కూటమి పాలనలో నెరవేరని సొంతింటి కల
రాయచోటి అర్బన్ : కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తున్నా పేదల సొంతింటి కల నెరవేరిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య విమర్శించారు. పేదలకు ఇంటి పట్టాలు మంజూరుచేసి పక్కాఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో రెండు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఇల్లు కట్టుకునేందుకు సాయం చేయాలని కోరారు. సర్వేల పేరుతో కాలక్షేపం చేయడం దారుణం అన్నారు. ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు మంజూరు చేస్తామంటూ చెప్పిన చంద్రబాబు హామీ అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్మిస్తున్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఎల్.నరసింహులు, ఎస్.శ్రీనివాసులు, సుమిత్ర, సాంబశివ, తోపు క్రిష్ణప్ప, సుధీర్‌కుమార్, మనోహర్‌రెడ్డి, టీఎల్.వెంకటేష్, శివరామక్రిష్ణ దేవరా, కోటేశ్వరరావు, జ్యోతిచిన్నయ్య, వంగిమళ్ల రంగారెడ్డి, జక్కల వెంకటేష్, మాధవ్, మహిళలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment