Karnataka Milk Federation
-
పాలసేకరణలో నంబర్‌వన్ స్థానంపై కేఎంఎఫ్ దృష్టి
ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ విస్తరణ దిశగా అడుగులు ♦ హైదరాబాద్‌లో లీటరు రూ. 34కే నందిని స్పెషల్ టోన్డ్ మిల్క్ ♦ హైదరాబాద్‌లో రోజుకు రెండు లక్షల లీటర్ల విక్రయ లక్ష్యం ♦ కర్నాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) చైర్మన్ పి.నాగరాజు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దేశీయంగా పాలసేకరణలో మొదటిస్థానం కైవసం చేసుకోవడంపై దృష్టిపెట్టినట్లు కర్నాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) ప్రకటించింది. ప్రస్తుతం దక్షిణాదిలో మొదటి స్థానంలో ఉన్న కేఎంఎఫ్ రానున్న కాలంలో దేశీయంగా కూడా ఆ స్థానానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేఎంఎఫ్ చైర్మన్ పి. నాగరాజు తెలిపారు. ఇందుకోసం ఉత్తరాది మార్కెట్‌పై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. నెలరోజుల్లో ముంబై, పూణే నగరాలతో పాటు త్వరలో ఢిల్లీ మార్కెట్లోకి ప్రవేశించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రోజుకు 1.49 కోట్ల లీటర్లను సేకరించడం ద్వారా గుజరాత్ మిల్క్ ఫెడరేషన్ (అమూ ల్ బ్రాండ్) దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉండగా, దక్షిణాదిన రోజుకు 72 లక్షల లీటర్ల పాల సమీకరణతో కేఎంఎఫ్ మొదటి స్థానంలో ఉంది. ఈ 72 లక్షల లీటర్ల పాలల్లో కేవలం 52 లక్షల లీటర్లను మాత్రమే పాలు పెరుగు, ఇతర ఉత్పత్తులకు వినియోగించగలుగుతున్నామని, మిగిలిన మొత్తాన్ని పాలపొడికి వినియోగిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి నందిని స్పెషల్ టోన్డ్ మిల్క్‌ను హైదరాబాద్ మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేశారు. 3.5% వెన్నశాతం ఉన్న లీటరు పాలను కేవ లం రూ. 34కే అందిస్తున్నట్లు నాగరాజు తెలిపారు. హైదరాబాద్ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి ప్రైవేటు కంపెనీలు అధిక ధరకు విక్రయిస్తున్న హైదరాబాద్ మార్కెట్‌పై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు కేఎంఎఫ్ ప్రకటించింది. నందిని బ్రాండ్ ప్రవేశంతో అన్ని కంపెనీలు పాల ధరలను గణనీయంగా తగ్గించాయని, ఇప్పుడు స్పెషల్ టోన్డ్ మిల్క్ ధరలను తగ్గించడంతో ఈ విభాగంలో కూడా ధరల యుద్ధం మొదలవుతుందన్న అభిప్రాయాన్ని నాగరాజు వ్యక్తం చేశారు. అనతి కాలంలోనే ఇక్కడ నందిని బ్రాండ్‌కు మంచి స్పందన లభిస్తోందని, త్వరలోనే రోజుకు రెండు లక్షల లీటర్ల పాలను విక్రయించే స్థాయికి చేరుకుంటామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నందిని బ్రాండ్ తాజా పాలు రోజుకు 75,000 లీటర్లు విక్రయిస్తుంటే, ధీర్ఘకాలం నిల్వ ఉండే గుడ్‌లైఫ్ బ్రాండ్ పాలు 50,000 లీటర్లు విక్రయిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే ఇక్కడ రూ. 40 కోట్ల వ్యయంతో సొంతంగా రోజుకు 5 లక్షల లీటర్ల పాలను శుద్ధి చేసే యూనిట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. -
రాష్ట్ర మార్కెట్లోకి కర్ణాటక పాలు
ఈ నెలలోనే ‘నందిని’ ప్రవేశం కర్ణాటకలో లీటర్ రూ. 29కే అమ్మకం ప్రభుత్వ విజయ డెయిరీకి దెబ్బ! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు డెయిరీల మధ్య మరోసారి పోటీ పెరగనుంది. ఇటీవల గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (జీసీఎంఎంఎఫ్) ఆధ్వర్యంలోని ‘అమూల్’ రాష్ట్రంలోకి అడుగుపెట్టి పాల విక్రయాలు ప్రారంభించగా త్వరలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు చెందిన ‘నందిని’ సైతం అదే బాటపట్టనుంది. అయితే ప్రభుత్వ అనుమతి లేకుండా కర్ణాటకకు చెందిన ‘నందిని’ రాష్ట్రంలోకి ప్రవేశించనుండటంపై ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘విజయ’ డెయిరీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది ‘విజయ’ బ్రాండ్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెరిటేజ్ పాలు లీటరు రూ. 44... నందిని రూ. 29నే... కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఈ నెలలో నందిని ఆవు పాలను మన మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఆ రాష్ట్రంలో నందిని బ్రాండ్ కింద ఫెడరేషన్ నిత్యం 32 లక్షల లీటర్ల పాలు విక్రయిస్తోంది. ఇందులో బెంగళూరు-మైసూరుల్లోనే 16 లక్షల లీటర్లు విక్రయిస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అడుగుపెట్టనున్న నందిని బ్రాండ్ హైదరాబాద్ మార్కెట్‌పైనే దృష్టిసారించింది. సాధారణంగా అత్యధికం మంది ప్రజలు టోన్డ్మిల్క్నే వినియోగిస్తారు. ఆ ప్రకారం హరిటేజ్ టోన్డ్‌మిల్క్ ధర లీటరు రూ. 44, విజయ పాల ధర రూ. 38 కాగా... నందిని ప్రస్తుతం కర్ణాటకలో కేవలం రూ. 29కే లీటరు పాలను విక్రయిస్తోంది. అయితే మన రాష్ట్రంలో అంత తక్కువ ధరకు విక్రయించకపోవచ్చనీ... ఇక్కడ మరో ధరను నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్కడ రైతులకు సేకరణ ధర తక్కువగా ఇస్తున్నందునే ఫెడరేషన్ ‘నందిని’ పాలను అంత తక్కువ ధరకు వినియోగదారులకు సరఫరా చేయగలుగుతోందని డెయిరీ అధికారులు అంటున్నారు. అలాగే గేదె పాలు ఏడాదికి సుమారు 7 నెలల వరకే పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాయని, కానీ ఆవు పాలు ఏడాదికి 10 నెలలకు మించి వస్తాయని అంటున్నారు. అందుకే ఆవు పాల రేటు తక్కువైనా లాభాలు అధికమని చెబుతున్నారు. పైగా ప్రస్తుతం మన రాష్ట్రంలో వివిధ డెయిరీలు విక్రయిస్తున్న పాలు కూడా గేదె, ఆవు పాలు కలిపి ఉంటాయంటున్నారు. ఏదేమైనా నందిని ఆ రాష్ట్రంలో విక్రయిస్తున్న ధరకు అటూఇటుగా ఇక్కడ ధరను నిర్ణయిస్తే ఆ ప్రభావం అన్ని పాల సంస్థలపైనా ఉంటుందని డెయిరీ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇదీ నార్మాక్ సహకారంతోనే... గుజరాత్ అమూల్ పాలను నల్లగొండ-రంగారెడ్డి మిల్క్ యూనియన్ (నార్మాక్)లో ప్యాకింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘నందిని’ పాలను కూడా నార్మాక్లోనే ప్యాకింగ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఒప్పందం జరిగిందని అంటున్నారు. ఆ ప్రకారం హయత్‌నగర్‌లో ఉన్న నార్మాక్ యూనిట్లో ప్యాకింగ్ చేసి ‘నందిని’ పాలను వినియోగదారులకు అందించనున్నారు. అయితే పాలను మాత్రం కర్ణాటక రైతుల నుంచే సేకరించి ప్రత్యేక పద్దతుల్లో ట్యాంకర్ల ద్వారా ఇక్కడకు తరలించి ఇక్కడ ప్యాకింగ్ చేసి వినియోగదారులకు సరఫరా చేయనున్నారు. కర్ణాటక ప్రభుత్వం నందిని డెయిరీకి ఏడాదికి దాదాపు రూ. 400 కోట్ల మేర ఆర్థిక సాయం చేస్తుండటం వల్లే ఫెడరేషన్ ఇతర రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తోందని... కానీ తెలంగాణలో విజయ డెయిరీకి చెందిన రైతులకు ప్రభుత్వం రూ. 4 ప్రోత్సాహం మాత్రమే ఇస్తూ ఇతరత్రా సాయం చేయడానికి ముందుకు రావట్లేదని, అందుకే పోటీలో నిలబడలేకపోతున్నట్లు విజయ డెయిరీ అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
సామాన్యుడిపై పాల పిడుగు
లీటర్ పాలపై రూ.2 నుంచి రూ.3 వరకు పెరిగే అవకాశం ముఖ్యమంత్రి ఆమోదమే తరువాయి బెంగళూరు : కొత్త సంవత్సరంలో సామాన్యుడిపై ధరా భారాన్ని మోపేందుకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ సన్నద్ధమైంది. లీటర్ పాలపై రూ.2 నుంచి రూ.3 వరకు పాల ధరను పెంచుతూ ప్రజలపై పాల పిడుగును మోపేందుకు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఫైలును ఇప్పటికే ముఖ్యమంత్రికి అందజేయగా, ముఖ్యమంత్రి ఆమోదముద్ర లభించిన తక్షణం పెరిగిన ధరలు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ పాలక మండలి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల ధర పెంపుపై పాలక మండి సభ్యులు చర్చించారు. కేఎంఎఫ్ సిబ్బంది వేతనాలు, పాల రవాణా, తదితర నిర్వహణా వ్యయం చాలా వరకు పెరిగిపోయిందని, పాల ఉత్పత్తుల అమ్మకాల వల్ల వచ్చే లాభాల కన్నా నిర్వహణా వ్యయమే ఎక్కువగా ఉందన్న విషయం పాలక మండలి సమావేశంలో ముఖ్య చర్చనీయాంశమైంది. కాగా ఈ నిర్వహణా వ్యయాన్ని తట్టుకోవాలంటే పాల ధర పెంచక తప్పదని పాలక మండలి తీర్మానించింది. ఇదే అంశాలను ప్రస్తావిస్తూ పాల ధరను లీటరుకు రూ.2 నుంచి రూ.3కు పెంచేందుకు అనుమతించాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఇప్పటికే నివేదికను అందజేశారు. దీంతో ముఖ్యమంత్రి ఆమోద ముద్ర లభించిన తక్షణం పెరిగిన పాల ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కేఎంఎఫ్ వర్గాలు చెబుతున్నాయి. -
పాల ఉత్పత్తికి ప్రోత్సాహం
* సీఎం సిద్ధరామయ్య సాక్షి, బెంగళూరు : రానున్న పదేళ్లల్లో పాల ఉత్పత్తి సహకార సంఘాల సంఖ్యను 20 వేలకు పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. ప్రస్తుతం ఈ సంఖ్య 12,600గా ఉందన్నారు. ఇక్కడి ప్యాలెస్ మైదానంలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన 61వ సహకార వారోత్సవాల ప్రారంభ కార్యక్రమన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. దక్షిణ కర్ణాటక ప్రాంతంతో పోలిస్తే ఉత్తర కర్ణాటక ప్రాంతంలో పాల ఉత్తత్తి, పాల ఉత్పత్తి సహకార సంఘాల ఏర్పాటు తక్కువగా ఉందన్నారు. అందువల్ల నూతనంగా ఏర్పాటు చేసే సహకార సంఘాలు ఎక్కువగా ఉత్తర కర్ణాటక ప్రాంతంలో ఉండేలా చూస్తామన్నారు. దీని వల్ల అక్కడి రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పశుపోషణలో ఎక్కువగా మహిళలే ఉన్నా పాల క్రయవిక్రయాలు ఇందుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ ఆయా కుటుంబంలోని మగవాళ్ల చేతుల్లోనే ఉంటాయన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అందువల్ల నూతనంగా ఏర్పాటు చేసే సహకార సంఘాల్లో ఎక్కువగా మహిళా సంఘాలు ఉంటాయన్నారు. ఇందు కోసం రూ.3 కోట్ల నిధులను ప్రత్యేకంగా కేటాయించనున్నామని తెలిపారు. నాణ్యమైన పశు ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి వీలుగా ఇకపై రైతుల నుంచి మొక్క జొన్నను నేరుగా కొనుగోలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రస్తుతం రోజుకు 65 లక్షల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తున్నామని, రానున్న పదేళ్లలో రోజుకు 150 లక్షల లీటర్ల పాల ఉత్పత్తిని లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని తెలిపారు. ఒక్కొక్క పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షుడికి, కార్యదర్శికి లీటరు పాల ఉత్పత్తికి 20 పైసల ప్రోత్సాహకాన్ని త్వరలో ఇవ్వనున్నామన్నారు. పశుసంవర్థక శాఖ మంత్రి టీ.బీ జయచంద్ర మాట్లాడుతూ కల్తీపాల విక్రయాలు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. దీనిని నిరోధించేందుకు కఠిన చట్టాలు తీసుకురానున్నామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు డీ.కే శివకుమార్, రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.