works started
-
కనులపండువగా పూరీ రథయాత్రకు అంకురార్పణ
భువనేశ్వర్/పూరీ: శ్రీక్షేత్రంలో భంవురి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా గురువారం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుల ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో జరిగిన పూజలను అత్యంత భక్తిశ్రద్ధలతో చేపట్టారు. జగన్నాథుని రథయాత్ర ఘట్టాలను నిర్ణీత కాలంలో ఓ క్రమపద్ధతిలో ముగించడం ఆనవాయితీ కాగా, శ్రీమందిరం రత్నసింహాసనంపై కొలువైన మూలవిరాట్లకు తొలుత పూజలు చేసి, ఆజ్ఞామాలలు సమర్పించారు. అనంతరం 3 రథాలకు వేర్వేరుగా తయారు చేసిన ఆజ్ఞామాలలను రథ నిర్మాణ ప్రాంగణానికి తీసుకువచ్చిన ప్రధానార్చకుల వర్గం ఇరుసు, చక్రాలకు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ పూజల తర్వాత ఇరుసుకు ఇరువైపులా రెండు చక్రాల చొప్పున అమర్చారు. ఈ ప్రక్రియనే భంవురి ఉత్సవంగా పేర్కొంటారు. దీనినే రథయాత్రలో ప్రధాన భాగంగా కూడా భావిస్తారు. స్థానికంగా అయితే దీనిని చొక్కా డేరా నీతిగా వ్యవహరిచంగా, ఏటా దీనిని కనులపండువగా నిర్వహిస్తుండడం విశేషం. కరోనా విజృంభణ వేళ కూడా కోవిడ్–19 నిబంధనలు పాటిస్తూ శ్రీమందిరం ఆచార వ్యవహారాలకు ఏమాత్రం భంగం కలగకుండా ఉత్సవ ఆద్యంతాలు విజయవంతంగా సాగడం గమనార్హం. -
మసీద్ నిర్మాణంలో వెల్లివిరిసిన మత సామరస్యం
అయోధ్య: గణతంత్ర దినోత్సవ వేడుకలు ఒకపక్క ఘనంగా జరుగుతున్న తరుణంలో అయోధ్యలో నూతన మసీదు నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. అయోధ్య సమీపంలోని ధనిపూర్ గ్రామంలో మసీదు ప్రాజెక్టు పనులను లాంఛనంగా ఆరంభించారు. 2019 సుప్రీం కోర్టు తీర్పుననుసరించి సున్నీ వక్ఫ్ బోర్డు మసీదు ట్రస్టును ఏర్పాటు చేసిన ఆరునెలలకు ప్రాజెక్టు పనులు ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా ట్రస్టు చైర్మన్ జుఫర్ అహ్మద్ ఫరూఖీ జాతీయ పతాకం ఎగురవేశారు. ట్రస్టులోని ఇతర సభ్యులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి అన్ని మతాలకు చెందిన ప్రజలు హాజరై హర్షం ప్రకటించారు. గ్రామంలోని ఒక సూఫీ ప్రార్ధనా స్థలం పక్కన ఐదు ఎకరాలను మసీదు కోసం కేటాయించిన విషయం తెలిసిందే. ప్రారంభోత్సవం సందర్భంగా ముగ్గురు హిందువులు మసీదుకు విరాళాలు ప్రకటించారు. వీరిలో ఆర్ఎస్ఎస్ నాయకుడు అనిల్ సింగ్ కూడా ఉన్నారు. గతేడాది మసీదు ప్రాజెక్టు కోసం తొలి విరాళాన్ని లక్నో విశ్వవిద్యాలయానికి చెందిన రోహిత్ శ్రీవాస్తవ ఇచ్చారు. అయోధ్యలో రామ జన్మభూమి ఆలయ నిర్మాణంతో పాటు ఇక్కడ మసీదు నిర్మించడాన్ని హిందువుల్లో ఎక్కువమంది సమర్ధిస్తారని ఈ సందర్భంగా అనిల్ సింగ్ తెలిపారు. -
అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ పనులు షురూ
మెదక్: దశాబ్దాల ఎదురు చూపుల అనంతరం.. మెదక్ ప్రాంత ప్రజల కల నెరవేర బోతుంది. అక్కన్నపేట-మెదక్ రైల్వే లైన్ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. త్వరలోనే సొంత జిల్లా ఏర్పాటవుతున్న తరుణంలోనే రైల్వేలైన్ పనులు ప్రారంభం కావడంతో ఈ ప్రాంతవాసుల ఆనందాలకు అవధుల్లేవు. ఇందుకు సంబంధించిన పనులను మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి గత జూలైలో పాతూర్ గ్రామ శివారులో ప్రారంభించారు. రైల్వేలైన్ ఏర్పాటు పూర్తయితే ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. గతమంతా హామీలకే పరిమితం మెదక్‌కు రైల్వేలైన్ కావాలనేది ఈ ప్రాంతవాసుల దశాబ్దాల కల. నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ప్రాంతంనుంచి ఎంపీగా గెలుపొందారు. నాటి నుంచి మెదక్ ప్రాంత ప్రజలు రైల్వేలైన్‌కోసం పరితపించారు. నాటి నుంచి మెదక్‌కు ప్రాతినిధ్యం వహించిన ఎంపీలంతా రైల్వేలైన్ ఏర్పాటు కోసం ఎన్నో హమీలు చేశారు. ఈ ప్రాంతానికి రైల్వేలైన్ ఏర్పాటు చేయాలంటూ ఎన్నో ఉద్యమాలు కూడా జరిగాయి. ఇదే ప్రధాన డిమాండ్‌తో రైల్వేసాధన సమితి ఎన్నో పోరాటాలు చేసింది. యేటా రైల్వే బడ్జెట్ సమయంలో ఈ ప్రాంత ప్రజలు ఆశగా ఎదురు చూడటంతోనే సరిపెట్టారు. కాగా 2007లో అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ కోసం అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో నిర్మాణానికయ్యేఖర్చులో 50 శాతం వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరించింది. దీంతో 2010 రైల్వే బడ్జెట్లో ఏపీ ప్రభుత్వం, కేంద్రం కలిసి చేపట్టే కాస్ట్ షేరింగ్ ప్రాజెక్టు పనుల్లో దీనికి చోటు దక్కింది. అనంతరం మళ్లీ పనులు ముందుకు సాగలేదు. అనంతరం 2013 బడ్జెట్లో ఆమోదం లభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రసమితి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి చొరవతో భూసేకరణకు అవసరమైన నిధులతోపాటు పలువిడతల్లో నిర్మాణ పనులకోసం రాష్ట్రవాట నిధులను ముందుగానే మంజూరు చేయించారు. దీంతో పనుల ప్రారంభానికి మార్గం సుగమమైంది. రైతులకు పరిహారాన్ని వెంటనే చెల్లించడంతో వారు భూములను రైల్వే, రెవెన్యూ శాఖలకు అప్పగించారు. మెదక్ నుంచి అక్కన్నపేట వరకు 17.2 కిలో మీటర్ల దూరం నిర్మాణానికి రూ. 114.27 కోట్లు అవసరమవుతాయని అంచనావేశారు. ప్లానింగ్ కమిషన్‌కు ప్రతిపాదనలు పంపారు. కాబోయే జిల్లాకు ప్రయోజనాలు ఇప్పటి వరకు రెవెన్యూ డివిజన్‌గా ఉన్న మెదక్ మరో నెలలో జిల్లా కేంద్రం కాబోతుంది. దీంతో రైల్వేసదుపాయంతో ఎన్నోప్రయోజనాలు కలుగుతాయి. విద్యా, వ్యవసాయ, వ్యాపార, పర్యాటకరంగాల అభివృద్ధితోపాటు, చౌకగా రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ప్రజలకు మెరుగైన రవాణ అందుబాటులోకి వస్తుంది. స్టేషన్లు ఇవే.. అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ పొడువు 17.2 కిలోమీటర్లు రామాయంపేట మండలం లక్ష్మాపూర్, మెదక్ మండలం శమ్నాపూర్తోపాటు మెదక్ పట్టణంలో రైల్వేస్టేషన్లు నిర్మిస్తారు. మెదక్ స్టేషన్లో 3 లైన్లు ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులకోసం ఒక ప్లాట్ఫారం, రవాణకోసం మరొకటి ఏర్పాటు చేసి ప్రయాణికులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తారు. రెండేళ్లలో ఈ నిర్మాణం పూర్తవుతుందని రైల్వేశాఖ అధికారులు తెలిపారు. పనులు త్వరితగతిన పూర్తి చేయిస్తాం అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రెండేళ్లలో పనులు పూర్తిచేయించి మెదక్ ప్రజలకు రైల్వేకూత వినిపిస్తాం. ఇందుకోసం రాష్ట్ర వాటా నుంచి ముందుగానే నిధులు మంజూరు చేయించాం. అవసరమైతే మరిన్ని నిధులు కూడా మంజూరు చేయిస్తాం. ఈ ప్రాంత ప్రజలకు, కాబోయే మెదక్ జిల్లాకు ఇది వరం లాంటింది. ప్రత్యేక జిల్లా, రైల్వేలైన్ కోసం కృషి చేసిన సీఎం కేసీఆర్‌కు ఆజన్మాంతం రుణపడి ఉంటాం. - డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి -
సీఎం చదివిన పాఠశాలకు రూ.10 కోట్లు
చురుగ్గా సాగుతున్న కొత్త బిల్డింగ్ పనులు హర్షం వ్యక్తం చేస్తున్న దుబ్బాక ప్రజలు దుబ్బాక: సీఎం కేసీఆర్ బాల్యంలో ప్రాథమిక విద్యనభ్యసించిన దుబ్బాక ప్రభుత్వ బాలుర పాఠశాలకు మహర్దశ పట్టనుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దుబ్బాక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో అధునాతన హంగులతో పాఠశాల భవనం నిర్మిస్తున్నారు. కేసీఆర్ దుబ్బాక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యనభ్యసించారు. 1969లో ఆయన పదవ తరగతి పూర్తి చేశారు. చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలపై ఆయనకు ప్రత్యేకాభిమానం ఉండటంతో పాఠశాల నూతన భవన నిర్మాణానికి నిధులు కేటాయించారు. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చొరవతో సీఎం కేసీఆర్ ఇటీవల దుబ్బాకలో నిర్వహించిన నియోజకవర్గ సమీక్షా సమావేశంలో తాను చదువుకున్న దుబ్బాక ప్రభుత్వ పాఠశాలలో నూతన భవనాల నిర్మాణానికి రూ. 10 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. పాఠశాలను ఆధునాతన హంగులతో నిర్మించడానికి విద్యా మౌలిక వసతుల కల్పనా సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే సమక్షంలో అధికారులు రూపొందించిన పాఠశాల నమూనాను ఇటీవల సీఎం ఆమోదించారు. కొత్తగా నిర్మించే భవనాల్లో జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాల విద్యార్థులకు సరిపోను విశాలమైన 40 తరగతి గదులకు సంబంధించిన కొలతలను సిద్ధం చేశారు. పాఠశాల సిబ్బంది కూర్చోవడానికి ప్రధాన కార్యాలయం, విద్యార్థులకు డైనింగ్ హాల్, క్రీడా సామాగ్రిని భద్రపరుచుకోవడానికి స్పోర్ట్స్ గదులు, సైన్స్, మ్యాథ్య్, ల్యాబ్ గదుల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే గ్రంథాలయం పనులు చురుకుగా సాగుతున్నాయి. విద్యార్థులకు తగిన క్రీడా మైదానం సిద్ధం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు సొంత గడ్డపై ఉన్న మమకారంతో ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు భారీగా నిధులు కేటాయించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోడల్ స్కూల్ కోసమే ఆధునాతన భవనం రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా దుబ్బాక ప్రభుత్వ బాలుర పాఠశాలకు సీఎం కేసీఆర్ అత్యధికంగా నిధులు కేటాయించడం సంతోషకరమైన విషయం. కేసీఆర్ బాల్య జీవితంలో దుబ్బాకలో చదువుకోవడం ఈ ప్రాంతం చేసుకున్న అదృష్టం. దుబ్బాకతో కేసీఆర్‌కు ఆత్మీయ అనుబంధం ఉంది. పాఠశాల నూతన భవన నిర్మాణ విషయమై సీఎంను కలిసిన వెంటనే నిధులు కేటాయించారు. - ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, దుబ్బాక అనుకున్నది సాధించడం కేసీఆర్ నైజం కేసీఆర్ విద్యార్థి దశ నుంచే అనుకున్నది సాధించే వారు. ప్రజలతో మమేకమయ్యేవారు. మంచి చదువరి. తోటి విద్యార్థులకు నాయకత్వం వహించే వారు. అప్పటి తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. తాము చదువుకున్న పాఠశాలకు నిధులను కేటాయించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. - బొమ్మెర వెంకటేశం, కేసీఆర్ బాల్య మిత్రుడు