కాగితపు పరిశ్రమ కలేనా?
అచ్చంపేట : విస్తారమైన వెదురు వనాలు, నిష్ణాతులైన కూలీలు ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా నల్లమల అటవీప్రాంతంలో కాగితపు పరిశ్రమ దశాబ్దాలుగా హామీగానే మిగిలింది. అటవీ, మైదాన ప్రాంతవాసులకు ఉపాధి అవకాశాలు లభిం చకపోవడంతో వలసబాటే మార్గమైంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో ఈ ప్రాంతంలో నెలకొల్పాల్సిన కాగితపు పరిశ్రమ మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజనతో నాగర్జునసాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లు రెండుగా విడిపోయాయి. మహబూబ్‌నగర్, నల్లగొండ, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల పరిధిలో సుమారు 3,568 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అటవీప్రాంతం మహబుబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలోకి 2,220 చదరపు కిలోమీటర్ల మేర ఎక్కువ విస్తీర్ణం కలిగిన భూమి తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చింది. ఈ ప్రాంతంలో మూడో వంతున వెదురు వనాలు పుష్కలంగా ఉన్నాయి. సుమారు 1100 చదరపు కిలోమీటర్ల మేర వెదురు వనాలు ఉన్నట్లు అటవీశాఖ అంచనా.
అభయార్యణ ప్రాంతం కాకముందు నల్లమల అటవీప్రాంతం నుంచి సేకరించిన వెదురును ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ కాగితపు పరిశ్రమకు నెలకు వెయ్యి లారీల చొప్పున తరలించేవారు. ప్రస్తుతం అభయారణ్య ప్రాంతం కాని ప్రదేశాల్లో మాత్రమే వెదురు కలపను సేకరిస్తున్నారు. ఏటా జిల్లాలోని అచ్చంపేట సబ్ డివిజన్ పరిధిలోని కొల్లాపూర్, లింగాల రేంజ్‌లలో మాత్రమే వెదురు కలప సేకరణ జరుగుతుంది. కొల్లాపూర్‌లో డంప్‌యార్డును ఏర్పాటుచేశారు. అచ్చంపేట, మన్ననూర్, అమ్రాబాద్ రేంజ్‌లు అభయారణ్య ప్రాంతం కావడంతో ఇక్కడ వెదురు సేకరణను నిలిపేశారు. ఇదే అదనుగా నల్లమలలోని వెదురువనాలపై స్మగ్లర్ల కన్ను పడింది. లక్షల విలువ చేసే వెదురు కలపను దొంగదారిన ప్రకాశం, కర్నూలు, హైదరాబాద్ ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
వెదురు సేకరణ ఇలా..
నల్లమలలో వెదురు విస్తారనంగా ఉన్నా సేకరించలేకపోతున్నారు. కాంట్రాక్టర్, కూలీల కొరతే ఇందుకు కారణమని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అటవీశాఖ లెక్కల ప్రకారం ప్రభుత్వానికి వెదురు సేకరణ వల్ల ఏటా రూ.75లక్షల నుంచి రూ.కోటి వరకు ఆదాయం సమకూరుతుంది. 2010-11లో 7.50 లక్షల వెదురు కర్రల సేకరణే లక్ష్యంగా నిర్ణయించగా నాలుగు లక్షలను మాత్రమే సేకరించగలిగారు.
2011-12 టార్గెట్ ఆరు లక్షల కర్రలకు రూ.4.87లక్షలు సేకరించారు. 2012-13లో 9లక్షలకు గాను ఐదు లక్షల వెదురుకర్రలను మాత్రమే సేకరించారు. 2013-14లో 15 లక్షలు లక్ష్యం కాగా, నాలుగు లక్షలు వచ్చింది. కాగా, 2014-15 సంవత్సరాన్ని క్రాప్‌హాలిడేగా ప్రకటించడంతో సేకరణ నిలిచిపోయింది. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో వెదురు కలప సేకరణలో నిష్ణాతులైన ఈ ప్రాంత కూలీలు మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు పనులకు వెళ్తున్నారు.
కలిసొచ్చే అవకాశాలివే..!
మహబూబ్‌నగర్ జిల్లా సమీప నల్లమల అటవీప్రాంతం నుంచే కృష్ణానది ప్రవహిస్తోంది. అచ్చంపేటకు 40 కిలోమీటర్లు, లింగాల మండలానికి కేవలం 10 కిలోమీటర్ల మేర నదీ పరివాహక ప్రాంతం ఉంది. ఒకవేళ ఈ ప్రాంతంలో కాగితపు పరిశ్రమను ఏర్పాటుచేస్తే కృష్ణానది నుంచి గ్రావిటీ ద్వారా పుష్కలంగా నీటిని వాడుకోవచ్చు.
పరిశ్రమకు అవసరమయ్యే విద్యుత్‌ను అచ్చంపేట నుంచి పొందే అవకాశం ఉంది. ఏటా పాలమూరు జిల్లా నుంచి సుమారు రెండు నుంచి మూడు లక్షల మంది వివిధ ప్రాంతాలకు వలసవెళ్తున్నట్లు అంచనా. ముఖ్యంగా కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, నారాయణపేట ప్రాంతాల నుంచి వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలో పరిశ్రమను ఏర్పాటుచేస్తే వీరికి ఉపాధి దొరకే అవకాశం ఉంది.
ఏడాదిగా కలప సేకరణ నిలిపివేత
కొల్లాపూర్, లింగాల రేంజ్‌ల పరిధిలో ఈ ఏడాది వెదురు సేకరణ ఉండదు. ఒక టి, రెండు సంవత్సరాల పాటు సేకరణ నిలి పేయడం వల్ల కర్ర దృఢంగా పెరుగుతుం ది. 2014-15 సంవత్సరంలో వెదురు సేకరణ నిలిపేశాం. కూలీల కొరత, కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వంటి కారణాలతో లక్ష్యాన్ని సాధించలేకపోతున్నాం.
- వెంకటరమణ, డీఎఫ్‌ఓ. అచ్చంపేట