అక్కన్నపేట-మెదక్‌ రైల్వేలైన్‌ పనులు షురూ | akkannapeta-medak railway works starts | Sakshi
Sakshi News home page

అక్కన్నపేట-మెదక్‌ రైల్వేలైన్‌ పనులు షురూ

Published Wed, Sep 7 2016 8:25 PM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM

ప్రారంభమైన అక్కన్నపేట-మెదక్‌ రైల్వేలైన్‌ పనులు

ప్రారంభమైన అక్కన్నపేట-మెదక్‌ రైల్వేలైన్‌ పనులు

మెదక్‌: దశాబ్దాల ఎదురు చూపుల అనంతరం.. మెదక్‌ ప్రాంత ప్రజల కల నెరవేర బోతుంది. అక్కన్నపేట-మెదక్‌ రైల్వే లైన్‌ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. త్వరలోనే సొంత జిల్లా ఏర్పాటవుతున్న తరుణంలోనే రైల్వేలైన్‌ పనులు ప్రారంభం కావడంతో ఈ ప్రాంతవాసుల ఆనందాలకు అవధుల్లేవు. ఇందుకు సంబంధించిన పనులను మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి గత జూలైలో పాతూర్‌ గ్రామ శివారులో  ప్రారంభించారు.  రైల్వేలైన్‌ ఏర్పాటు పూర్తయితే ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది.

గతమంతా హామీలకే పరిమితం
మెదక్‌కు రైల్వేలైన్‌ కావాలనేది ఈ ప్రాంతవాసుల దశాబ్దాల కల. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రాంతంనుంచి ఎంపీగా గెలుపొందారు. నాటి నుంచి మెదక్‌ ప్రాంత ప్రజలు  రైల్వేలైన్‌కోసం పరితపించారు. నాటి నుంచి  మెదక్‌కు  ప్రాతినిధ్యం వహించిన ఎంపీలంతా  రైల్వేలైన్‌ ఏర్పాటు కోసం ఎన్నో హమీలు చేశారు. ఈ ప్రాంతానికి రైల్వేలైన్‌ ఏర్పాటు చేయాలంటూ  ఎన్నో ఉద్యమాలు కూడా జరిగాయి.

ఇదే ప్రధాన డిమాండ్‌తో రైల్వేసాధన సమితి ఎన్నో పోరాటాలు చేసింది. యేటా రైల్వే బడ్జెట్‌ సమయంలో ఈ ప్రాంత ప్రజలు ఆశగా ఎదురు చూడటంతోనే సరిపెట్టారు. కాగా 2007లో అక్కన్నపేట-మెదక్‌ రైల్వేలైన్‌ కోసం అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో నిర్మాణానికయ్యేఖర్చులో 50 శాతం వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరించింది. దీంతో 2010 రైల్వే బడ్జెట్‌లో  ఏపీ ప్రభుత్వం, కేంద్రం కలిసి చేపట్టే కాస్ట్‌ షేరింగ్‌ ప్రాజెక్టు పనుల్లో దీనికి చోటు దక్కింది.

అనంతరం మళ్లీ పనులు ముందుకు సాగలేదు. అనంతరం 2013 బడ్జెట్‌లో ఆమోదం లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రసమితి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి చొరవతో భూసేకరణకు అవసరమైన  నిధులతోపాటు పలువిడతల్లో నిర్మాణ పనులకోసం రాష్ట్రవాట నిధులను ముందుగానే మంజూరు చేయించారు. దీంతో పనుల ప్రారంభానికి మార్గం సుగమమైంది. రైతులకు పరిహారాన్ని వెంటనే చెల్లించడంతో వారు భూములను రైల్వే, రెవెన్యూ శాఖలకు అప్పగించారు. మెదక్‌ నుంచి అక్కన్నపేట వరకు 17.2 కిలో మీటర్ల దూరం నిర్మాణానికి రూ. 114.27 కోట్లు అవసరమవుతాయని  అంచనావేశారు. ప్లానింగ్‌ కమిషన్‌కు ప్రతిపాదనలు పంపారు.

కాబోయే జిల్లాకు ప్రయోజనాలు
ఇప్పటి వరకు రెవెన్యూ డివిజన్‌గా ఉన్న మెదక్‌ మరో నెలలో జిల్లా కేంద్రం కాబోతుంది. దీంతో రైల్వేసదుపాయంతో ఎన్నోప్రయోజనాలు కలుగుతాయి. విద్యా, వ్యవసాయ, వ్యాపార, పర్యాటకరంగాల అభివృద్ధితోపాటు, చౌకగా రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ప్రజలకు మెరుగైన రవాణ అందుబాటులోకి వస్తుంది.

స్టేషన్లు ఇవే..
అక్కన్నపేట-మెదక్‌ రైల్వేలైన్‌ పొడువు 17.2 కిలోమీటర్లు రామాయంపేట మండలం  లక్ష్మాపూర్, మెదక్‌ మండలం శమ్నాపూర్‌తోపాటు మెదక్‌ పట్టణంలో రైల్వేస్టేషన్లు నిర్మిస్తారు. మెదక్‌ స్టేషన్లో 3 లైన్లు ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులకోసం ఒక ప్లాట్‌ఫారం, రవాణకోసం మరొకటి ఏర్పాటు చేసి  ప్రయాణికులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తారు. రెండేళ్లలో ఈ నిర్మాణం పూర్తవుతుందని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.

పనులు త్వరితగతిన పూర్తి చేయిస్తాం
అక్కన్నపేట-మెదక్‌ రైల్వేలైన్‌ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రెండేళ్లలో  పనులు పూర్తిచేయించి మెదక్‌ ప్రజలకు రైల్వేకూత వినిపిస్తాం. ఇందుకోసం రాష్ట్ర వాటా నుంచి ముందుగానే నిధులు మంజూరు చేయించాం. అవసరమైతే మరిన్ని నిధులు కూడా మంజూరు చేయిస్తాం. ఈ ప్రాంత ప్రజలకు, కాబోయే మెదక్‌ జిల్లాకు ఇది వరం లాంటింది. ప్రత్యేక జిల్లా, రైల్వేలైన్‌ కోసం కృషి చేసిన సీఎం కేసీఆర్‌కు ఆజన్మాంతం రుణపడి ఉంటాం. - డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement