలు ఉన్నా ముంబై వద్దే ఆగిపోతుంది. ప్రగతి పథంలో పరిగెత్తే రాష్ట్రాలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాల్సి ఉన్నా అది జరగడం లేదు. ప్రగతిశీల రాష్ట్రాలను ప్రోత్సహించాలని కేంద్ర పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లను కోరుతున్నాం. ప్రధాని మోదీ చెప్పే మాటలపై విశ్వాసం ఉండాలంటే అవి ఆచరణలోకి రావాలి’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. చదవండి: (త్వరలో ఐటీకి కొత్త పాలసీ) తెలంగాణ వాణిజ్య, పరిశ్రమల మండళ్ల సమాఖ్య (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో శనివారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘రెండ్రోజుల క్రితం జరిగిన నీతి ఆయోగ్ భేటీలో రాష్ట్రంలోని పారిశ్రామిక రంగం కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలతో ముందుకు రావడాన్ని ప్రశంసించింది. పరస్పర విమర్శలతో కాలం గడపకుండా కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతాం. అభివృద్ధి, సరికొత్త సంస్కరణలతో తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ నాయకత్వంలో దేశానికే ఆదర్శంగా నిలుపుతాం’అని కేటీఆర్ ప్రకటించారు. పారిశ్రామిక రాయితీలు, ప్రోత్సాహకాల కోసం గతేడాది రాష్ట్ర వార్షిక బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయించినా, కోవిడ్–19 కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. 2021–22 బడ్జెట్లో నిధులు కేటాయించి రాయితీలు, ప్రోత్సాహకాలకు సంబంధించిన బకాయిలను చెల్లిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. పరిశ్రమల వివరాలతో బ్లూ బుక్.. ‘రాష్ట్రంలో పారిశ్రామిక సంస్థల వివరాలతో ‘బ్లూ బుక్’తయారు చేస్తున్నాం. తద్వారా భారీ పెట్టుబడులతో వచ్చే బహుళ జాతి కంపెనీలతో స్థానిక పరిశ్రమలు భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్ర పారిశ్రామిక విధానంతో గత ఆరేళ్లలో రూ.2.04 లక్షల కోట్ల పెట్టుబడులతో వచ్చిన 13,826 పరిశ్రమలకు అనుమతులు ఇవ్వగా, 14 లక్షల మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి దక్కుతోంది. స్థానికులకు 80 శాతానికి పైగా ఉద్యోగాలిచ్చే సంస్థలకు అదనపు ప్రోత్సాహకాలిస్తాం. పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందించేందుకు తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సిద్ధంగా ఉంది’అని కేటీఆర్ వెల్లడించారు. కాళేశ్వరం లాంటి బహుళ ప్రయోజన ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కేవలం మూడున్నరేళ్ల రికార్డు సమయంలో పూర్తి చేసిందని పేర్కొన్నారు. ధాన్యం దిగుబడి పెరిగి ఈశాన్య భారతంతో పాటు తైవాన్, మధ్య ప్రాచ్య దేశాలకు సోనా బియ్యం ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎఫ్‌టీసీసీఐ ఆధ్వర్యంలో 18 కేటగిరీల్లో ఎంపిక చేసిన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు కేటీఆర్ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షులు రమాకాంత్ ఇనానీ, ఉపాధ్యక్షులు కె.భాస్కర్‌రెడ్డి, అనిల్ అగర్వాల్, అవార్డుల కమిటీ చైర్మన్ రవీంద్ర మోదీ పాల్గొన్నారు. ఆత్మ నిర్భర్‌తో ఒరిగిందేమీ లేదు.. ‘కోవిడ్–19 కారణంగా దెబ్బతిన్న రంగాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్బర్ భారత్‌లో భాగంగా ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీతో 20 మందికి కూడా ప్రయోజనం కలగలేదు. వచ్చే ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టే బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మంచి ప్యాకేజీ ప్రకటించడం ద్వారా ఆర్థిక పునరుజ్జీవనానికి కేంద్రం బాటలు వేస్తుందని ఆశిస్తున్నాం. గత 12 త్రైమాసికాల్లో దెబ్బతిన్న దేశ ఆర్థిక పరిస్థితి తిరిగి పుంజుకోవాలని కోరుకుంటున్నాం’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘హై స్పీడ్ ట్రైన్, ఇండస్ట్రియల్ కారిడార్లు, డిఫెన్స్ ప్రొడక్షన్ క్లస్టర్లు వంటి అంశాలపై కేంద్రానికి లేఖలు రాస్తున్నాం. వచ్చే కేంద్ర బడ్జెట్లో హైదరాబాద్–నాగ్‌పూర్, హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్– బెంగళూరు పారిశ్రామిక కారిడార్లకు నిధులు కేటాయించాలి. పెద్ద ఎత్తున పారిశ్రామికవృద్ధికి బాటలు వేసే ఫార్మాసిటీ, జీనోమ్ వ్యాలీ, టెక్స్టైల్ పార్కులు, ఐటీఐఆర్ వంటి వాటిని కేంద్రం ప్రోత్సహించకపోతే పరిగెత్తలేం’అని కేటీఆర్ స్పష్టం చేశారు. -
చైనా దూకుడు: మరో అద్భుతానికి శ్రీకారం
బిజీంగ్: ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన డ్రాగన్ దేశం టెక్నాలజీలో తనకు తానే సాటి అనిపించకుంటూ దూసుకుపోతోంది. ఎప్పుడూ భిన్న ప్రయోగాలు చేస్తూ ప్రపంచ దేశాలకు సవాలు విసిరే చైనా మరో అద్భుతానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల కృత్రిమ సూర్యూడిని తయారు చేసుకుని చైనా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇది మరువక ముందే డ్రాగన్ దేశం ఆధునాతన సాంకేతికతను ఉపయోగించి గాల్లో తేలే రైలును ఆవిష్కరించింది. అంటే ఈ రైలు.. పట్టాలపై తేలుతూ గంటకు 620 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సౌత్‌వెస్ట్ జియటాంగ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ రైలుకు చక్రాలు ఉండవు. మాగ్నెటిక్ లెవిటేషన్, హై టెంపరేచర్ సూపర్ కండక్టర్ టెక్నాలజీ (హెచ్‌టీఎస్)లో పురోగతి సాధించడం ద్వారా దీనికి రూపకల్పన చేసినట్లు చైనా శాస్త్రవేత్తలు వివరించారు. ప్రస్తుతం ఉన్న రైళ్లన్నింటికంటే వేగంగా ఈ రైలు దూసుకుపోతుందని వారు పేర్కొన్నారు. (చదవండి: చైనా దుస్సాహసం.. భారత్‌లో గ్రామం) కాగా మాగ్నెటిక్ లెవిటేషన్ సాంకేతికత సాయంతో డిజైన్ చేసిన ఈ రైలు చక్రాలు లేకుండానే కేవలం ఆయస్కాంత శక్తి సాయంతో పట్టాలపై తేలుతూ దూసుకుపోతుంది. కానీ చూసే వారికి మాత్రం గాల్లో తేలుతూ నుడుస్తున్నట్లు కనిపిస్తుంది. గంటకు 620 కిమీల వేగంతో ప్రయాణించే ఈ ట్రైన్ లోపల ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించేలా సీట్లు వాటి మధ్య ఏర్పాట్లు ఉంటాయి. అలాగే బోగీలో ఓ పేద్ద ఎల్ఈడీ టీవీ కూడా ఉంటుంది. అయితే గత బుధవారం ఆవిష్కరించిన ఈ రైలు నమూనాతో వీటిలోని లోటుపాట్లను పరీక్షించేందుకు, పనితీరును పరిశీలించేందుకు అవకాశం లభించిందని చైనా అధికారులు చెప్తున్నారు. ఇటువంటి వాటిని మాగ్లెవ్ రైళ్లు అంటారు. టెక్నాలజీకి మారుపేరుగా చెప్పుకునే జపాన్‌లో దశాబ్దాల క్రితమే ఇవి అందుబాటులోకి వచ్చాయి. జపాన్‌లో ఈ రైళ్లు గంటకు 320 కిమీల వేగంతో ప్రయాణిస్తాయి. (చదవండి: చైనా సంచలనం; సూర్యుడి ప్రతిసృష్టి!) Superfast! A domestically developed maglev train prototype has been unveiled in Chengdu, China. The superconductor technology the train employs could make it faster and lighter than its peers pic.twitter.com/51waWPX66E — China Xinhua News (@XHNews) January 16, 2021 ఈ క్రమంలో అత్యాధునిక టెక్నాలజీలో తమకంటూ ఓ ముద్ర వేసుకుంటున్న డ్రాగన్ దేశం సాంకేతికత వాడకంలో జపాన్‌కు పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కృత్రిమ సూర్యుడిని తయారు చేసుకోగా.. ఇప్పుడు మాగ్లెవ్ రైళ్ల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. అందుకే జపాన్‌లోని మాగ్లెవ్ రైలుకు మించి గంటకు 620 కిమీల వేగంతో వెళ్లే రైళ్లను ఆవిష్కరించేందుకు చైనా ప్రయోగం చేస్తోంది. జనవరి 13న చైనా శాస్త్రవేత్తలు ఈ రైలు నమూనాను ఆవిష్కరించారు. అయితే పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రావాలంటే దాదాపు 10 ఏళ్ల సమయం పడుతుందని శాష్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. తమ దేశంలోని వివిధ నగరాలను వేగవంతమైన ప్రయాణ సాధనాల ద్వారా అనుసంధానం చేయాలని డ్రాగన్ దేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే మ్యాగ్లెవ్ రైళ్లను అభివృధ్ధికి చైనా శ్రీకారం చుట్టింది. -
ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ఇదే
న్యూఢిల్లీ: ముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు(ఎంఏహెచ్ఎస్ఆర్)లో భాగంగా నడిపే బుల్లెట్ రైలు చిత్రాన్ని జపాన్ రాయబార కార్యాలయం మొదటిసారిగా శనివారం విడుదల చేసింది. ముంబై–అహ్మదాబాద్ మధ్య నడవనున్న ఈ5 సిరీస్ షింకాన్సెన్ రైలింజన్‌కు కొన్ని మార్పులు చేయనున్నట్లు అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ముంబై, అహ్మదాబాద్‌ల మధ్య 508 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టు 2023 కల్లా పూర్తి చేయాల్సి ఉంది. సుమారు రూ.1,08,000 కోట్ల ఈ ప్రాజెక్టుకు జపాన్ ప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక సాయం అందిస్తుంది. -
హైస్పీడ్‌లో రైలొస్తోంది!
సాక్షి, హైదరాబాద్ : పట్టాలపై ఇక ప్రైవేటు రైళ్లు కూత పెట్టనున్నాయి. ప్రస్తుతం లక్నో–ఢిల్లీ, అహ్మదాబాద్–ముంబై మార్గాల్లో పరుగులు తీస్తున్న తేజాస్ ప్రైవేటు రైళ్ల తరహాలోనే దక్షిణ మధ్య రైల్వేలోనూ పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో రైళ్లను నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో ముంబై–పుణే–హైదరాబాద్ మార్గంలో హైస్పీడ్ రైల్ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే సికింద్రాబాద్–నాగ్‌పూర్, సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య సెమీ హైస్పీడ్ కారిడార్ల ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. వీటి తో పాటు మరిన్ని మార్గాల్లో ప్రైవేటు ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. సుమారు 15 కొత్త రైళ్లు పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. వీటిలో హైదరాబాద్ మీదుగా వెళ్లేవి కూడా ఉంటాయి. పదేళ్లుగా డిమాండున్న మార్గాల్లోనూ కొత్త రైళ్లు అందుబాటులోకి రాలేదు. తాజాగా ప్రైవేటు రైళ్లు మాత్రం వస్తుండటం గమనార్హం. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో ప్రైవేటు రైళ్లు, ప్రైవేటు సేవలే కీలకం కానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతికి అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. రైల్వే లైన్లు, సరుకు రవాణా, రైల్వేల భద్రత, రైళ్ల నిర్వహణ వంటి పరిమితమైన బాధ్యతలు మాత్రమే రైల్వేలకు పరిమితం కానున్నాయి. రెండేళ్ల క్రితమే ప్రారంభం దక్షిణ మధ్య రైల్వేలో రెండేళ్ల క్రితమే ప్రైవేటు సేవలు మొదలయ్యాయి. ప్రతిరోజు సుమారు 2 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సికింద్రాబాద్ స్టేషన్లో ప్రయాణికుల సదుపాయాలన్నింటినీ ప్రైవేటీకరించారు. నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్లలోనూ ప్రైవేటు సంస్థల కార్యకలాపాలు మొదలయ్యాయి. టికెట్ బుకింగ్, రిజర్వేషన్లు వంటి అంశాలు మాత్రమే దక్షిణ మధ్య రైల్వే పర్యవేక్షిస్తోంది. మరోవైపు నగరంలో అందుబాటులో ఉన్న రైల్వే భూములను సైతం ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇటు నాంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్ల వద్ద అందుబాటులో ఉన్న స్థలాలను వాణిజ్య సముదాయాలకు కేటాయించేందుకు ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐఆర్ఎస్డీసీ) కార్యాచరణ చేపట్టింది. ఈ ప్రైవేటీకరణలో భాగంగానే పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో రైళ్లు పట్టాలెక్కనున్నాయి. అన్ని జోన్లలో ప్రైవేటు రైళ్లు రైల్వే సేవల ప్రైవేటీకరణ, అధికారులు, ఉద్యోగుల విధుల్లో మార్పులు, చేర్పులు, తదితర అంశాలపై కేంద్ర బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఢిల్లీలో పరివర్తన సంఘోష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని జోన్లలో 100 రూట్లలో 150 ప్రైవేటు రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ముంబై–పుణే–హైదరాబాద్, సికింద్రాబాద్–విశాఖపట్నం, సికింద్రాబాద్–ముంబై, సికింద్రాబాద్–గౌహతి, సికింద్రాబాద్–నాగ్‌పూర్, సికింద్రాబాద్–చెన్నై, విజయవాడ–విశాఖపట్నం, తిరుపతి–విశాఖ, సికింద్రాబాద్–తిరుపతి, విశాఖ–అరకు తదితర రూట్లను ఎంపిక చేశారు. మరోవైపు ముంబై–చెన్నై, బెంగళూర్–జైపూర్, బెంగళూర్–గౌహతి తదితర మార్గాల్లో నడిచే రైళ్లు కూడా హైదరాబాద్ మీదుగా రాకపోకలు సాగించనున్నాయి. ఆదాయంలో అగ్రగామి.. దక్షిణమధ్య రైల్వే గణనీయమైన ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఏటేటా ఆదాయం భారీగా నమోదవుతూనే ఉంది. ఇటు ప్రయాణికుల రాకపోకలపై.. అటు సరుకు రవాణా ద్వారా వచ్చే ఆదాయంలోనూ ప్రగతి పథంలో పయనిస్తోంది. గడిచిన పదేళ్లల్లో దక్షిణ మధ్య రైల్వే ఆదాయం నాలుగు రెట్లు పెరిగింది. ఈ ఏడాది సుమారు రూ.15 వేల కోట్ల ఆదాయంతో దేశంలోని అన్ని జోన్లలో నంబర్‌వన్‌గా నిలిచింది. 2009–2010 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల ద్వారా రూ.1,637 కోట్లు లభించగా, 2018–19 ఆర్థిక సంవత్సరం నాటికి అది రూ.4,059 కోట్లకు చేరుకుంది. అలాగే సరుకు రవాణాపైన 2009లో రూ.4,354 కోట్లు లభిస్తే.. ప్రస్తుతం అది ఏకంగా రూ.10,955 కోట్లకు పైగా పెరిగింది. -
ఆ మెట్రోల మధ్య హైస్పీడ్ రైళ్లు!
న్యూఢిల్లీ: ప్రధాన మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలను అనుసంధానించే హైస్పీడ్ రైలు ప్రాజెక్టును 2022 ఆగస్టుకల్లా పూర్తిచేయాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిష్టాత్మక స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టులో 160 కి.మీ. వేగంతో మెట్రోల మధ్య రైళ్లు నడిచేలా చర్యలు చేపట్టనున్నారు. ఆ కారిడార్‌లో ప్రస్తుత రైళ్ల సగటు వేగం గంటకు 88–90 కి.మీ. మాత్రమే. అలాగే మెట్రో నగరాల మధ్య 10 వేల కి.మీ. నెట్‌వర్క్‌తో సెమీ హైస్పీడ్ రూట్లను 2022 (ఆగస్టు 15) 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రారంభించాలని యోచిస్తున్నారు. -
రాష్ట్రంలో హైస్పీడ్ రైలు!
- బెంగళూరు నుంచి మైసూరుకు - చైనా ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చలు - నగర శివారు ప్రాంతాలను కలుపుతూ మినీ రైల్వే లైన్ - నవంబరులో ఒప్పందం ఖరారు సాక్షి, బెంగళూరు : అనుకున్నవన్నీ జరిగితే త్వరలో రాష్ట్రంలో హైస్పీడ్ రైలు సంచరించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. బెంగళూరు నుంచి మైసూరుకు హైస్పీడ్ రైలు నడిపేందుకు చైనాకు చెందిన ఓ కంపెనీతో ఒప్పందం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. హైస్పీడ్ రైలుతో పాటు ఆరు లైన్ల రహదారి విస్తరణ, బెంగళూరులో రవాణా సౌకర్యం మెరుగు పరిచేందుకు సంబంధించిన పలు పథకాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన పలువురు మంత్రులు, అధికారులు చైనాకు చెందిన శాంగ్‌డాంగ్ ఇంటర్నేషనల్ కంపెనీ ప్రతినిధులతో బెంగళూరులో గురువారం సమావేశమై చర్చించారు. మలుపులు లేకుండా ఉన్నప్పుడే హైస్పీడ్ రైలు ఏర్పాటు సాధ్యమవుతుందని, ఫలితంగా కెంగేరి, బిడిది మధ్య వంతెనను నిర్మించి హైస్పీడ్ రైలు సంచారానికి అనుకూలం చేయాలని సమావేశంలో ప్రాథమిక అవగాహనకు వచ్చారు. మైసూరు-బెంగళూరు మధ్య ఆరు లైన్ల రోడ్డు నిర్మాణానికి అనుగుణంగా రూ.6వేల కోట్ల నిధులను సమకూర్చడానికి చైనా అంగీకరించింది. బెంగళూరులోని మెట్రో రైల్వే స్టేషన్ల మధ్య, మెట్రో రైల్వే స్టేషన్ల, బస్ స్టేషన్ల మధ్య కనెక్టివిటీను పెంచడానికి వీలుగా లైట్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టంను ఏర్పాటు చేయాలనే చైనా కంపెనీ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రపాయంగా అంగీకరించింది. ఇందు కోసం నగర శివారు ప్రాంతాలను కలుపుతూ 40 కిలోమీటర్ల పరిధిలో మినీ రైల్వే లైన్‌ను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు హెబ్బాళ-చాళుక్యసర్కిల్-సెంట్రల్ సిల్క్ బోర్డు వరకూ 16 కిలోమీటర్ల పొడవుగల ఫ్లైఓవర్‌ను నిర్మించాలనే ప్రతిపాదన కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. దీని వల్ల 20 నిమిషాల్లో అటు వైపు నుంచి ఇటు వైపునకు ప్రయాణం పూర్తి చేయడానికి సాధ్యమవుతుంది. అదేవిధంగా గురుకుంట పాళ్య నుంచి కేఆర్ పురం వరకు (21 కిలోమీటర్లు-21 నిమిషాల ప్రయాణం), జ్ఞానభారతి నుంచి వైట్ ఫీల్డ్ వరకూ (27 కిలోమీటర్లు-40 నిమిషాల ప్రయాణం) మరో రెండు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. సమావేశం అనంతరం మంత్రి రోషన్‌బేగ్ మీడియాతో మాట్లాడుతూ... రానున్న నవంబర్‌లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు బెంగళూరులో జరుగుతోందన్నారు. ఆ సదస్సులో చైనా కంపెనీలతో వివిధ అృవద్ధి పథకాలకు సంబంధించిన అవగాహన ఒప్పందం కుదరనుందని అందుకు ముందుగా వివిధ విషయాలపై సీఎం సిద్ధరామయ్య అధ్యక్షతను గురువారం సమీక్ష సమావేశం జరిగిందని వివరించారు. -
ఢిల్లీ-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్‌లో కదలిక
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సర్వే, డిజైన్ పనులు ఆరంభమయ్యాయి. నార్త్-సౌత్ రైల్ కారిడార్‌గా పేరొందిన ఢిల్లీ-చెన్నై హైస్పీడ్ రైలు మార్గంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు చైనా బృందం ఏపీ, తెలంగాణ లో అధ్యయనం చేపట్టింది. దేశంలో హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టు చేపట్టేందుకు భారత్, చైనా ప్రభుత్వాల నడుమ ఒప్పందం కుదిరింది. సర్వే, డిజైన్ పనులు ఉచితంగా చేసేందుకు చైనాలోని సియాయున్ రైల్వే కంపెనీ ముందుకు రావడంతో ఈ బాధ్యతల్ని కేంద్రం ఆ బృందానికే అప్పగించింది. కో ఆర్డినేటింగ్ ఏజెన్సీగా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్(ఆర్వీఎన్ఎల్) వ్యవహరించనుంది. దీంతో ఫీజిబిలిటీ అధ్యయనానికి ఆరుగురు సభ్యులతో కూడిన చైనా బృందం సోమవారం నుంచి తెలంగాణ, ఏపీలో పర్యటన ప్రారంభించింది. ముందుగా ఏపీ రవాణా ముఖ్య కార్యదర్శి శాంబాబ్‌తో చైనా బృందం సచివాలయంలో భేటీ అయింది. తెలంగాణ ముఖ్య కార్యదర్శితో భేటీ కుదరకపోవడంతో మంగళవారం అధ్యయనానికి చైనా బృందం విజయవాడ బయలుదేరి వెళ్ళనుంది. కాగా, ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో ఉన్న రైల్వే ట్రాక్ సామర్థ్యం గంటకు 160 కి.మీ. మేర వేగంతో రైళ్లను నడిపేందుకు మాత్రమే సాధ్యమవుతోంది. హైస్పీడ్ రైలు మార్గానికి ఈ ట్రాక్ సామర్ధ్యం సరిపోదు. కాబట్టి కొత్తగా ట్రాక్ ఏర్పాటు చేసేందుకు చైనా బృందం నిర్ణయించింది. గంటకు 350 కి.మీ. వేగంతో రైళ్లు ప్రయాణించేలా ట్రాక్ డిజైన్ రూపొందించాలని నిర్ణయించారు. -
ఢిల్లీ-చెన్నై బులెట్ రైలుతో బోలెడు ప్రయోజనాలు
న్యూఢిల్లీ: ప్రతిపాదిత ఢిల్లీ-చెన్నై బుల్లెట్ రైలుతో భారత్-చైనాలకు బోలెడు ప్రయోజనాలు చేకూరతాయని రైల్వేవర్గాలు పేర్కొంటున్నాయి. 32 బిలియన్ల అమెరికన్ డాలర్ల వ్యయం కాగల ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ విషయాన్ని గురువారం ప్రచురితమైన వ్యాసంలో గ్లోబల్ టైమ్స్ దినపత్రిక పేర్కొంది. ‘చైనా-భారత్ రైల్వే భాగస్వామ్యం ఇరు దేశాలకు ఎనలేని ప్రయోజనాలను చేకూరుస్తుంది. తన హైస్పీడ్ రైలును ప్రపంచం ముందుంచేందుకు చైనా తహతహలాడుతోంది. 1,754 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి రైల్వే మంత్రిత్వ శాఖ చైనా అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయనుంది. ఈ ప్రాజెక్టుకు 32 బిలియన్ల అమెరికన్ డాలర్ల వ్యయమవుతుందని రైల్వే శాఖ అంచనా వేసింది. తన దేశం వెలుపల చైనా చేపట్టనున్న తొలి ప్రాజెక్టు ఇదే’అని గ్లోబల్ టైమ్స్ పత్రిక గురువారం ప్రచురించిన వ్యాసంలో పేర్కొంది. ఇదేవిధంగా ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై జపాన్‌కూడా అధ్యయనం చేస్తోంది. మెక్సికోలోనూ చైనా రైల్వే శాఖ 3.7 బిలియన్ డాలర్ల విలువైన బులెట్ రైలు ప్రాజెక్టును చేపట్టాల్సి ఉంది. అయితే మెక్సికోలో అవినీతి జోరుగా ఉండడంతో ఆ ప్రతిపాదనను చైనా విరమించుకుంది. చైనా అడుగుల్లో భారత్ అడుగులు వేస్తే మరింత పురోగమిస్తుందని మరో పత్రిక పేర్కొంది. పరస్పర సహకారం ఉంటే ఇంకా బాగుంటుందని సూచించింది.