
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్తపల్లి– మనోహరాబాద్ రైలు మార్గం పనులు శరవేగంగా సాగుతున్నాయి. మార్చి ఆఖరు నాటికి గజ్వేల్‌కు ట్రయల్ రన్ పూర్తి చేసి తీరుతామన్న పట్టుదలతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు పనిచేస్తున్నారు. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికపుడు రైల్వే అధికారులు, కేంద్రంతో సంప్రదింపులు జరుపుతుండటంతో పనులు ఊపందుకున్నాయి. ఈ మార్గం పూర్తయితే.. దశాబ్దకాలంగా రైలు కూత వినాలన్న కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్‌వాసుల కల నెరవేరనుంది.
నేపథ్యమేంటి?
2006–07లో కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నపుడే ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కానీ, అప్పటి నుంచి ఈ పనుల్లో పురోగతి పెద్దగా లేకపోయింది. 2016 ఆగస్టు 7న ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 151 కిలోమీటర్ల దూరంతో వేసే ఈ మార్గం అంచనా వ్యయం రూ.1,160 కోట్లతో పనులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం, భారతీయ రైల్వే బాగా సహకరిస్తున్నాయి. ‘ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్‌లీ ఇంప్లిమెంటేషన్’విభాగం ద్వారా ప్రధాని ఈ ప్రాజెక్టును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుండటం విశేషం. 2017–18లో రూ.350 కోట్లు, 2018–19లో రూ.250 కోట్లు కేటాయించడం గమనార్హం. ఈ ప్రాజెక్టును 4 దశలుగా విడగొట్టి పనులు చేస్తుండటంతో అవి పరుగులు పెడుతున్నాయి.
పెరగనున్న ఉపాధి అవకాశాలు
ఈ రైల్వేలైను సాకారమైతే ఉత్తర తెలంగాణను హైదరాబాద్‌తో అనుసంధానం చేయడం సుగమమవుతుంది. ముఖ్యంగా కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌వాసులకు రైలు సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రాంతాల్లో ఉన్న ఆయా ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతాయి. ముఖ్యంగా కరీంనగర్ నుంచి గ్రానైట్, పత్తి, మొక్కజొన్న, వరి తదితర ఎగుమతులు, సిరిసిల్ల నుంచి వస్త్ర ఉత్పత్తుల ఎగుమతులు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వీటి ఆధారంగా ఈ ప్రాంతాల్లో కొత్త పరిశ్రమలు వచ్చి, ఉపాధి అవకాశాలు మెరుగుపడి ఆర్థికాభివృద్ధి జరుగుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. పైగా ఈ మార్గంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో కేటీఆర్, హరీశ్‌రావు, సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ ఈ రైల్వేమార్గం 5 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ విజయావకాశాలను మెరుగుపరిచింది. దీంతో కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టును వీలైనంత వేగంగా పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment