సాక్షి ప్రతినిధి కడప: రాయలసీమ–కోస్తా జిల్లాలకు రైల్వే కనెక్టివిటీ పెరిగేందుకు అరుదైన రైల్వే మార్గం..ఓబులవారిపల్లె–కృష్ణపట్నం రైల్వేలైన్. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద టన్నెల్ ఏర్పాటు చేసి దీనిని నిర్మించారు. న్యూ ఆస్ట్రేలియన్ టన్నెల్ మెథడ్‌తో సాంకేతిక పనులు పూర్తి చేశారు. వెలుగొండ అడవుల్లో 7.560 కిలోమీటర్ల పొడవైన టన్నెల్‌ను ఈ మార్గం కోసం ఏర్పాటు చేశారు. దీంతో ఓబులవారిపల్లె–కృష్ణపట్నం మార్గంలో గూడ్స్ రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. అద్భుతమైన ఈ లైన్‌లో ప్రయాణికుల కోసం రైళ్లు నడిపితే విజయవాడ, విశాఖపట్నం తదితర కోస్తా జిల్లాలకు కనెక్టివిటీ బాగా పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రకృతి అందాల నడుమ కాశ్మీర్ తరహాలో ఏర్పాటు చేసిన ఈ మార్గం గుండా ప్రయాణం మరుపురాని అనుభూతినిస్తుంది.
ఎగుమతుల కోసం..
ఈ రైలు మార్గాన్ని ఎస్‌ఆర్‌ఎస్‌పీ నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఓడరేవు నుంచి పలు రకాలైన ఖనిజాలను ఎగుమతి చేసేందుకు ఏర్పాటు చేశారు. ఏపీఎండీసీ పరిధిలో మంగంపేట నుంచి బైరెటీస్, బళ్లారి నుంచి ఐరన్ ఓర్ కూడా ఇదే మార్గంలో వెళుతోంది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో నూతనంగా ఈ మార్గంలో 35 కిలోమీటర్లు, నెల్లూరుజిల్లాలో 58 కిలోమీటర్ల మేర నిర్మించారు. ఈ నడుమ ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో మంగంపేట, నేతివారిపల్లె, చెర్లోపల్లె రైల్వేస్టేషన్లుండగా..నెల్లూరు జిల్లాలో ఎనిమిది స్టేషన్ల ద్వారా గూడ్స్ రైళ్లు కృష్ణపట్నం చేరుకుంటున్నాయి.
రూ.470 కోట్లతో టన్నెల్..
ఓబులవారిపల్లె–కృష్ణపట్నం రైల్వే లైన్ ఏర్పాటుకు 7.56 కిలోమీటర్ల టన్నెల్ ఏర్పాటు చేశారు. న్యూ ఆస్ట్రేలియన్ టన్నెల్ మెథడ్‌తో సాంకేతికపనులు చేపట్టారు. స్కాట్‌లాండ్ మిషనరీతో నిర్మించారు. పెనుశిల అభయారణ్యం కొండల్లో ఈ నిర్మాణం జరిగింది. 2006లో అప్పటి రైల్వేశాఖ మంత్రి నితీశ్‌కుమార్ రైల్వేలైన్‌కు పచ్చ జెండా ఊపారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి చొరవ కారణంగా సకాలంలో భూసేకరణ, పర్యావరణ అనుమతులు లభించాయి. రూ.1646 కోట్లతో ఈమార్గం రూపుదిద్దుకుంది. రెండు గుహల మధ్య పచ్చని లోగిళ్లలో రైల్వే లైన్ వెళుతుంది. చుట్టూ కొండలు, పెనుశిల అభయారణ్యం మధ్యన టన్నెల్‌లో రైల్వే ప్రయాణం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రైల్వే మార్గాన్ని ఉప రాష్ట్రపతి హోదాలో 2019 సెప్టెంబర్, 1వ తేదీన ఎం.వెంకయ్యనాయుడు జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి కృష్ణపట్నం పోర్టుకు గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగుతున్నాయి.
కనెక్టివిటీకి సులువు
కడప–విజయవాడ మధ్య రైల్వే రాకపోకలు చాలా అరుదుగా ఉన్నాయి. కడప నుంచి తిరుమల ఎక్స్‌ప్రెస్(కడప–విశాఖపట్నం).. యర్రగుంట్ల, ప్రొద్దుటూరుల నుంచి ధర్మవరం–విజయవాడ రైళ్ల ద్వారా ప్రయాణం చేయాల్సి ఉంది. లేకపోతే తిరుపతి, రేణిగుంటల నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అయితే నేరుగా కడప నుంచి విజయవాడకు ప్రత్యేకించి రైళ్లు లేవు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లా నుంచి నిత్యం వేలాది మంది విజయవాడకు వెళ్తున్నారు. ప్రత్యేకించి అక్కడి ప్రాంతాల్లోని వివిధ పాఠశాలలు, కళాశాలల్లో ఇక్కడి విద్యార్థులు దాదాపు 20వేల మంది వరకు విద్యను అభ్యసిస్తున్నారు. పేరెంట్స్ రాకపోకలు సాగించేందుకు ఈ మార్గం ఉపయోగపడనుంది. కడప, రాజంపేట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ వెళ్లేందుకు ఈ మార్గం సులభతరంగా ఉంటుందని రైల్వే నిపుణులు వివరిస్తున్నారు.
ఎంతో ఉపయోగకరం
ఓబులవారిపల్లె–కృష్ణపట్నం రైల్వే మార్గం గుండా రైళ్ల రాకపోకలు నిర్వహిస్తే ఉమ్మడి వైఎస్సార్ జిల్లాకు ఎంతో ఉపయోగకరం. రైల్వే బోర్డు దృష్టికి విషయాన్ని తీసుకెళ్తాం.
– తల్లం భరత్‌కుమార్‌రెడ్డి, రైల్వే బోర్డు మెంబర్
పంట ఉత్పత్తులు రవాణా చేసుకోవచ్చు
ఈ రైలు మార్గం గుండా రాక పోకలు నిర్వహిస్తే ప్రయాణికులకు వెసులుబాటు లభి స్తుంది. నిత్యం వేలాది మంది విజయవాడకు ప్రయాణాలు సాగిస్తున్నారు. పంట ఉత్పత్తులు ఎగుమతి చేసుకోవడానికి ఉపయో గకరమే. – శంకర్‌రెడ్డి, నాగవరం, చిట్వేలి
Comments
Please login to add a commentAdd a comment