పాల ఉత్పత్తికి ప్రోత్సాహం
* సీఎం సిద్ధరామయ్య
సాక్షి, బెంగళూరు : రానున్న పదేళ్లల్లో పాల ఉత్పత్తి సహకార సంఘాల సంఖ్యను 20 వేలకు పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. ప్రస్తుతం ఈ సంఖ్య 12,600గా ఉందన్నారు. ఇక్కడి ప్యాలెస్ మైదానంలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన 61వ సహకార వారోత్సవాల ప్రారంభ కార్యక్రమన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. దక్షిణ కర్ణాటక ప్రాంతంతో పోలిస్తే ఉత్తర కర్ణాటక ప్రాంతంలో పాల ఉత్తత్తి, పాల ఉత్పత్తి సహకార సంఘాల ఏర్పాటు తక్కువగా ఉందన్నారు.
అందువల్ల నూతనంగా ఏర్పాటు చేసే సహకార సంఘాలు ఎక్కువగా ఉత్తర కర్ణాటక ప్రాంతంలో ఉండేలా చూస్తామన్నారు. దీని వల్ల అక్కడి రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పశుపోషణలో ఎక్కువగా మహిళలే ఉన్నా పాల క్రయవిక్రయాలు ఇందుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ ఆయా కుటుంబంలోని మగవాళ్ల చేతుల్లోనే ఉంటాయన్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అందువల్ల నూతనంగా ఏర్పాటు చేసే సహకార సంఘాల్లో ఎక్కువగా మహిళా సంఘాలు ఉంటాయన్నారు.
ఇందు కోసం రూ.3 కోట్ల నిధులను ప్రత్యేకంగా కేటాయించనున్నామని తెలిపారు. నాణ్యమైన పశు ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి వీలుగా ఇకపై రైతుల నుంచి మొక్క జొన్నను నేరుగా కొనుగోలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రస్తుతం రోజుకు 65 లక్షల లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తున్నామని, రానున్న పదేళ్లలో రోజుకు 150 లక్షల లీటర్ల పాల ఉత్పత్తిని లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని తెలిపారు. ఒక్కొక్క పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షుడికి, కార్యదర్శికి లీటరు పాల ఉత్పత్తికి 20 పైసల ప్రోత్సాహకాన్ని త్వరలో ఇవ్వనున్నామన్నారు.
పశుసంవర్థక శాఖ మంత్రి టీ.బీ జయచంద్ర మాట్లాడుతూ కల్తీపాల విక్రయాలు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. దీనిని నిరోధించేందుకు కఠిన చట్టాలు తీసుకురానున్నామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు డీ.కే శివకుమార్, రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.