అయోధ్య: గణతంత్ర దినోత్సవ వేడుకలు ఒకపక్క ఘనంగా జరుగుతున్న తరుణంలో అయోధ్యలో నూతన మసీదు నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. అయోధ్య సమీపంలోని ధనిపూర్ గ్రామంలో మసీదు ప్రాజెక్టు పనులను లాంఛనంగా ఆరంభించారు. 2019 సుప్రీం కోర్టు తీర్పుననుసరించి సున్నీ వక్ఫ్ బోర్డు మసీదు ట్రస్టును ఏర్పాటు చేసిన ఆరునెలలకు ప్రాజెక్టు పనులు ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా ట్రస్టు చైర్మన్ జుఫర్ అహ్మద్ ఫరూఖీ జాతీయ పతాకం ఎగురవేశారు.
ట్రస్టులోని ఇతర సభ్యులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి అన్ని మతాలకు చెందిన ప్రజలు హాజరై హర్షం ప్రకటించారు. గ్రామంలోని ఒక సూఫీ ప్రార్ధనా స్థలం పక్కన ఐదు ఎకరాలను మసీదు కోసం కేటాయించిన విషయం తెలిసిందే. ప్రారంభోత్సవం సందర్భంగా ముగ్గురు హిందువులు మసీదుకు విరాళాలు ప్రకటించారు. వీరిలో ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు అనిల్ సింగ్ కూడా ఉన్నారు. గతేడాది మసీదు ప్రాజెక్టు కోసం తొలి విరాళాన్ని లక్నో విశ్వవిద్యాలయానికి చెందిన రోహిత్ శ్రీవాస్తవ ఇచ్చారు. అయోధ్యలో రామ జన్మభూమి ఆలయ నిర్మాణంతో పాటు ఇక్కడ మసీదు నిర్మించడాన్ని హిందువుల్లో ఎక్కువమంది సమర్ధిస్తారని ఈ సందర్భంగా అనిల్ సింగ్ తెలిపారు.
అయోధ్యలో మసీదు పనులు ప్రారంభం
Published Wed, Jan 27 2021 8:46 AM | Last Updated on Wed, Jan 27 2021 10:23 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment