నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనుల్లో 25 శాతం పర్సంటేజీ కోసమే స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు ‘పెదబాబు’ దాడులు జరుపుతున్నట్లు
♦ రైల్వే ఉన్నతాధికారుల విచారణలో నిర్ధారణ
♦ 25 శాతం పర్సంటేజీ కోసం కోడెల ‘పెదబాబు’ పట్టు
సాక్షి, అమరావతి : నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనుల్లో 25 శాతం పర్సంటేజీ కోసమే స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు ‘పెదబాబు’ దాడులు జరుపుతున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. పర్సంటేజీల పర్వానికి సంబంధించి ఉన్నత స్థాయిలో పంచాయితీ జరిగినా కోడెల కుమారుడు పెడచెవిన పెట్టి వరుస దాడులకు తెగబడుతున్న సంగతి తెల్సిందే. తాను అడిగిన వాటా ఇవ్వకుండా పనులు సాగిస్తుండటంపై పెదబాబు అనుచరులు రైల్వే అధికారులు, కూలీలపై రెండో మారు దాడులకు తెగబడ్డారని రైల్వే ఉన్నతాధికారుల విచారణలో తేలినట్లు సమాచారం.
రైల్వే శాఖ ఈ దాడి ఘటనను సీరియస్‌గా తీసుకోవడంతో స్పీకర్ కుమారుడికి చిక్కులు తప్పవని తెలుస్తోంది. రైల్వే కూలీలు, సిబ్బందిపై దాడులు జరిగిన తర్వాత రైల్వే ఉన్నతాధికారులు ఓ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనుల దాడుల ఘటనను రైల్వే ఉన్నతాధికారులు మంగళవారం విజయవాడకు వచ్చిన కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు దృష్టికి తీసుకెళ్లారు. జరిగిన ఘటనపై క్షేత్ర స్థాయికి వెళ్లి విచారించాలని రైల్వే జీఎంను మంత్రి సురేశ్ ప్రభు ఆదేశించినట్లు సమాచారం.