ఢిల్లీ-చెన్నై బులెట్ రైలుతో బోలెడు ప్రయోజనాలు
న్యూఢిల్లీ: ప్రతిపాదిత ఢిల్లీ-చెన్నై బుల్లెట్ రైలుతో భారత్-చైనాలకు బోలెడు ప్రయోజనాలు చేకూరతాయని రైల్వేవర్గాలు పేర్కొంటున్నాయి. 32 బిలియన్ల అమెరికన్ డాలర్ల వ్యయం కాగల ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ విషయాన్ని గురువారం ప్రచురితమైన వ్యాసంలో గ్లోబల్ టైమ్స్ దినపత్రిక పేర్కొంది. ‘చైనా-భారత్ రైల్వే భాగస్వామ్యం ఇరు దేశాలకు ఎనలేని ప్రయోజనాలను చేకూరుస్తుంది. తన హైస్పీడ్ రైలును ప్రపంచం ముందుంచేందుకు చైనా తహతహలాడుతోంది. 1,754 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి రైల్వే మంత్రిత్వ శాఖ చైనా అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.
ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయనుంది. ఈ ప్రాజెక్టుకు 32 బిలియన్ల అమెరికన్ డాలర్ల వ్యయమవుతుందని రైల్వే శాఖ అంచనా వేసింది. తన దేశం వెలుపల చైనా చేపట్టనున్న తొలి ప్రాజెక్టు ఇదే’అని గ్లోబల్ టైమ్స్ పత్రిక గురువారం ప్రచురించిన వ్యాసంలో పేర్కొంది. ఇదేవిధంగా ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై జపాన్‌కూడా అధ్యయనం చేస్తోంది.
మెక్సికోలోనూ చైనా రైల్వే శాఖ 3.7 బిలియన్ డాలర్ల విలువైన బులెట్ రైలు ప్రాజెక్టును చేపట్టాల్సి ఉంది. అయితే మెక్సికోలో అవినీతి జోరుగా ఉండడంతో ఆ ప్రతిపాదనను చైనా విరమించుకుంది. చైనా అడుగుల్లో భారత్ అడుగులు వేస్తే మరింత పురోగమిస్తుందని మరో పత్రిక పేర్కొంది. పరస్పర సహకారం ఉంటే ఇంకా బాగుంటుందని సూచించింది.