Heritage milk
-
పాడి రైతును చితగ్గొట్టి "హెరిటేజ్‌కు పట్టం"
-
‘హెరిటేజ్ అంతా పాపాల పుట్ట’
సాక్షి, తాడేపల్లి: ఓడించారన్న కోపంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు... ప్రజలపై అక్కసు తీర్చుకుంటున్నారని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పదవి పోయిన తర్వాత చంద్రబాబుకు పిచ్చి పట్టిందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు దోచుకున్న డబ్బులను హెరిటేజ్‌లో పెట్టారని.. హెరిటేజ్ అంతా పాపాలపుట్ట అని విమర్శించారు. ఏ వ్యాపారం చేసి వందల కోట్లను చంద్రబాబు సంపాదించారని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉండి పాపాలు చేసి ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారని.. అమరావతి పేరుతో గుంటూరు, విజయవాడను సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. భూములు దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ.. ప్రజలపై చంద్రబాబుకు మమకారం, ప్రేమ లేదన్నారు. మాయమాటలతో ఆయన ప్రజలను మభ్యపెట్టారని.. అందుకే 2019లో చంద్రబాబును వదిలేశారని విమర్శలు గుప్పించారు. ‘‘దుర్గమ్మవారి జోలికి వెళ్లినందుకే.. చంద్రబాబుకు మనశ్శాంతి లేకుండా పోయింది. కుట్రలు, క్షుద్ర రాజకీయాలు మానుకోవాలి. చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని’’ పేర్ని నాని హితవు పలికారు. చంద్రబాబు సీఎంగా ఉండి కనీసం ఒక వంతెన నిర్మించలేదని.. ఆయన హయాంలో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేక పోయారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఏదో చేస్తానంటూ ప్రజలకు చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారని.. చంద్రబాబుకు చేతనైంది ఒక్క మోసం చేయడమేనని’’ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు. చదవండి ‘బాబు దుర్మార్గం.. టీడీపీ నేతలే నిజాలు కక్కారు’ నిరాశ, నిస్పృహలతోనే బాలకృష్ణ దాడి.. -
మొన్న విశాఖ డెయిరీ నేడు హెరిటేజ్
-
పచ్చ పా ‘పాలు’
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న హెరిటేజ్ డెయిరీ దిన దిన ప్రవర్ధమానమవుతూ వందల కోట్ల లాభాల్లోకి రాకెట్లా దూసుకుపోతోంది. ముఖ్యమంత్రి ఆస్తులు, కుటుంబ ఆస్తులు కూడా 2014 సాధారణ ఎన్నికలతో పోలిస్తే 2019 ఎన్నికలకు రెట్టింపు అయ్యాయి. కానీ ఒంగోలు డెయిరీ మాత్రం రూ.కోట్లలో అప్పుల్లోకి కూరుకుపోయింది. అది కూడా తెలుగుదేశం పార్టీ పాలక మండలి చేతుల్లోనే కావటం గమనార్హం. సాక్షి, ఒంగోలు సబర్బన్: ఒంగోలు గిత్త అంటే అంతర్జాతీయ కీర్తి. ప్రకాశం పాలకు ఉన్న రుచి ఏ ప్రాంత పాలకూ రాదు. అందుకే ఒంగోలు డెయిరీ రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలిగింది. ఏడాదికి రెండు నుంచి మూడు కోట్ల లీటర్ల పాలు ప్రతి సంవత్సరం జిల్లాతో పాటు రాష్ట్ర సరిహద్దులు దాటేవి. అలాంటి ఒంగోలు డెయిరీని టీడీపీ పాలకులు నిలువునా నాశనం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆధీనంలో ఉన్న ఒంగోలు డెయిరీ పాలక మండలి రూ.80 కోట్లకు పైగా బొక్కి ఒట్టి పోయిన గేదెను వదిలినట్లు వదిలి వెళ్లిపోయింది. 15 సంవత్సరాలకు పైగా చైర్మన్‌గా ఉన్న ఓగూరుకు చెందిన టీడీపీ నాయకుడు చల్లా శ్రీనివాసరావు కోట్ల రూపాయలు వెనకేసుకొని పూర్తి స్థాయిలో నష్టాల ఊబిలోకి నెట్టి జిల్లా పాడి రైతులను నిలువునా ముంచి వెళ్లిపోయాడు. లబోదిబో మంటూ జిల్లాలోని పాడి రైతులు, చివరకు అధికార పార్టీ నాయకులు సైతం ఉద్యమాలు, ఆందోళనలు చేయటంతో నాలుక కరుచుకున్న చంద్రబాబు ప్రభుత్వం చల్లా శ్రీనివాసరావు పాలకమండలిని రద్దు చేసి ప్రభుత్వ అధికారులతో కూడిన కమిటీని నియమించింది. అధికారులతో కూడిన కమిటీ కూడా తామేమీ తక్కువ కాదంటూ డెయిరీని ముందుకు తీసుకెళ్లటంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. నూతన కమిటీ ఏర్పాటైనా.. రాష్ట్ర అధికారి జుజ్జవరపు మురళి అధ్యక్షునిగా నూతన కమిటీ 2018 జూలై 19న ఏర్పాటైంది. సరిగ్గా 2019 మార్చి 19కి ఎనిమిది నెలలు పూర్తయింది. అయితే డెయిరీ ఒక అడుగు ముందుకు, ఎనిమిది అడుగులు వెనక్కు అన్న చందంగా తయారైంది. డెయిరీకి నూతనంగా సీఈఓతో పాటు మరో ఇద్దరు అధికారులను అదనంగా కేటాయించినా అభివృద్ధి విషయంలో అడుగు ముందుకు పడటం లేదు. డెయిరీని ఆదుకోవటానికి ఏపీడీడీసీఎఫ్ నుంచి రూ.35 కోట్లు అప్పు తీసుకున్నారు. ఈ రుణాన్ని 2018 జూన్ 27న జీఓ ఎంఎస్ నంబర్ 26, ఏహెచ్డీడీ అండ్ ఎఫ్ కింద విడుదల చేశారు. అందుకుగాను రుణానికి తాకట్టుగా డెయిరీకి చెందిన రూ.58.98 కోట్ల విలువైన 8.75 ఎకరాలను తనఖా పెట్టారు. దీనికి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆయా సందర్భాల్లో ప్రకటించిన రెపో రేటు మీద 2 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంది. ఈ లెక్క ప్రకారం ప్రస్తుతం ఈ రుణానికి 8.25 శాతం వడ్డీ రేటు పడుతుంది. అందుకుగాను రుణాన్ని 2020 నవంబర్ నుంచి నెల నెలా కంతుల వారీగా వాయిదాలు చెల్లించేలా మారటోరియం ఉంటుంది. అప్పటి నుంచి నెలకు రూ.18,01,062 వాయిదాలుగా చెల్లించాలి. డెయిరీ నిర్వహణతో పాటు అంటే ఉద్యోగుల జీతాలు, కరెంటు బిల్లులు, పాడి రైతులకు చెల్లింపులు, రవాణా చార్జీలు చెల్లింపులు ఇలా అన్నీ సరిచేసుకుంటూ నెలవారీ వాయిదా కింద రూ.18,01,062 చెల్లించాలంటే అప్పటికి పూర్తి స్థాయిలో లాభాల బాట పడితే తప్ప చెల్లించే పరిస్థితి ఉండదు. ఇలా 120 సమాన వాయిదాల్లో రుణాన్ని చెల్లించాల్సి ఉంది. నూతన కమిటీ ప్రారంభమై ఎనిమిది నెలలు పూర్తయినా ఇంకా పాల సేకరణ ఒక కాలిక్కి రాలేదంటే ఎప్పటికి డెయిరీ పాలకమండలి పాడి రైతుల్లో పూర్తి స్థాయి విశ్వాసం, నమ్మకాన్ని పెంచుకుంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. కమిటీ వేసే సమయానికి డెయిరీ రూ.58.34 కోట్ల అప్పుల్లో ఉంది. ఇంకా నేటికీ అప్పుల్లోనే కొనసాగుతూనే ఉంది. 2016–17 ఆర్ధిక సంవత్సరంలో రూ.7.29 కోట్ల నష్టాల్లోనూ, 2017–18లో రూ.58.34 కోట్లు నష్టాల్లో ఉన్న డెయిరీని ఆదుకుంటారనుకుంటే ఇంకా అదనపు భారాలు మోపి ఇంకా పీకల్లోతు నష్టాల్లోకి నెట్టే ఆలోచనలే చేస్తున్నారన్న విమర్శలు పాలక మండలిపై వినిపిస్తున్నాయి. ఇప్పటికీ రోజుకు 20 వేల లీటర్ల లోపుకు పడిపోయిన వైనం పాడి రైతులకు పూర్తి స్థాయిలో పాత పాల బకాయిలు చెల్లించి డెయిరీపై విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచితే తప్ప పాలు గతంలో మాదిరిగా రావు. ఎనిమిది నెలలు పూర్తయినా ఇంకా రోజుకు 15 నుంచి 20 వేల లీటర్లు లోపుకు పడిపోయాయి. కొత్త కమిటీ వచ్చి పాల సేకరణ ప్రారంభించటంతో జనవరి నెల వరకూ 20 నుంచి 25 వేలు వరకు పాలు వచ్చేవి. కానీ మధ్యలో పాడి రైతులకు సక్రమంగా పాల డబ్బులు ఇవ్వకపోవటంతో పాడి రైతులు పాలు ఆపారు. దీంతో డెయిరీకి పాలు రావటం గగనంగా మారింది. ఉన్నత స్థాయి అధికారుల చేతిలో డెయిరీని పెడితే దీని ఆలనా...పాలనా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. డెయిరీ తిరిగి పునర్వైభవం సాధించాలంటే పాల సేకరణపై ముమ్మరంగా దృష్టి సారించాల్సి ఉంది. పాత పాలక మండలి నష్టాల బాట పట్టించినా 2017–18 ఆర్థిక సంవత్సరంలో 71.23 లక్షల లీటర్ల పాలు సేకరించారు. అంతకు ముందు ఏ సంవత్సరంలో కూడా సంవత్సరానికి పాలు 2 కోట్ల లీటర్లకు ఎప్పుడూ తగ్గలేదు. 2010–11 సంవత్సరంలో 2.31 కోట్ల లీటర్ల పాలు, 2011–12లో 2.67 కోట్ల లీటర్ల పాలు సేకరించేవారు. చివరకు 2016–17లో రూ.7.29 కోట్ల నష్టం చూపించిన సంవత్సరంలో కూడా 2.34 కోట్ల లీటర్ల పాలు సేకరించారంటే డెయిరీ పూర్వవైభవం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోజుకు కనీసం 60 నుంచి 70 వేల లీటర్ల పాలు సేకరిస్తేనే డెయిరీ నష్టాల బాట నుంచి బయట పడి లాభాల్లో వెళుతుంది. అంతే తప్ప ప్రస్తుతం కొనసాగుతున్నట్లు అయితే మాత్రం రుణం తీర్చటం మాట అటుంచితే ఉద్యోగులు రోడ్డున పడతారు. డెయిరీ ఏపీడీడీసీఎఫ్ తనఖాలోకి వెళ్లిపోతుంది. పాల సేకరణ పూర్తిస్థాయిలో కొనసాగితే పాల పొడి ఫ్యాక్టరీని కూడా యధావిధిగా యంత్రాలు వాటి పని అవి చేసుకుపోతాయి. జీతాల బకాయి రూ.1.60 కోట్లు కొత్త పాలక మండలి పాలనలో ఉన్నా ఉద్యోగుల జీతాలు మాత్రం నాలుగు నెలల నుంచి బకాయి ఉంది. నెలకు ఉద్యోగుల జీతాల రూపంలో దాదాపు రూ.40 లక్షలకు పైగా ఉంది. 2018 డిసెంబర్ నుంచి జీతాలు ఇవ్వటం లేదు. అంటే దాదాపు మొత్తం రూ.1.60 కోట్లు ఒక్క జీతాలు రూపంలో డెయిరీ బకాయి పడింది. పాల సేకరణ పెంచటానికి పాలక మండలి కనీసం ఆలోచన చేయటం లేదన్నది స్పష్టమవుతోంది. దీనికితోడు నూతన కమిటీ అదనపు భారంగా ఉన్న ఉద్యోగులు చాలరన్నట్లు లక్షల జీతాలతో కొత్త వారిని తీసుకొంటూ డెయిరీపై మరీ భారాన్ని మోపుతున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. నెలకు ప్రస్తుతం కరెంటు బిల్లు రూ.20 నుంచి రూ.25 లక్షల వరకు వస్తోంది. అదే పాలు బాగా వచ్చి పాలపొడి ఫ్యాక్టరీతో అన్నీ యధావిధిగా కొనసాగితే దాదాపు కరెంటు బిల్లే నెలకు రూ.40 లక్షల వరకూ వచ్చేది. పాల పొడి ఫ్యాక్టరీ ఆశలు గాలికి నూతన పాలక మండలి చైర్మన్ జె.మురళి కొత్తల్లో కర్నాటక నుంచి పాలు తెప్పించి పాలపొడి ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని సర్వసభ్య సమావేశంలోనే చెప్పారు. అధికారులతో కూడిన బృందం కూడా బెంగళూరుకు వెళ్లి పరిశీలన కూడా చేసి వచ్చారు. మరి ఏమైందో ఏమో కానీ కర్నాటక పాలు సంగతి ఆ తరువాత ఊసే లేదు. పాలపొడి ఫ్యాక్టరీని రూ.లక్షలు వెచ్చించి మరీ బాగు చేయించారు కూడా. ఆ నిధులన్నీ పాలలో పోసిన పన్నీరుగానే మిగిలిపోయాయి. మూడు పాల శీతలీకరణ కేంద్రాలు మూత ఒంగోలు డెయిరీకి అనుబంధంగా జిల్లాలో ఐదు పాలశీతలీకరణ కేంద్రాలు ఉన్నాయి. డెయిరీని నష్టాల్లోకి నెట్టి కునారిల్లేటట్లు చేయటంతో చివరకు మూడు కేంద్రాలు మూతపడిపోయాయి. ప్రస్తుతం రెండు మాత్రమే అంతంతమాత్రంగా నడుస్తున్నాయి. మూతపడిన వాటిలో కనిగిరి, కంభం, దర్శి ఉన్నాయి. అంతంత మాత్రంగా నడుస్తున్న వాటిలో కొండమంజులూరు, యర్రగొండపాలెం ఉన్నాయి. -
రాష్ట్ర మార్కెట్లోకి కర్ణాటక పాలు
ఈ నెలలోనే ‘నందిని’ ప్రవేశం కర్ణాటకలో లీటర్ రూ. 29కే అమ్మకం ప్రభుత్వ విజయ డెయిరీకి దెబ్బ! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు డెయిరీల మధ్య మరోసారి పోటీ పెరగనుంది. ఇటీవల గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (జీసీఎంఎంఎఫ్) ఆధ్వర్యంలోని ‘అమూల్’ రాష్ట్రంలోకి అడుగుపెట్టి పాల విక్రయాలు ప్రారంభించగా త్వరలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు చెందిన ‘నందిని’ సైతం అదే బాటపట్టనుంది. అయితే ప్రభుత్వ అనుమతి లేకుండా కర్ణాటకకు చెందిన ‘నందిని’ రాష్ట్రంలోకి ప్రవేశించనుండటంపై ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘విజయ’ డెయిరీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది ‘విజయ’ బ్రాండ్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెరిటేజ్ పాలు లీటరు రూ. 44... నందిని రూ. 29నే... కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఈ నెలలో నందిని ఆవు పాలను మన మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఆ రాష్ట్రంలో నందిని బ్రాండ్ కింద ఫెడరేషన్ నిత్యం 32 లక్షల లీటర్ల పాలు విక్రయిస్తోంది. ఇందులో బెంగళూరు-మైసూరుల్లోనే 16 లక్షల లీటర్లు విక్రయిస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అడుగుపెట్టనున్న నందిని బ్రాండ్ హైదరాబాద్ మార్కెట్‌పైనే దృష్టిసారించింది. సాధారణంగా అత్యధికం మంది ప్రజలు టోన్డ్మిల్క్నే వినియోగిస్తారు. ఆ ప్రకారం హరిటేజ్ టోన్డ్‌మిల్క్ ధర లీటరు రూ. 44, విజయ పాల ధర రూ. 38 కాగా... నందిని ప్రస్తుతం కర్ణాటకలో కేవలం రూ. 29కే లీటరు పాలను విక్రయిస్తోంది. అయితే మన రాష్ట్రంలో అంత తక్కువ ధరకు విక్రయించకపోవచ్చనీ... ఇక్కడ మరో ధరను నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్కడ రైతులకు సేకరణ ధర తక్కువగా ఇస్తున్నందునే ఫెడరేషన్ ‘నందిని’ పాలను అంత తక్కువ ధరకు వినియోగదారులకు సరఫరా చేయగలుగుతోందని డెయిరీ అధికారులు అంటున్నారు. అలాగే గేదె పాలు ఏడాదికి సుమారు 7 నెలల వరకే పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాయని, కానీ ఆవు పాలు ఏడాదికి 10 నెలలకు మించి వస్తాయని అంటున్నారు. అందుకే ఆవు పాల రేటు తక్కువైనా లాభాలు అధికమని చెబుతున్నారు. పైగా ప్రస్తుతం మన రాష్ట్రంలో వివిధ డెయిరీలు విక్రయిస్తున్న పాలు కూడా గేదె, ఆవు పాలు కలిపి ఉంటాయంటున్నారు. ఏదేమైనా నందిని ఆ రాష్ట్రంలో విక్రయిస్తున్న ధరకు అటూఇటుగా ఇక్కడ ధరను నిర్ణయిస్తే ఆ ప్రభావం అన్ని పాల సంస్థలపైనా ఉంటుందని డెయిరీ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇదీ నార్మాక్ సహకారంతోనే... గుజరాత్ అమూల్ పాలను నల్లగొండ-రంగారెడ్డి మిల్క్ యూనియన్ (నార్మాక్)లో ప్యాకింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘నందిని’ పాలను కూడా నార్మాక్లోనే ప్యాకింగ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఒప్పందం జరిగిందని అంటున్నారు. ఆ ప్రకారం హయత్‌నగర్‌లో ఉన్న నార్మాక్ యూనిట్లో ప్యాకింగ్ చేసి ‘నందిని’ పాలను వినియోగదారులకు అందించనున్నారు. అయితే పాలను మాత్రం కర్ణాటక రైతుల నుంచే సేకరించి ప్రత్యేక పద్దతుల్లో ట్యాంకర్ల ద్వారా ఇక్కడకు తరలించి ఇక్కడ ప్యాకింగ్ చేసి వినియోగదారులకు సరఫరా చేయనున్నారు. కర్ణాటక ప్రభుత్వం నందిని డెయిరీకి ఏడాదికి దాదాపు రూ. 400 కోట్ల మేర ఆర్థిక సాయం చేస్తుండటం వల్లే ఫెడరేషన్ ఇతర రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తోందని... కానీ తెలంగాణలో విజయ డెయిరీకి చెందిన రైతులకు ప్రభుత్వం రూ. 4 ప్రోత్సాహం మాత్రమే ఇస్తూ ఇతరత్రా సాయం చేయడానికి ముందుకు రావట్లేదని, అందుకే పోటీలో నిలబడలేకపోతున్నట్లు విజయ డెయిరీ అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
హెరిటేజ్ పాలల్లో పురుగులు
హైదరాబాద్: నాణ్యతకు మారుపేరుగా సొంత డబ్బా కొట్టుకునే హెరిటేజ్ సంస్థకు చెందిన పాలల్లో పురుగులు వస్తున్నాయి. ఈ సంఘటన హైదరాబాద్ లోని మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సలీంనగర్ డివిజన్లో రఘు అనే యువకుడు పాలప్యాకెట్లను విక్రయిస్తుంటాడు. స్థానిక తార టవర్స్‌లోని ఓ గృహిణి మంగళవారం ఉదయం పాల ప్యాకెట్లు కొనగా అందులో పురుగులు వచ్చాయి. దీంతో సదరు మహిళ ఈ విషయాన్ని పాల ప్యాకెట్ల డిస్ట్రిబ్యూటర్‌కు తెలిపింది. ఈ నేపథ్యంలో హెరిటేజ్ పాల ప్యాకెట్లను కొనాలంటేనే భయంగా ఉందని స్థానికలు వాపోయారు. -
‘హెరిటేజ్’ పాలు నిషేధించాలి
టీఆర్ఎస్ నేతల డిమాండ్ తార్నాకలో భారీ ర్యాలీ..ఆందోళన తార్నాక:నాణ్యతలేకుండా పంపిణీ చేస్తున్న హెరిటేజ్ పాలను తెలంగాణ రాష్ట్రంలో నిషేదించాలని తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతే శోభన్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హెరిటేజ్ పాలను పూర్తిగా నిషేదించాలని డిమాండ్ చేస్తూ బుధవారం విజయ డెయిరీ కార్మికులు, తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెల్, తార్నాక మినీలారీస్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో లాలాపేట నుంచి తార్నాక చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. విజయ పాలు ముద్దు- హెరిటేజ్ పాలు వద్దు...విషపూరిత పాలు హెరిటేజ్ పాలు అంటూ ర్యాలీ పొడవునా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అనంతరం తార్నాక చౌరస్తాలో హెరిటేజ్ పాలను రోడ్డుపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ తార్నాక డివిజన్ వర్కింగ్ ప్రసిడెంట్ వేణుగోపాల్‌రెడ్డి, యుత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరెల్లి నాగరాజుగౌడ్, కార్మిక సంఘం నాయకులు శివానందం, చక్రవర్తిగౌడ్, పర్మేష్, అంజి, శంకర్, వెంకటస్వామి, శైలజ, రంగారెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినియోగదారుల ఫిర్యాదు మన్సూరాబాద్: హెరిటేజ్ కంపెనీ వారు నాణ్యత లేని పాలు సరఫరా చేయడంతో అవి వేడి చేయగానే విరిగిపోయాయని పలువురు వినియోగదారులు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పల్ యూనిట్ నుంచి ఎల్బీనగర్ పరిసర ప్రాంతాలకు పరఫరా చేసిన యూ18 ఎస్టీ బ్యాచ్ నెంబర్ గోల్డ్ స్టాండరైజ్డ్ పాలను మిల్క్పార్లర్ల వద్ద వినియోగదారులు కొనుగోలు చేశారు. అయితే పాలు విరిగిపోవడంతో వెంటనే సమీపంలోని మిల్క్ ఏజెంట్లకు ఫిర్యాదు చేశారు. వారు కంపెనీ ప్రతినిధులకు సమాచారం అందించారు. ఎల్బీనగర్ ప్రాంతంలో నాణ్యతలేని పాలు దాదాపు 800 లీటర్లు సరఫరా అయ్యాయి. తయారీలో లోపం నిజమే... ఉప్పల్ యూనిట్ నుంచిసరఫరా అయిన పాల తయారీలో లోపం ఏర్పడిన మాట వాస్తవమేనని హెరిటేజ్ ఎల్బీనగర్ బ్రాంచి మేనేజర్ రాజిరెడ్డి పేర్కొన్నారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదు రాగానే వెంటనే ఏజంట్లను అప్రమత్తం చేసి వాటిని అమ్మవద్దని కోరినట్లు తెలిపారు. ఫిర్యాదు చేసిన కొనుగోలుదారులకు రెగ్యులర్ టోన్డ్ పాలను అందజేయమని కోరామని, సుమారు 50 శాతం పైగా పాలను వెనక్కి తెప్పించామని చెప్పారు. ఒక్కరోజే 20 వేల లీటర్ల పాలు పాడయ్యాయి... -ట్విన్ సిటీస్ మిల్క్ వెండర్స్ అసోసియేషన్ ఆరోపణ వనస్థలిపురం: హెరిటేజ్ సంస్థ పాల విక్రయాల వల్ల తాము నష్టపోతున్నామని, బుధవారం ఒక్కరోజే 20 వేల లీటర్ల హెరిటేజ్ స్టాండర్డ్ (గోల్డ్) పాలు పాడైపోయాయని జంటనగరాల మిల్క్ వెండర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపించారు. బుధవారం వనస్థలిపురంలో టీఆర్ఎస్ నాయకులు, మిల్క్ వెండర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ముద్దగౌని రాంమోహన్‌గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు కుంబ వెంకటేష్‌గౌడ్, ఉపాధ్యక్షులు రెహమాన్, కార్యదర్శి శ్రీరంగం తదితరులు మాట్లాడుతూ బుధవారం తాము సరఫరా చేసిన హెరిటేజ్ స్టాండర్డ్ (గోల్డ్) పాలు తాగి పలు ప్రాంతాలలో చిన్న పిల్లలు అస్వస్థతకు గురైనట్లు పలు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందాయని అన్నారు. ఈవిషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా రాంమోహన్‌గౌడ్ తెలిపారు. -
పాల కల్తీ నెపం రైతులపైకా?: గడికోట
‘హెరిటేజ్’పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట మండిపాటు సాక్షి, హైదరాబాద్: హెరిటేజ్ పాలల్లో కల్తీ నెపాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రైతులపైకి నెట్టడం దారుణమని వైఎస్సార్సీ శాసనసభాపక్షం కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. రైతులు తమ గేదెల నుంచి అమృతాన్ని హెరిటేజ్ సంస్థకు అప్పగిస్తే ప్యాకింగ్ సందర్భంగా వాటిలో విషం కలిస్తే అందుకు బాధ్యత రైతులదవుతుందా? అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శ్రీకాంత్‌రెడ్డి గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాటాడారు. హెరిటేజ్‌లో విష పదార్థాలున్నాయని చెబితే తమకు గేదెలు లేవని రైతుల నుంచే పాలు సేకరిస్తున్నామని చెప్పడం అర్థమేమిటని ప్రశ్నించారు. విషపదార్థాలున్నాయని ఎవరైనా చెబితే హెరిటేజ్ పాలల్లో అలాంటివి లేవని నాణ్యతా పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ పొంది ప్రజలకు చెప్పాలే గాని, ఆ నెపాన్ని రైతులపై తోసి వేయకూడదన్నారు. ‘పాల్మాలిన్’ అనే పదార్థం హెరిటేజ్ పాలల్లో ఉన్నందువల్ల నిషేధిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం తన గెజిట్‌లో ప్రకటించిందని వెల్లడిస్తూ దాని ప్రతిని విలేకరులకు చూపించారు. థర్డ్‌పార్టీ నిపుణులతో వాటిని పరీక్షింపజేసి, ఆ పాలు ఆరోగ్యరీత్యా సురక్షితమైనవేనని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. వాస్తవానికి ప్రస్తుతం మార్కెట్లో అన్ని రకాల ఆహారపదార్థాల్లోనూ విపరీతంగా కల్తీ జరుగుతోందని, దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి తీరని హాని కలుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజల ఆరోగ్యం కన్నా తన కుమారుడి వ్యాపారం బాగుంటే చాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారని విమర్శించారు. ఒక్క హెరిటేజ్‌వే కాదు, మార్కెట్లో ఉన్న అన్ని బ్రాండ్ల ఆహారపదార్థాలపైనా ఇదే విధమైన తనిఖీని నిర్వహించి వాటిలో ఎలాంటి కల్తీ లేదని, విషపూరితాలు లేవని సర్టిఫికెట్లు ఇవ్వాలని సూచించారు. తాము ఎవరిమీదనో బురద జల్లే ఉద్దేశ్యంతోనో, రాజకీయ లబ్ధి కోసమో ఈ అంశాలు చెప్పడం లేదని ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విషయాలు చెబుతున్నామని ఆయన తెలిపారు. -
లోకేష్ వ్యాపారాల కోసం ప్రజల ఆరోగ్యం పణం:శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేష్ బాబు వ్యాపారాల కోసం ప్రజల ఆరోగ్యం పణంగా పెడుతున్నారని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. హెరిటేజ్ పాలలో కల్తీ జరుగుతుందంటూ కేరళ ప్రభుత్వం గతంలో నిషేధం విధిస్తూ గెజిట్‌లో కూడా ఇచ్చిందని తెలిపారు. హెరిటేజ్ పాలలో కల్తీని రైతులపై నెట్టడం సరికాదన్నారు. ప్రజల భద్రత కోసం ఆలోచన చేసి మాట్లాడాలన్నారు. ధైర్యముంటే తమ కంపెనీలో ఎలాంటి కల్తీలేదని చెప్పాలని సవాల్ విసిరారు. తప్పులను ఇతరులపై నెట్టడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. రైతులు అమృతం ఇస్తే, తను ప్రజలకు విషం ఇస్తున్నాడన్నారు. నిపుణులతో తనిఖీలు చేయించేంత వరకు హెరిటేజ్ ఉత్పాదనలు నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. హెరిటేజ్ పాలలో క్యాన్సర్ కారక ఉత్ప్రేరకాలు ఉన్నాయా? లేదా? అన్నది స్పష్టం చేయాలన్నారు. ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని తాము డిమాండ్లు చేస్తున్నట్లు తెలిపారు. తమకు ఎటువంటి దురుద్దేశాలు లేవని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. ** -
అసెంబ్లీలో దుమారం రేపిన 'హెరిటేజ్'
హైదరాబాద్ : ప్రశాంతంగా సాగుతున్న తెలంగాణ అసెంబ్లీలో బుధవారం 'హెరిటేజ్' అంశం దుమారం రేపింది. వెటర్నరీ డిపార్ట్మెంట్ కునారిల్లిపోయిందంటూ తెలంగాణ టిడిపి సభ్యులు లేవనెత్తిన అంశంపై టీఆర్ఎస్ ధీటుగా జవాబిచ్చింది. పాలల్లో కల్తీ జరుగుతోందని టిడిపి సభ్యులు దాడి చేయగా.. ఆ కల్తీ వెనక టిడిపి నేత చంద్రబాబు నాయుడు నడిపిస్తున్న కంపెనీ ఉందంటూ ఎదురు దాడికి దిగింది. హెరిటేజ్ పాలను ఇప్పటికే కేరళ ప్రభుత్వం నిషేధించిందని.., అలాంటి పాలను తెలంగాణలో ఎలా విక్రయిస్తారంటూ టీఆర్ఎస్ సభ్యులు దాడికి దిగారు. చర్చ సందర్భంగా రెండు పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. చంద్రబాబు ఏజెంట్లుగా టిటిడిపి సభ్యులు వ్యవహరిస్తున్నారని, హెరిటేజ్ సంస్థ ప్రతినిధులుగా మాట్లాడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.హెరిటేజ్ సంస్థపై కేరళ ప్రభుత్వం నిషేధం విధించడం వాస్తవమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై వాస్తవాలు వెల్లడిస్తుంటే టీడీపీ సభ్యులు ఎందుకు ఉలికిపడుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. సభలో కొందరు ఆంధ్రప్రదేశ్‌కు, హెరిటేజ్ సంస్థకు ప్రతినిధులుగా మాట్లాడటం భావ్యం కాదన్నారు. మంత్రి రాజయ్య హెరిటేజ్ గురించి మాట్లాడితే టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. హెరిటేజ్ పాలను నిషేధించిన కేరళ ప్రభుత్వ జీవోలను సభకు సమర్పిస్తున్నామని, కల్తీ పాలు అమ్ముతుందనే కారణంగా కేరళ ప్రభుత్వం హెరిటేజ్ పాలను నిషేధించిందన్నారు. కేరళ ప్రభుత్వ నిర్ణయం గురించి మాట్లాడితే టీడీపీ ఎమ్మెల్యేలకు ఉలుకెందుకని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ నామినేట్ చేసిన తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున మాట్లాడటం లేదని విమర్శించారు. సభలో హెరిటేజ్ డైరెక్టర్లు గానీ, సంస్థ ప్రతినిధులు కానీ లేరని అన్నారు. హెరిటేజ్ గురించి మాట్లాడితే తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు ఊగిపోతున్నారో అర్థం కావటం లేదన్నారు. పాలు అనేది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశమని, దానికి అడ్డుపడితే ఎలా అని ప్రశ్నించారు.చంద్రబాబుకు తొత్తుల్లా టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల తీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల దురదృష్టంగా భావిస్తున్నారన్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటారు: రెడ్యా నాయక్ హైదరాబాద్‌లోనే పాలు కల్తీ జరుగుతుంటే... ఇక జిల్లాల్లో, పల్లెల్లో జరుగుతున్న కల్తీ వ్యవహారంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని రెడ్యా నాయక్ ప్రశ్నించారు. కల్తీ వ్యవహారాలపై దాడులు నిర్వహించేందుకు ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారో వెల్లడించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కేరళలో హెరిటేజ్ పాలు నిషేధించారని... తెలంగాణలోనూ అలాంటి నిర్ణయం ఏమైనా తీసుకున్నారా అని ప్రశ్నించారు. కల్తీని తీవ్రంగా పరిగణించాలి: గీతారెడ్డి పాలల్లో కల్తీ అంశం చాలా తీవ్రమైనదని కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి అన్నారు. ఫ్లోరైడ్ కలిపిన నీళ్లను పాలలో కలుపుతున్నారని, రాజకీయాలు పక్కనపెట్టి పాల కల్తీని తీవ్రంగా పరిగణించాలని ఆమె కోరారు. ఇదే అంశంపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాలల్లో కల్తీ అంశం చాలా తీవ్రమైనదని, హైదరాబాద్‌లోనే కాదని, అన్ని గ్రామాల్లో కల్తీ పాలు అమ్ముతున్నారన్నారు. హెరిటేజ్ పాల నాణ్యతను పరిశీలిస్తాం: రాజయ్య కేరళలో హెరిటేజ్ పాలను నిషేధించిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. అధికారికంగా హెరిటేజ్ పాల నాణ్యతను పరిశీలిస్తామని, తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఫుడ్ సేఫ్టీ కమిషనరేట్ ద్వారా పాల భద్రత, నాణ్యత పరిశీలిస్తామని రాజయ్య తెలిపారు. -
అసెంబ్లీలో 'హెరిటేజ్' దుమారం
-
మందు తాగే వాళ్లకు పాల గురించి ఏం తెలుసు: రేవంత్
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విరుచుకు పడ్డారు. ఫామ్‌హౌస్‌లో మందు తాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పాల గురించి ఏం తెలుసని ఆయన బుధవారమిక్కడ విమర్శించారు. కేరళలో హెరిటేజ్ సంస్థపై నిషేధం లేదని... విధించిన నిషేధాన్ని కేరళ ప్రభుత్వమే ఎత్తివేసిందని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి...ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి రూ.10 కోట్లు తీసుకున్నందుకు సస్పెండ్ చేసిన కేసీఆర్...తర్వాత తన వాటా ఇవ్వగానే సస్పెన్షన్ ఎత్తివేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ మాదిరే కేటీఆర్ కూడా సభలో అన్ని అబద్ధాలు చెబుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. 'మమ్మల్ని ఆంధ్రప్రదేశ్ నామినేటెడ్ ఎమ్మెల్యేలనటం అవమానించటమే. మమ్మల్నే కాదు..మమ్మలి గెలిపించిన తెలంగాణ ప్రజలను అవమానించటమే. తక్షణమే మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. లేదంటే కేటీఆర్‌పై స్పీకర్‌కు హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేస్తాం. స్పీకర్ సరిగా స్పందించకుంటే ఆయనపై కూడా అవిశ్వాసం పెడతాం' అని ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో అన్నారు.