‘హెరిటేజ్’ పాలు నిషేధించాలి
టీఆర్‌ఎస్ నేతల డిమాండ్
తార్నాకలో భారీ ర్యాలీ..ఆందోళన
తార్నాక:నాణ్యతలేకుండా పంపిణీ చేస్తున్న హెరిటేజ్ పాలను తెలంగాణ రాష్ట్రంలో నిషేదించాలని తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతే శోభన్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హెరిటేజ్ పాలను పూర్తిగా నిషేదించాలని డిమాండ్ చేస్తూ బుధవారం విజయ డెయిరీ కార్మికులు, తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెల్, తార్నాక మినీలారీస్ అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో లాలాపేట నుంచి తార్నాక చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. విజయ పాలు ముద్దు- హెరిటేజ్ పాలు వద్దు...విషపూరిత పాలు హెరిటేజ్ పాలు అంటూ ర్యాలీ పొడవునా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అనంతరం తార్నాక చౌరస్తాలో హెరిటేజ్ పాలను రోడ్డుపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ తార్నాక డివిజన్ వర్కింగ్ ప్రసిడెంట్ వేణుగోపాల్‌రెడ్డి, యుత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరెల్లి నాగరాజుగౌడ్, కార్మిక సంఘం నాయకులు శివానందం, చక్రవర్తిగౌడ్, పర్మేష్, అంజి, శంకర్, వెంకటస్వామి, శైలజ, రంగారెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వినియోగదారుల ఫిర్యాదు
మన్సూరాబాద్: హెరిటేజ్ కంపెనీ వారు నాణ్యత లేని పాలు సరఫరా చేయడంతో అవి వేడి చేయగానే విరిగిపోయాయని పలువురు వినియోగదారులు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పల్ యూనిట్ నుంచి ఎల్‌బీనగర్ పరిసర ప్రాంతాలకు పరఫరా చేసిన యూ18 ఎస్‌టీ బ్యాచ్ నెంబర్ గోల్డ్ స్టాండరైజ్డ్ పాలను మిల్క్‌పార్లర్ల వద్ద వినియోగదారులు కొనుగోలు చేశారు. అయితే పాలు విరిగిపోవడంతో వెంటనే సమీపంలోని మిల్క్ ఏజెంట్లకు ఫిర్యాదు చేశారు. వారు కంపెనీ ప్రతినిధులకు సమాచారం అందించారు. ఎల్‌బీనగర్ ప్రాంతంలో నాణ్యతలేని పాలు దాదాపు 800 లీటర్లు సరఫరా అయ్యాయి.
తయారీలో లోపం నిజమే...
ఉప్పల్ యూనిట్ నుంచిసరఫరా అయిన పాల తయారీలో లోపం ఏర్పడిన మాట వాస్తవమేనని హెరిటేజ్ ఎల్‌బీనగర్ బ్రాంచి మేనేజర్ రాజిరెడ్డి పేర్కొన్నారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదు రాగానే వెంటనే ఏజంట్లను అప్రమత్తం చేసి వాటిని అమ్మవద్దని కోరినట్లు తెలిపారు. ఫిర్యాదు చేసిన కొనుగోలుదారులకు రెగ్యులర్ టోన్డ్ పాలను అందజేయమని కోరామని, సుమారు 50 శాతం పైగా పాలను వెనక్కి తెప్పించామని చెప్పారు.
ఒక్కరోజే 20 వేల లీటర్ల పాలు పాడయ్యాయి...
-ట్విన్ సిటీస్ మిల్క్ వెండర్స్ అసోసియేషన్ ఆరోపణ
వనస్థలిపురం: హెరిటేజ్ సంస్థ పాల విక్రయాల వల్ల తాము నష్టపోతున్నామని, బుధవారం ఒక్కరోజే 20 వేల లీటర్ల హెరిటేజ్ స్టాండర్డ్ (గోల్డ్) పాలు పాడైపోయాయని జంటనగరాల మిల్క్ వెండర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపించారు. బుధవారం వనస్థలిపురంలో టీఆర్‌ఎస్ నాయకులు, మిల్క్ వెండర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ముద్దగౌని రాంమోహన్‌గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు కుంబ వెంకటేష్‌గౌడ్, ఉపాధ్యక్షులు రెహమాన్, కార్యదర్శి శ్రీరంగం తదితరులు మాట్లాడుతూ బుధవారం తాము సరఫరా చేసిన హెరిటేజ్ స్టాండర్డ్ (గోల్డ్) పాలు తాగి పలు ప్రాంతాలలో చిన్న పిల్లలు అస్వస్థతకు గురైనట్లు పలు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందాయని అన్నారు. ఈవిషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా రాంమోహన్‌గౌడ్ తెలిపారు.