సామాన్యుడిపై పాల పిడుగు
లీటర్ పాలపై రూ.2 నుంచి రూ.3 వరకు పెరిగే అవకాశం
ముఖ్యమంత్రి ఆమోదమే తరువాయి
బెంగళూరు : కొత్త సంవత్సరంలో సామాన్యుడిపై ధరా భారాన్ని మోపేందుకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ సన్నద్ధమైంది. లీటర్ పాలపై రూ.2 నుంచి రూ.3 వరకు పాల ధరను పెంచుతూ ప్రజలపై పాల పిడుగును మోపేందుకు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఫైలును ఇప్పటికే ముఖ్యమంత్రికి అందజేయగా, ముఖ్యమంత్రి ఆమోదముద్ర లభించిన తక్షణం పెరిగిన ధరలు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ పాలక మండలి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల ధర పెంపుపై పాలక మండి సభ్యులు చర్చించారు. కేఎంఎఫ్ సిబ్బంది వేతనాలు, పాల రవాణా, తదితర నిర్వహణా వ్యయం చాలా వరకు పెరిగిపోయిందని, పాల ఉత్పత్తుల అమ్మకాల వల్ల వచ్చే లాభాల కన్నా నిర్వహణా వ్యయమే ఎక్కువగా ఉందన్న విషయం పాలక మండలి సమావేశంలో ముఖ్య చర్చనీయాంశమైంది.
కాగా ఈ నిర్వహణా వ్యయాన్ని తట్టుకోవాలంటే పాల ధర పెంచక తప్పదని పాలక మండలి తీర్మానించింది. ఇదే అంశాలను ప్రస్తావిస్తూ పాల ధరను లీటరుకు రూ.2 నుంచి రూ.3కు పెంచేందుకు అనుమతించాల్సిందిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఇప్పటికే నివేదికను అందజేశారు. దీంతో ముఖ్యమంత్రి ఆమోద ముద్ర లభించిన తక్షణం పెరిగిన పాల ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కేఎంఎఫ్ వర్గాలు చెబుతున్నాయి.