సాక్షి, హైదరాబాద్ : పట్టాలపై ఇక ప్రైవేటు రైళ్లు కూత పెట్టనున్నాయి. ప్రస్తుతం లక్నో–ఢిల్లీ, అహ్మదాబాద్–ముంబై మార్గాల్లో పరుగులు తీస్తున్న తేజాస్ ప్రైవేటు రైళ్ల తరహాలోనే దక్షిణ మధ్య రైల్వేలోనూ పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో రైళ్లను నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో ముంబై–పుణే–హైదరాబాద్ మార్గంలో హైస్పీడ్ రైల్ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నారు. అలాగే సికింద్రాబాద్–నాగ్‌పూర్, సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య సెమీ హైస్పీడ్ కారిడార్ల ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. వీటి తో పాటు మరిన్ని మార్గాల్లో ప్రైవేటు ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. సుమారు 15 కొత్త రైళ్లు పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. వీటిలో హైదరాబాద్ మీదుగా వెళ్లేవి కూడా ఉంటాయి. పదేళ్లుగా డిమాండున్న మార్గాల్లోనూ కొత్త రైళ్లు అందుబాటులోకి రాలేదు. తాజాగా ప్రైవేటు రైళ్లు మాత్రం వస్తుండటం గమనార్హం. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో ప్రైవేటు రైళ్లు, ప్రైవేటు సేవలే కీలకం కానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతికి అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. రైల్వే లైన్‌లు, సరుకు రవాణా, రైల్వేల భద్రత, రైళ్ల నిర్వహణ వంటి పరిమితమైన బాధ్యతలు మాత్రమే రైల్వేలకు పరిమితం కానున్నాయి.
రెండేళ్ల క్రితమే ప్రారంభం
దక్షిణ మధ్య రైల్వేలో రెండేళ్ల క్రితమే ప్రైవేటు సేవలు మొదలయ్యాయి. ప్రతిరోజు సుమారు 2 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సికింద్రాబాద్ స్టేషన్‌లో ప్రయాణికుల సదుపాయాలన్నింటినీ ప్రైవేటీకరించారు. నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్లలోనూ ప్రైవేటు సంస్థల కార్యకలాపాలు మొదలయ్యాయి. టికెట్ బుకింగ్, రిజర్వేషన్‌లు వంటి అంశాలు మాత్రమే దక్షిణ మధ్య రైల్వే పర్యవేక్షిస్తోంది. మరోవైపు నగరంలో అందుబాటులో ఉన్న రైల్వే భూములను సైతం ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇటు నాంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్ల వద్ద అందుబాటులో ఉన్న స్థలాలను వాణిజ్య సముదాయాలకు కేటాయించేందుకు ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎస్‌డీసీ) కార్యాచరణ చేపట్టింది. ఈ ప్రైవేటీకరణలో భాగంగానే పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో రైళ్లు పట్టాలెక్కనున్నాయి.
అన్ని జోన్లలో ప్రైవేటు రైళ్లు
రైల్వే సేవల ప్రైవేటీకరణ, అధికారులు, ఉద్యోగుల విధుల్లో మార్పులు, చేర్పులు, తదితర అంశాలపై కేంద్ర బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఢిల్లీలో పరివర్తన సంఘోష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని జోన్లలో 100 రూట్లలో 150 ప్రైవేటు రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ముంబై–పుణే–హైదరాబాద్, సికింద్రాబాద్–విశాఖపట్నం, సికింద్రాబాద్–ముంబై, సికింద్రాబాద్–గౌహతి, సికింద్రాబాద్–నాగ్‌పూర్, సికింద్రాబాద్–చెన్నై, విజయవాడ–విశాఖపట్నం, తిరుపతి–విశాఖ, సికింద్రాబాద్–తిరుపతి, విశాఖ–అరకు తదితర రూట్లను ఎంపిక చేశారు. మరోవైపు ముంబై–చెన్నై, బెంగళూర్–జైపూర్, బెంగళూర్–గౌహతి తదితర మార్గాల్లో నడిచే రైళ్లు కూడా హైదరాబాద్ మీదుగా రాకపోకలు సాగించనున్నాయి.
ఆదాయంలో అగ్రగామి..
దక్షిణమధ్య రైల్వే గణనీయమైన ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఏటేటా ఆదాయం భారీగా నమోదవుతూనే ఉంది. ఇటు ప్రయాణికుల రాకపోకలపై.. అటు సరుకు రవాణా ద్వారా వచ్చే ఆదాయంలోనూ ప్రగతి పథంలో పయనిస్తోంది. గడిచిన పదేళ్లల్లో దక్షిణ మధ్య రైల్వే ఆదాయం నాలుగు రెట్లు పెరిగింది. ఈ ఏడాది సుమారు రూ.15 వేల కోట్ల ఆదాయంతో దేశంలోని అన్ని జోన్లలో నంబర్‌వన్‌గా నిలిచింది. 2009–2010 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల ద్వారా రూ.1,637 కోట్లు లభించగా, 2018–19 ఆర్థిక సంవత్సరం నాటికి అది రూ.4,059 కోట్లకు చేరుకుంది. అలాగే సరుకు రవాణాపైన 2009లో రూ.4,354 కోట్లు లభిస్తే.. ప్రస్తుతం అది ఏకంగా రూ.10,955 కోట్లకు పైగా పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment