ఖర్గే కనికరిస్తారా?
కొత్త ప్రాజెక్టుల ఊసే లేకుండా పాత ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తే చాలని ప్రతిపాదనలు పంపామంటూ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పీకే శ్రీవాత్సవ మంగళవారం సాయంత్రం కుండబద్దలు కొట్టారు. కర్నూలు ఎంపీ కోట్ల ఆ శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్న తరుణంలో మన పొరుగు రాష్ట్రానికి చెందిన రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే నేడు పార్లమెంట్లో రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ స్థితిలో గుంతకల్లు రైల్వే డివిజన్ రూపురేఖలు మారుతాయని ఆశించడం ఆశా.. అత్యాశా..?
గుంతకల్లు, న్యూస్‌లైన్: గుంతకల్లు రైల్వే డివిజన్లో పడకేసిన ప్రాజెక్టుల్లో కదలిక రావాలంటే నేటి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయిస్తేనే సాధ్యమని రైల్వే వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కనీసం వెయ్యి కోట్లు కేటాయిస్తే తప్ప ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టుల్లో కదలిక కనిపించదని రైల్వే అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఆ మేరకు నివేదికలను రైల్వే బోర్డుకు సమర్పించారు. చాలాకాలంగా గుంతకల్లు రైల్వే డివిజన్‌కు నిధుల కేటాయింపులు సరిగా జరగడం లేదని, దీంతో మంజూరైన, చేపట్టిన రైల్వే ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్న విషయాన్ని ఆ నివేదికల్లో పొందుపర్చారు.
నిధుల లేమి వల్ల‘సీమ’ జిల్లాల్లో రైల్వే అభివృద్ధి అధ్వాన్నంగా తయారైందని కూడా ఆ నివేదికల్లో విశ్లేషించినట్లు సమాచారం. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ ఏడాది కొత్త ప్రాజెక్టులకు ప్రతిపాదనలు పంపలేదని, ఈ ఏడాదిని ప్లాన్ హాలిడేగా ప్రకటించాని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవ మంగళవారం సాయంత్రం ఇక్కడ మీడియాకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో నేటి రైల్వే బడ్జెట్ ఏమేరకు ఈ ప్రాంతాభివృద్ధికి దోహదపడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
గుంతకల్లు డివిజన్‌కు మంజూరైన ప్రాజెక్టులు పూర్తవ్వడానికి గతంలో రూపొందించిన అంచనాల ప్రకారం రూ.1684.56 కోట్ల అవసరం. 2011-12 రైల్వే బడ్డెట్లో రూ.135.38 కోట్లు, 2012-13 రైల్వే బడ్జెట్లో రూ.145 కోట్లు, 2013-14 బడ్జెట్లో రూ.160 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధులను కూడా పూర్తి స్థాయిలో విడుదల చేయలేదు.
గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో 90కి పైగా రైల్వేస్టేషన్లలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. 2011-12, 2012-13, 2013-14 బడ్జెట్లలో అడిగిన నిధులనే మళ్లీ అడుగుతూ 2014-15 బడ్జెట్‌కు ప్రతిపాదనలు పంపారు.
రైల్వే మంత్రిపై అందరి దృష్టి
అనంతపురం, చిత్తూరు, వైఎస్ఆర్, కర్నూలు, నెల్లూరు జిల్లాలు రైల్వే పరంగా అభివృద్ధి చెందితేనే ‘సీమ’ ప్రాంతం పారిశ్రామికంగా ముందంజవేస్తుంది. సీమ వెనుకబాటుతనం గురించి బాగా తెలిసిన రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే ఈ ఏడాది రైల్వే బడ్జెట్లో గుంతకల్లు రైల్వే డివిజన్ అధికారులు పంపిన నివేదిక మేరకు నిధులు విడుదల చేస్తారని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టులకు మహర్దశ వచ్చేనా?
రైల్వే డివిజన్ పరిధిలో విద్యుత్తు లోకోషెడ్డు, గుత్తి-ధర్మవరం డబ్లింగ్ నిర్మాణం, గుత్తి షెడ్ అభివృద్ధి, గుంతకల్లు-గుంటూరు డబ్లింగ్, మంత్రాలయం రోడ్డు- కర్నూలు కొత్తలైన్ నిర్మాణం, కర్నూలు-మార్కాపురం కొత్తలైన్, కదిరి-రాయచోటి నూతన మార్గం, పెన్నానదిపై వంతెన నిర్మాణం, వాడి-గుంతకల్లు డబ్లింగ్ నిర్మాణం, కడప- బెంగుళూరు రైల్వే లైన్ నిర్మాణం.
కర్ణాటకకే పెద్దపీట!
కొత్త రైళ్లను పరుగులు తీయించే క్రమంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే స్వరాష్ట్ర ప్రయోజనాలకు ఇప్పటికే పెద్దపీట వేశారు. 2013-14 బడ్జెట్లో కొత్తగా మంజూరైన రైళ్లలో గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా ఎనిమిది ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వీటిలో ఏకంగా ఆరు రైళ్లు ఏదోవిధంగా కర్ణాటక రాష్ర్ట ప్రజల అవసరాలు తీర్చేలా మంత్రి చర్యలు తీసుకున్నారు. పనిలో పనిగా మరో ఎనిమిది ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పొడిగింపులు ఇచ్చారు. తన హయాంలో కర్ణాటకకు రైల్వేపరంగా వీలైనంత ప్రయోజనం చేకూర్చే దిశగా మంత్రి ఖర్గే ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకంటూ మూడు నెలల వ్యవధిలోనే మూడు పర్యాయాలు గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోకి వచ్చే కర్ణాటక ప్రాంతంలో పర్యటించారు. కొత్త రైళ్ల ప్రారంభం, పాత రైళ్లకు పొడిగింపులు ఇవ్వడం వల్ల కర్ణాటక ప్రజలకు ఎక్కువగా లబ్ధి చేకూరినా.. గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల ప్రజలకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతున్నాయి. నేటి బడ్జెట్లో కూడా అదేరీతిలో రైల్వే స్పందించి లబ్ధి చేకూరుస్తారని కన్నడిగులు భారీ ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశ నెరవేరితే మనకూ కాస్త లబ్ధి చేకూరినట్లే.