- ఈ నెలలోనే ‘నందిని’ ప్రవేశం
- కర్ణాటకలో లీటర్ రూ. 29కే అమ్మకం
- ప్రభుత్వ విజయ డెయిరీకి దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు డెయిరీల మధ్య మరోసారి పోటీ పెరగనుంది. ఇటీవల గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (జీసీఎంఎంఎఫ్) ఆధ్వర్యంలోని ‘అమూల్’ రాష్ట్రంలోకి అడుగుపెట్టి పాల విక్రయాలు ప్రారంభించగా త్వరలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు చెందిన ‘నందిని’ సైతం అదే బాటపట్టనుంది. అయితే ప్రభుత్వ అనుమతి లేకుండా కర్ణాటకకు చెందిన ‘నందిని’ రాష్ట్రంలోకి ప్రవేశించనుండటంపై ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘విజయ’ డెయిరీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది ‘విజయ’ బ్రాండ్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హెరిటేజ్ పాలు లీటరు రూ. 44... నందిని రూ. 29నే...
కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఈ నెలలో నందిని ఆవు పాలను మన మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఆ రాష్ట్రంలో నందిని బ్రాండ్ కింద ఫెడరేషన్ నిత్యం 32 లక్షల లీటర్ల పాలు విక్రయిస్తోంది. ఇందులో బెంగళూరు-మైసూరుల్లోనే 16 లక్షల లీటర్లు విక్రయిస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అడుగుపెట్టనున్న నందిని బ్రాండ్ హైదరాబాద్ మార్కెట్‌పైనే దృష్టిసారించింది. సాధారణంగా అత్యధికం మంది ప్రజలు టోన్డ్‌మిల్క్‌నే వినియోగిస్తారు.
ఆ ప్రకారం హరిటేజ్ టోన్డ్‌మిల్క్ ధర లీటరు రూ. 44, విజయ పాల ధర రూ. 38 కాగా... నందిని ప్రస్తుతం కర్ణాటకలో కేవలం రూ. 29కే లీటరు పాలను విక్రయిస్తోంది. అయితే మన రాష్ట్రంలో అంత తక్కువ ధరకు విక్రయించకపోవచ్చనీ... ఇక్కడ మరో ధరను నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్కడ రైతులకు సేకరణ ధర తక్కువగా ఇస్తున్నందునే ఫెడరేషన్ ‘నందిని’ పాలను అంత తక్కువ ధరకు వినియోగదారులకు సరఫరా చేయగలుగుతోందని డెయిరీ అధికారులు అంటున్నారు.
అలాగే గేదె పాలు ఏడాదికి సుమారు 7 నెలల వరకే పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాయని, కానీ ఆవు పాలు ఏడాదికి 10 నెలలకు మించి వస్తాయని అంటున్నారు. అందుకే ఆవు పాల రేటు తక్కువైనా లాభాలు అధికమని చెబుతున్నారు. పైగా ప్రస్తుతం మన రాష్ట్రంలో వివిధ డెయిరీలు విక్రయిస్తున్న పాలు కూడా గేదె, ఆవు పాలు కలిపి ఉంటాయంటున్నారు. ఏదేమైనా నందిని ఆ రాష్ట్రంలో విక్రయిస్తున్న ధరకు అటూఇటుగా ఇక్కడ ధరను నిర్ణయిస్తే ఆ ప్రభావం అన్ని పాల సంస్థలపైనా ఉంటుందని డెయిరీ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ నార్మాక్ సహకారంతోనే...
గుజరాత్ అమూల్ పాలను నల్లగొండ-రంగారెడ్డి మిల్క్ యూనియన్ (నార్మాక్)లో ప్యాకింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘నందిని’ పాలను కూడా నార్మాక్‌లోనే ప్యాకింగ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఒప్పందం జరిగిందని అంటున్నారు. ఆ ప్రకారం హయత్‌నగర్‌లో ఉన్న నార్మాక్ యూనిట్‌లో ప్యాకింగ్ చేసి ‘నందిని’ పాలను వినియోగదారులకు అందించనున్నారు. అయితే పాలను మాత్రం కర్ణాటక రైతుల నుంచే సేకరించి ప్రత్యేక పద్దతుల్లో ట్యాంకర్ల ద్వారా ఇక్కడకు తరలించి ఇక్కడ ప్యాకింగ్ చేసి వినియోగదారులకు సరఫరా చేయనున్నారు.
కర్ణాటక ప్రభుత్వం నందిని డెయిరీకి ఏడాదికి దాదాపు రూ. 400 కోట్ల మేర ఆర్థిక సాయం చేస్తుండటం వల్లే ఫెడరేషన్ ఇతర రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తోందని... కానీ తెలంగాణలో విజయ డెయిరీకి చెందిన రైతులకు ప్రభుత్వం రూ. 4 ప్రోత్సాహం మాత్రమే ఇస్తూ ఇతరత్రా సాయం చేయడానికి ముందుకు రావట్లేదని, అందుకే పోటీలో నిలబడలేకపోతున్నట్లు విజయ డెయిరీ అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.