akkannapeta-medak
-
కట్టుదిట్టంగా పంచాయతీ పాలన
సాక్షి, అక్కన్నపేట(హుస్నాబాద్): గత పంచాయతీల పాలనతో పోల్చుకుంటే ఈ సారి పంచాయతీల పాలన కట్టుదిట్టంగా మారనుంది. పల్లెల్లో పారదర్శకత పెంపొందించడంతో పాటు పంచాయతీకి వచ్చే నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, పంచాయితీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. గ్రామ పంచాయతీలను పట్టిష్టం చేయడానికి ప్రభుత్వాలు పంచాయతీలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.. సర్పంచ్‌లకు సవాలే.. గత పాలనలో సర్పంచ్‌లు ఆడిందే ఆట పాడిందే పాట అయ్యింది. కాని నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు గ్రామాల్లో సమస్యలు వారికి స్వాగతం పలుకుతున్నాయి. గతంలో లాగా ఈ సారి ఆ పరిస్థితి లేదు. ఎప్పుడు ఏ పని చేయాలన్న గ్రామస్తుల సమావేశంలో తీర్మానాలు చేసి వారి సమక్షంలో నిధుల వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రతీ సారి పంచాయతీకి మంజూరయ్యే నిధులు వాటి వినియోగానికి సంబంధించి విషయాలు ఎప్పకటిప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది.పంచాయితీలలో చేసే ప్రతి పని ఆన్లైన్లో పొందు పరచాల్సి ఉంటుంది. తీర్మానం లేకుండా చేస్తే పదవికి ముప్పే.. గతంలో లాగా గ్రామ పంచాయితీలలో తీర్మానాలు లేకుండా ఏ పని చేసినా వాటి బిల్లుల చెల్లింపులతో పాటు వారిపై వేటు పడే అవకాశం ఉంది.గతంలో సర్పంచ్‌లు ముందస్తుగా డబ్బులు ఖర్చు చేసి ఆ తర్వాత వచ్చిన నిధులను తీర్మానాలు చేయకుండానే తీసుకునేవారు.కానీ ఈ సారి ప్రతి పనికి ముందస్తుగా తీర్మానం చేసుకొని నిధులు వచ్చిన తర్వాతనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతా ఆన్లైన్.. ప్రియా(పంచాయితీ రాజ్ ఇనిస్టిట్యూషన్ అండ్ యూత్ అకౌంటింగ్) సాఫ్ట్వేర్ ద్వారా పంచాయతీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయి. గ్రామాలలో పనిచేసే ప్రతీ అభ్యర్థి ఏఏ పనులు చేస్తున్నారు. ఎన్ని నిధులు ఖర్చు చేస్తున్నారు.అనే విషయాన్ని తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది.పంచాయతీకి ఏ గ్రాంటు ద్వారా నిధులు మంజూరయ్యాయి అందులో ఎన్ని ఖర్చు చేశారో కూడా పూర్తి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. గ్రామ జ్యోతి వెబ్సైట్ ద్వారా.. పంచాయితీలకు ఎంత బడ్డెట్ మంజూరైంది.మంజూరైన నిధులు దేనికి ఎంత ఖర్చుచేశారు. శానిటేషన్ వైద్యం, నీటి సరఫరా సోషల్ వర్కులు,సీసీ రోడ్డుల నిర్మాణం, సిబ్బంది వేతనాలు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. పంచాయతీ ఖర్చు చేయగా ఇంకా పంచాయతీలో ఎన్ని నిధులు ఉన్నాయి. వాటి వివరాలను ఈ వెబ్సైట్లో పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. నేషనల్ పంచాయతీ పోర్టల్ యాప్.. పంచాయతీ పరిధిలో జరుగుతున్న పనుల వివరాలు గ్రామంలోని ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలు, కాలువలు, ఖాళీ స్థలాలు ఇతరత్రా గ్రామ స్థాయి సమాచారం ఇందులో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఫోటోలను యాప్లోఆన్లోడ్ ఆప్‌లోనే చేస్తారు. గ్రామ పంచాయతీ పరిధిలో కొనసాగుతున్న పనులకు సంబంధించి వివరాలతో పాటు ఎన్ని నిధులు ఖర్చు అయ్యాయో కూడా తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ను గూగుల్ స్టోర్ నుంచి అప్ లోడ్ చేసుకోవచ్చు. పారదర్శకత పెరిగింది.. పంచాయితీలకు సంబంధించి నిధులు ఖర్చుల వివరాలు పూర్తి స్థాయి లో యాప్‌ల వెబ్సైట్లలో అందుబాటులో ఉండడంతో పంచాయితీలలో అవినీతి తగ్గడంతో పాటు పాలన పారదర్శకంగా ఉంటుంది.గతంలో జరిగిన పనులకు సంబంధించి వివరాలు నిధుల ఖర్చుల వివరాలు కొత్త పనుల ఎంపిక కోసం ఈ యాప్ తోడ్పడుతుంది.వీటిపై ఆయా గ్రామ పంచాయితీల పాలకులు,యవకులు,మహిళలకు అవగాహన ఏర్పరచుకోవాలి. – దమ్మని రాము, ఎంపీడీఓ హుస్నాబాద్ -
అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ పనులు షురూ
మెదక్: దశాబ్దాల ఎదురు చూపుల అనంతరం.. మెదక్ ప్రాంత ప్రజల కల నెరవేర బోతుంది. అక్కన్నపేట-మెదక్ రైల్వే లైన్ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. త్వరలోనే సొంత జిల్లా ఏర్పాటవుతున్న తరుణంలోనే రైల్వేలైన్ పనులు ప్రారంభం కావడంతో ఈ ప్రాంతవాసుల ఆనందాలకు అవధుల్లేవు. ఇందుకు సంబంధించిన పనులను మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి గత జూలైలో పాతూర్ గ్రామ శివారులో ప్రారంభించారు. రైల్వేలైన్ ఏర్పాటు పూర్తయితే ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. గతమంతా హామీలకే పరిమితం మెదక్‌కు రైల్వేలైన్ కావాలనేది ఈ ప్రాంతవాసుల దశాబ్దాల కల. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రాంతంనుంచి ఎంపీగా గెలుపొందారు. నాటి నుంచి మెదక్ ప్రాంత ప్రజలు రైల్వేలైన్‌కోసం పరితపించారు. నాటి నుంచి మెదక్‌కు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలంతా రైల్వేలైన్ ఏర్పాటు కోసం ఎన్నో హమీలు చేశారు. ఈ ప్రాంతానికి రైల్వేలైన్ ఏర్పాటు చేయాలంటూ ఎన్నో ఉద్యమాలు కూడా జరిగాయి. ఇదే ప్రధాన డిమాండ్‌తో రైల్వేసాధన సమితి ఎన్నో పోరాటాలు చేసింది. యేటా రైల్వే బడ్జెట్ సమయంలో ఈ ప్రాంత ప్రజలు ఆశగా ఎదురు చూడటంతోనే సరిపెట్టారు. కాగా 2007లో అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ కోసం అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో నిర్మాణానికయ్యేఖర్చులో 50 శాతం వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరించింది. దీంతో 2010 రైల్వే బడ్జెట్లో ఏపీ ప్రభుత్వం, కేంద్రం కలిసి చేపట్టే కాస్ట్ షేరింగ్ ప్రాజెక్టు పనుల్లో దీనికి చోటు దక్కింది. అనంతరం మళ్లీ పనులు ముందుకు సాగలేదు. అనంతరం 2013 బడ్జెట్లో ఆమోదం లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రసమితి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి చొరవతో భూసేకరణకు అవసరమైన నిధులతోపాటు పలువిడతల్లో నిర్మాణ పనులకోసం రాష్ట్రవాట నిధులను ముందుగానే మంజూరు చేయించారు. దీంతో పనుల ప్రారంభానికి మార్గం సుగమమైంది. రైతులకు పరిహారాన్ని వెంటనే చెల్లించడంతో వారు భూములను రైల్వే, రెవెన్యూ శాఖలకు అప్పగించారు. మెదక్ నుంచి అక్కన్నపేట వరకు 17.2 కిలో మీటర్ల దూరం నిర్మాణానికి రూ. 114.27 కోట్లు అవసరమవుతాయని అంచనావేశారు. ప్లానింగ్ కమిషన్‌కు ప్రతిపాదనలు పంపారు. కాబోయే జిల్లాకు ప్రయోజనాలు ఇప్పటి వరకు రెవెన్యూ డివిజన్‌గా ఉన్న మెదక్ మరో నెలలో జిల్లా కేంద్రం కాబోతుంది. దీంతో రైల్వేసదుపాయంతో ఎన్నోప్రయోజనాలు కలుగుతాయి. విద్యా, వ్యవసాయ, వ్యాపార, పర్యాటకరంగాల అభివృద్ధితోపాటు, చౌకగా రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ప్రజలకు మెరుగైన రవాణ అందుబాటులోకి వస్తుంది. స్టేషన్లు ఇవే.. అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ పొడువు 17.2 కిలోమీటర్లు రామాయంపేట మండలం లక్ష్మాపూర్, మెదక్ మండలం శమ్నాపూర్తోపాటు మెదక్ పట్టణంలో రైల్వేస్టేషన్లు నిర్మిస్తారు. మెదక్ స్టేషన్లో 3 లైన్లు ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులకోసం ఒక ప్లాట్ఫారం, రవాణకోసం మరొకటి ఏర్పాటు చేసి ప్రయాణికులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తారు. రెండేళ్లలో ఈ నిర్మాణం పూర్తవుతుందని రైల్వేశాఖ అధికారులు తెలిపారు. పనులు త్వరితగతిన పూర్తి చేయిస్తాం అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రెండేళ్లలో పనులు పూర్తిచేయించి మెదక్ ప్రజలకు రైల్వేకూత వినిపిస్తాం. ఇందుకోసం రాష్ట్ర వాటా నుంచి ముందుగానే నిధులు మంజూరు చేయించాం. అవసరమైతే మరిన్ని నిధులు కూడా మంజూరు చేయిస్తాం. ఈ ప్రాంత ప్రజలకు, కాబోయే మెదక్ జిల్లాకు ఇది వరం లాంటింది. ప్రత్యేక జిల్లా, రైల్వేలైన్ కోసం కృషి చేసిన సీఎం కేసీఆర్‌కు ఆజన్మాంతం రుణపడి ఉంటాం. - డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి