మధ్యాహ్న భోజన బియ్యం పట్టివేత
Published Mon, Feb 27 2017 1:44 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM
బల్మూరు(అచ్చంపేట) : విద్యార్థులకు అందించాల్సిన మధ్యాహ్న భోజన బియ్యాన్ని రాత్రివేళ వంట ఏజెన్సీ నిర్వాహకులు పక్కదారి పట్టిస్తుండగా సర్పంచ్‌తోపాటు గ్రామస్తులు పట్టుకున్నారు. ఈ సంఘటన బల్మూరులో చోటుచేసుకుంది. గ్రామ సర్పంచ్ శివశంకర్ కథనం ప్రకారం.. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి వంట ఏజెన్సీ నిర్వాహకుడు మశయ్య రాత్రి 8.30 గంటల సమయంలో మధ్యాహ్న భోజన బియ్యం సుమారు 15 కిలోలు, మంచినూనె, చింతపండును పాఠశాల గేట్ దూకి తీసుకెళ్తుండగా గ్రామస్తులు గమనించి పట్టుకున్నారు. దీనిపై ఏజెన్సీ నిర్వాహకుడిని నిలదీయడంతో హెచ్‌ఎం తీసుకురమ్మంటే తాను తీసుకెళ్తున్నట్లు చెప్పాడు. దీంతో సర్పంచ్, గ్రామస్తులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
పాఠశాలలో కొంతకాలంగా జీహెచ్‌ఎం శ్రీనివాసమూర్తి వంట ఏజెన్సీ వారితో విద్యార్థులకు అందించాల్సిన బియ్యం, సామగ్రి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నాడని సర్పంచ్ ఆరోపించారు. దీనిపై జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేసి హెచ్‌ఎంతోపాటు ఏజెన్సీ వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై హెచ్‌ఎం శ్రీనివాసమూర్తిని వివరణ కోరగా వంట మనిషి బియ్యం తరలించిన విషయంతో తనకు సంబంధం లేదన్నారు. పాఠశాల ఎస్‌ఎంసీ ఎన్నికల్లో వచ్చిన వివాదంతో సర్పంచ్‌తోపాటు ఆయన వర్గీయులు కావాలని ఇబ్బందులకు గురిచేసేందుకు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇది కేవలం ఏజెన్సీ వారికే సంబంధమని శనివారం తాను విధులకు రాకపోవడంతో బియ్యం మిగిల్చి తీసుకెళ్లి ఉండవచ్చని హెచ్‌ఎం చెప్పుకొచ్చారు.
Advertisement