సమావేశంలో మాట్లాడుతున్న ఎఫ్‌డీ వినోద్ కుమార్
మన్ననూర్ (అచ్చంపేట) : అమ్రాబాద్ పులుల రక్షిత ప్రాంతం (కోర్ ఏరియా)లో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నామని వాటి స్థానంలో పేపర్, బట్ట సంచులను అందుబాటులో ఉంచుతున్నట్లు ఫీల్డ్ డైరెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం అటవీశాఖ ఈసీ సెంటర్ వద్ద డబ్లూడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. మానవ మనుగడతో పాటు జీవరాశులకు ముప్పు కలిగించే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వన్యప్రాణులకు అమ్రాబాద్ అభయారణ్యం దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగి ఉండటం గర్వకారణమని అన్నారు.
ఈ క్రమంలో పర్యాటకులు, అటవీ సమీప గ్రామాల ప్రజలు ప్లాస్టిక్‌ను ఉపయోగించడం, పారబోయడంతో వాటిని తింటున్న వన్యప్రాణులు మృత్యవాతపడుతున్నాయని అన్నారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ డైరెక్టర్ ఫరీదా టంపల్ మాట్లాడుతూ శ్రీశైలం – హైదరాబాద్ ప్రధాన రహదారి వెంట అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించి వన్యప్రాణులను కాపాడాలన్నారు. ఈ ప్రాంతంలో పేవర్ కవర్ల తయారీ కోసం కుటీర పరిశ్రమను మరో నెల రోజుల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పేపర్ కవర్ల తయారీ కోసం చెంచు మహిళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. అడవులను, జంతుజాలాన్ని రక్షించుకోవాలని కళాకారుల ఇచ్చిన ప్రదర్శన, ఆట పాటలు ఆకట్టుకున్నాయి.
యాత్రికులకు పేపర్ కవర్లు అందజేత
అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద డబ్ల్యూడబ్ల్యూఎఫ్, శ్రీనివాస ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీశైలం వెళ్లే యాత్రికులకు పేపర్ కవర్లు అందజేశారు. టోల్‌గేట్ రూ.20లకు అదనంగా రూ.5 వసూలు చేసి కవర్ అందిస్తున్నారు. దీంతోపాటు మరో రూ.25 అదనంగా వసూలు చేస్తున్నారు. మన్ననూర్ నుంచి దోమలపెంట వరకు ఎలాంటి చెత్త, వ్యర్థాలు ఉన్నా రోడ్డు పక్కన వేయకూడదు. కవర్‌లో వేసి దోమలపెంట చెక్‌పోస్టు వద్ద అటవీశాఖ సిబ్బందికి కవర్ అందించాలి. వారు రూ.25 తిరిగి ఇస్తారని అధికారులు తెలిపారు.
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
పర్యావరణ రోజు సందర్భంగా అమ్రాబాద్, మన్ననూర్ రేంజ్ పరిధిలోని ఆయా పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో శ్రీనివాస ఛారిటబుల్ ట్రస్టు డైరెక్టర్ శ్రీనివాస్, డీఎఫ్‌ఓ జోజీ,ఎఫ్‌ఆర్‌ఓలు ప్రభాకర్, శ్రీదేవి ఎఫ్‌ఎస్‌ఓ రామాంజనేయులు సిబ్బంది బాబలి, వెంకటేశ్వర్లు, కనకయ్య, కళాకారులు మాడ్గుల నర్సింహ, లింగస్వామి, బీముడు, ఆయా చెంచుపెంటల మహిళలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment