అంతా మాయ! | forest department land scam ruling party | Sakshi
Sakshi News home page

అంతా మాయ!

Published Wed, Jul 5 2017 3:43 AM | Last Updated on Wed, Sep 26 2018 6:01 PM

అంతా మాయ! - Sakshi

అంతా మాయ!

రిజర్వ్‌ ఫారెస్ట్‌ను అన్‌ రిజర్వ్‌డ్‌గా చూపించేందుకు విశ్వ ప్రయత్నాలు
♦  దేవరకొండ దోపిడీకి సర్కారు అండ
♦  జియో కో ఆర్డినేట్స్‌ను మార్చేసిన పెద్దలు
♦  క్వారీ తవ్వకాలకు అనుకూలంగా మారిపోయిన మ్యాపులు
♦  అది అటవీ శాఖ భూమి అని తేల్చి చెప్పిన ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా
♦  ఈ నెల 22న న్యాయ స్థానానికి నివేదిక అందజేయనున్న అధికారులు


తిమ్మిని బమ్మిని చేసి... బమ్మిని తిమ్మిని చేసే కుతంత్రాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. సర్కారు ఆస్తుల్ని దర్జాగా అప్పగించేసేందుకు పెద్ద స్థాయిలో పైరవీలు నడుస్తున్నాయి. గిరిజనుల మనోభావాలను పట్టించుకోకుండా... వారి ఆందోళనలు లెక్క చేయకుండా... తమకు అనుకూలంగా నివేదికలు రూపొందించుకునేందుకు ఆ కొండలపై వాలిన డేగలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఎక్కడ కొల్లగొట్టేందుకు అవకాశం ఉంటుందో అక్కడ దోపిడీ చేసేయడానికి పక్కా వ్యూహాలు తయారైపోతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బడానేతల కనుసన్నల్లో అధికారుల నివేదికలు సిద్ధమైపోతున్నాయి.

సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో బడేదేవరకొండ గ్రానైట్‌ నిక్షేపాలను దోచుకునేందుకు అధికార పార్టీ నేతల యత్నాలు తారాస్థాయికి చేరాయి. ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు చెందిన మంత్రే అందుకు పరోక్షంగా సహకారం అందిస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సర్వే రికార్డులు మార్చిన దగ్గర నుంచి తాజాగా తప్పుడు మ్యాపులు తయారీ వరకూ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, మంత్రి అనుచర గణం చేస్తున్న తెర వెనుక కుట్రలు విస్తుగొలుపుతున్నాయి.

మరో భారీ కుంభకోణానికి తెరదీస్తున్నాయి. పార్వతీపురం మండలంలో కోరి సర్వే నెం.1లో అత్యంత విలువైన కాశ్మీరీ గ్రానైట్‌ నిక్షేపాలను తవ్వుకోవడానికి టీడీపీ ప్రభుత్వం తమిళనాడుకు చెందిన ఫళనివేల్‌ అనే బడా వ్యాపార వేత్తకు అనుమతులిచ్చింది. 41.25 ఎకరాల్లో గనులు తవ్వుకోవచ్చని చెప్పడంతో ఆయన రోడ్లు కూడా వేసుకున్నాడు. అయితే అతనికి అనుమతిచ్చిన చోట కాకుండా మరోచోట తవ్వుకునేందుకు అక్కడ భారీ అక్రమాలకు తెరదీశారు. సీఎం పేషీలోని కొందరు పెద్దల ద్వారా అధికారులను గుప్పిట్లో పెట్టుకుని, జిల్లా మంత్రి అండదండలతో పథకం ప్రకారం జరిగిన ఈఅక్రమాల్లో రూ.కోట్లు చేతులుమారుతున్నాయి.

అసలేం జరుగుతోందంటే...
అటవీ భూములను గుర్తించడానికి ఉన్న ప్రధాన మార్గం జియో కో ఆర్డినేట్స్‌. వాటి ఆధారంగానే ఏ ప్రాంతం రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఉంది. ఏ ప్రాంతం అన్‌ రిజర్వ్‌లో ఉందనే విషయాలను తెలుసుకుంటుంటారు. ఫళనివేల్‌ ఇక్కడే తన బుద్ధి కుశలతను ఉపయోగించారు. తమకు అనుమతి ఉన్న కోరి ప్రాంతంలో కాకుండా ములగ ప్రాంతంలోని సర్వే నెం.1లో జియో కో ఆర్డినేట్స్‌ను సృష్టించారు. నిజానికి ఈ భూముల్లో దేవరకొండ ఊటనీటితో అక్కడి గిరిజనులు 10వేల ఎకరాలను సాగు చేసుకుంటున్నారు. 1993లో అటవీ భూములను డిజిటలైజ్‌ చేశారు. దాని ప్రకారం 2005లో ఈ ప్రాంతాన్ని రిజర్వ్‌ ఫారెస్ట్‌ అని తేల్చారు. అదే విషయాన్ని తాజాగా ఢిల్లీలోని ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా కూడా తన నివేదికలో స్పష్టం చేసింది. రిజర్వ్‌ ఫారెస్ట్‌కు అటవీ శాఖ లేయర్స్‌ను తయారు చేస్తుంది. వాటి ప్రకారం చూసినా ఈ భూమి రిజర్వ్‌ ఫారెస్ట్‌గానే ఉంది.

సర్వే పేరుతో సరికొత్త ఎత్తుగడ
గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో హైలెవెల్‌ కమిటీ హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైంది. గతనెలలో చీఫ్‌ కమిషనర్‌ సర్వే అండ్‌ లాండ్‌ రికార్డ్స్‌ ఆ కమిటీలోని డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌(ఇన్‌చార్జ్‌) శ్రీధర్, డైరెక్టర్‌ ఆఫ్‌ సర్వే అండ్‌ లాండ్‌ రికార్డ్స్‌ విజయమోహన్, ఫారెస్ట్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ పి.కె.సారంగి జిల్లాకు వచ్చి అధ్యయనం చేశారు. ఆ సమయంలో తెర వెనుక జరిగిన అంశాలను రహస్యంగా ఉంచి కోర్టుకు నివేదిక ఇస్తామని ప్రజలకు చెప్పి వారు వెళ్లిపోయారు. ఆ రోజు అటవీ శాఖ నుంచి వారికి అనేక ఆధారాలు లభించాయి. ఆ భూమి రిజర్వ్‌ ఫారెస్ట్‌ అని చెప్పడానికి ఉన్న అన్ని డాక్యుమెంట్లను ఆ శాఖ అధికారులు చూపించారు.

 ప్లాన్‌ బెడిసికొడుతుందని భావించిన ప్రభుత్వం, మంత్రి, ఫళనివేల్‌తో కుమ్మక్కైన ఓ అధికారి కొత్త మెలిక పెట్టారు. ఫారెస్ట్, రెవెన్యూ శాఖలు విడివిడిగా సర్వే చేయించుకోవడం కాదు రెండూ కలిసి సర్వే చేయాలని చెప్పి కమిటీని తప్పుదోవ పట్టించి పంపించేశారు. దీని వెనుక అసలు కారణం తాజాగా తయారు చేస్తున్న మ్యాపుల్లో తమకు అనుకూలంగా మార్పులు చేయాలనుకోవడమేనని తెలుస్తోంది. నిజానికి ఇప్పటికే పాత మ్యాపులో జియో కో ఆర్డినేట్స్‌ను మార్చేశారు. దానిపై అప్పటి అధికారులు కనీసం చూసుకోకుండా సంతకాలు చేసేశారు. ఇప్పుడు అంతకు మించి పక్కా మ్యాపులు తయారు చేయడానికి మొదటి పాయింట్‌ నుంచి చేయాల్పిన సర్వేను కేవలం మైనింగ్‌ ప్రాంతంలో మాత్రమే చేస్తూ మమ అనిపిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement