
పూరీలో భవురి ఉత్సవంలో భాగంగా పూజలు చేస్తున్న అర్చకులు
భువనేశ్వర్/పూరీ: శ్రీక్షేత్రంలో భంవురి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా గురువారం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుల ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో జరిగిన పూజలను అత్యంత భక్తిశ్రద్ధలతో చేపట్టారు. జగన్నాథుని రథయాత్ర ఘట్టాలను నిర్ణీత కాలంలో ఓ క్రమపద్ధతిలో ముగించడం ఆనవాయితీ కాగా, శ్రీమందిరం రత్నసింహాసనంపై కొలువైన మూలవిరాట్లకు తొలుత పూజలు చేసి, ఆజ్ఞామాలలు సమర్పించారు.
అనంతరం 3 రథాలకు వేర్వేరుగా తయారు చేసిన ఆజ్ఞామాలలను రథ నిర్మాణ ప్రాంగణానికి తీసుకువచ్చిన ప్రధానార్చకుల వర్గం ఇరుసు, చక్రాలకు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ పూజల తర్వాత ఇరుసుకు ఇరువైపులా రెండు చక్రాల చొప్పున అమర్చారు. ఈ ప్రక్రియనే భంవురి ఉత్సవంగా పేర్కొంటారు. దీనినే రథయాత్రలో ప్రధాన భాగంగా కూడా భావిస్తారు. స్థానికంగా అయితే దీనిని చొక్కా డేరా నీతిగా వ్యవహరిచంగా, ఏటా దీనిని కనులపండువగా నిర్వహిస్తుండడం విశేషం. కరోనా విజృంభణ వేళ కూడా కోవిడ్–19 నిబంధనలు పాటిస్తూ శ్రీమందిరం ఆచార వ్యవహారాలకు ఏమాత్రం భంగం కలగకుండా ఉత్సవ ఆద్యంతాలు విజయవంతంగా సాగడం గమనార్హం.