పచ్చ పా ‘పాలు’ | Heritage Milk Dairy Problems In Ongole | Sakshi
Sakshi News home page

పచ్చ పా ‘పాలు’

Published Mon, Mar 25 2019 4:21 PM | Last Updated on Mon, Mar 25 2019 4:22 PM

Heritage Milk Dairy Problems In Ongole - Sakshi

ఒంగోలు డెయిరీ కార్యాలయం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న హెరిటేజ్‌ డెయిరీ దిన దిన ప్రవర్ధమానమవుతూ వందల కోట్ల లాభాల్లోకి రాకెట్‌లా దూసుకుపోతోంది. ముఖ్యమంత్రి ఆస్తులు, కుటుంబ ఆస్తులు కూడా 2014 సాధారణ ఎన్నికలతో పోలిస్తే 2019 ఎన్నికలకు రెట్టింపు అయ్యాయి. కానీ ఒంగోలు డెయిరీ మాత్రం రూ.కోట్లలో అప్పుల్లోకి కూరుకుపోయింది. అది కూడా తెలుగుదేశం పార్టీ పాలక మండలి చేతుల్లోనే కావటం గమనార్హం.

సాక్షి, ఒంగోలు సబర్బన్‌: ఒంగోలు గిత్త అంటే అంతర్జాతీయ కీర్తి. ప్రకాశం పాలకు ఉన్న రుచి ఏ ప్రాంత పాలకూ రాదు. అందుకే ఒంగోలు డెయిరీ రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలిగింది. ఏడాదికి రెండు నుంచి మూడు కోట్ల లీటర్ల పాలు ప్రతి సంవత్సరం జిల్లాతో పాటు రాష్ట్ర సరిహద్దులు దాటేవి. అలాంటి ఒంగోలు డెయిరీని టీడీపీ పాలకులు నిలువునా నాశనం చేశారు.


తెలుగుదేశం పార్టీ ఆధీనంలో ఉన్న ఒంగోలు డెయిరీ పాలక మండలి రూ.80 కోట్లకు పైగా బొక్కి ఒట్టి పోయిన గేదెను వదిలినట్లు వదిలి వెళ్లిపోయింది. 15 సంవత్సరాలకు పైగా చైర్మన్‌గా ఉన్న ఓగూరుకు చెందిన టీడీపీ నాయకుడు చల్లా శ్రీనివాసరావు కోట్ల రూపాయలు వెనకేసుకొని పూర్తి స్థాయిలో నష్టాల ఊబిలోకి నెట్టి జిల్లా పాడి రైతులను నిలువునా ముంచి వెళ్లిపోయాడు. లబోదిబో మంటూ జిల్లాలోని పాడి రైతులు, చివరకు అధికార పార్టీ నాయకులు సైతం ఉద్యమాలు, ఆందోళనలు చేయటంతో నాలుక కరుచుకున్న చంద్రబాబు ప్రభుత్వం చల్లా శ్రీనివాసరావు పాలకమండలిని రద్దు చేసి ప్రభుత్వ అధికారులతో కూడిన కమిటీని నియమించింది. అధికారులతో కూడిన కమిటీ కూడా తామేమీ తక్కువ కాదంటూ డెయిరీని ముందుకు తీసుకెళ్లటంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు.  


నూతన కమిటీ ఏర్పాటైనా..
రాష్ట్ర అధికారి జుజ్జవరపు మురళి అధ్యక్షునిగా నూతన కమిటీ 2018 జూలై 19న ఏర్పాటైంది. సరిగ్గా 2019 మార్చి 19కి ఎనిమిది నెలలు పూర్తయింది. అయితే డెయిరీ ఒక అడుగు ముందుకు, ఎనిమిది అడుగులు వెనక్కు అన్న చందంగా తయారైంది. డెయిరీకి నూతనంగా సీఈఓతో పాటు మరో ఇద్దరు అధికారులను అదనంగా కేటాయించినా అభివృద్ధి విషయంలో అడుగు ముందుకు పడటం లేదు. డెయిరీని ఆదుకోవటానికి ఏపీడీడీసీఎఫ్‌ నుంచి రూ.35 కోట్లు అప్పు తీసుకున్నారు. ఈ రుణాన్ని 2018 జూన్‌ 27న జీఓ ఎంఎస్‌ నంబర్‌ 26, ఏహెచ్‌డీడీ అండ్‌ ఎఫ్‌ కింద విడుదల చేశారు. అందుకుగాను రుణానికి తాకట్టుగా డెయిరీకి చెందిన రూ.58.98 కోట్ల విలువైన 8.75 ఎకరాలను తనఖా పెట్టారు.

దీనికి రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఆయా సందర్భాల్లో ప్రకటించిన రెపో రేటు మీద 2 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంది. ఈ లెక్క ప్రకారం  ప్రస్తుతం ఈ రుణానికి 8.25 శాతం వడ్డీ రేటు పడుతుంది. అందుకుగాను రుణాన్ని 2020 నవంబర్‌ నుంచి నెల నెలా కంతుల వారీగా వాయిదాలు చెల్లించేలా మారటోరియం ఉంటుంది. అప్పటి నుంచి నెలకు రూ.18,01,062 వాయిదాలుగా చెల్లించాలి. డెయిరీ నిర్వహణతో పాటు అంటే ఉద్యోగుల జీతాలు, కరెంటు బిల్లులు, పాడి రైతులకు చెల్లింపులు, రవాణా చార్జీలు చెల్లింపులు ఇలా అన్నీ సరిచేసుకుంటూ నెలవారీ వాయిదా కింద రూ.18,01,062 చెల్లించాలంటే అప్పటికి పూర్తి స్థాయిలో లాభాల బాట పడితే తప్ప చెల్లించే పరిస్థితి ఉండదు.

ఇలా 120 సమాన వాయిదాల్లో రుణాన్ని చెల్లించాల్సి ఉంది. నూతన కమిటీ ప్రారంభమై ఎనిమిది నెలలు పూర్తయినా ఇంకా పాల సేకరణ ఒక కాలిక్కి రాలేదంటే ఎప్పటికి డెయిరీ పాలకమండలి పాడి రైతుల్లో పూర్తి స్థాయి విశ్వాసం, నమ్మకాన్ని పెంచుకుంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. 


కమిటీ వేసే సమయానికి  డెయిరీ రూ.58.34 కోట్ల అప్పుల్లో ఉంది. ఇంకా నేటికీ అప్పుల్లోనే కొనసాగుతూనే ఉంది.  2016–17 ఆర్ధిక సంవత్సరంలో రూ.7.29 కోట్ల నష్టాల్లోనూ, 2017–18లో రూ.58.34 కోట్లు నష్టాల్లో ఉన్న డెయిరీని ఆదుకుంటారనుకుంటే ఇంకా అదనపు భారాలు మోపి ఇంకా పీకల్లోతు నష్టాల్లోకి నెట్టే ఆలోచనలే చేస్తున్నారన్న విమర్శలు పాలక మండలిపై వినిపిస్తున్నాయి. 


ఇప్పటికీ రోజుకు 20 వేల లీటర్ల లోపుకు పడిపోయిన వైనం
పాడి రైతులకు పూర్తి స్థాయిలో పాత పాల బకాయిలు చెల్లించి డెయిరీపై విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచితే తప్ప పాలు గతంలో మాదిరిగా రావు. ఎనిమిది నెలలు పూర్తయినా ఇంకా రోజుకు 15 నుంచి 20 వేల లీటర్లు లోపుకు పడిపోయాయి. కొత్త కమిటీ వచ్చి పాల సేకరణ ప్రారంభించటంతో జనవరి నెల వరకూ 20 నుంచి 25 వేలు వరకు పాలు వచ్చేవి. కానీ మధ్యలో పాడి రైతులకు సక్రమంగా పాల డబ్బులు ఇవ్వకపోవటంతో పాడి రైతులు పాలు ఆపారు. దీంతో డెయిరీకి పాలు రావటం గగనంగా మారింది. ఉన్నత స్థాయి అధికారుల చేతిలో డెయిరీని పెడితే దీని ఆలనా...పాలనా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది.    

డెయిరీ తిరిగి పునర్‌వైభవం సాధించాలంటే పాల సేకరణపై ముమ్మరంగా దృష్టి సారించాల్సి ఉంది. పాత పాలక మండలి నష్టాల బాట పట్టించినా 2017–18 ఆర్థిక సంవత్సరంలో 71.23 లక్షల లీటర్ల పాలు సేకరించారు. అంతకు ముందు ఏ సంవత్సరంలో కూడా సంవత్సరానికి పాలు 2 కోట్ల లీటర్లకు ఎప్పుడూ తగ్గలేదు. 2010–11 సంవత్సరంలో 2.31 కోట్ల లీటర్ల పాలు, 2011–12లో 2.67 కోట్ల లీటర్ల పాలు సేకరించేవారు. చివరకు 2016–17లో రూ.7.29 కోట్ల నష్టం చూపించిన సంవత్సరంలో కూడా 2.34 కోట్ల లీటర్ల పాలు సేకరించారంటే డెయిరీ పూర్వవైభవం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

రోజుకు కనీసం 60 నుంచి 70 వేల లీటర్ల పాలు సేకరిస్తేనే డెయిరీ నష్టాల బాట నుంచి బయట పడి లాభాల్లో వెళుతుంది. అంతే తప్ప ప్రస్తుతం కొనసాగుతున్నట్లు అయితే మాత్రం రుణం తీర్చటం మాట అటుంచితే ఉద్యోగులు రోడ్డున పడతారు. డెయిరీ ఏపీడీడీసీఎఫ్‌ తనఖాలోకి వెళ్లిపోతుంది. పాల సేకరణ పూర్తిస్థాయిలో కొనసాగితే పాల పొడి ఫ్యాక్టరీని కూడా యధావిధిగా యంత్రాలు వాటి పని అవి చేసుకుపోతాయి. 


జీతాల బకాయి రూ.1.60 కోట్లు
కొత్త పాలక మండలి పాలనలో ఉన్నా ఉద్యోగుల జీతాలు మాత్రం నాలుగు నెలల నుంచి బకాయి ఉంది. నెలకు ఉద్యోగుల జీతాల రూపంలో దాదాపు రూ.40 లక్షలకు పైగా ఉంది. 2018 డిసెంబర్‌ నుంచి జీతాలు  ఇవ్వటం లేదు. అంటే దాదాపు మొత్తం రూ.1.60 కోట్లు ఒక్క జీతాలు రూపంలో డెయిరీ బకాయి పడింది.  పాల సేకరణ పెంచటానికి పాలక మండలి కనీసం ఆలోచన చేయటం లేదన్నది స్పష్టమవుతోంది. దీనికితోడు నూతన కమిటీ అదనపు భారంగా ఉన్న ఉద్యోగులు చాలరన్నట్లు లక్షల జీతాలతో కొత్త వారిని తీసుకొంటూ డెయిరీపై మరీ భారాన్ని మోపుతున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. నెలకు ప్రస్తుతం కరెంటు బిల్లు రూ.20 నుంచి రూ.25 లక్షల వరకు వస్తోంది. అదే పాలు బాగా వచ్చి పాలపొడి ఫ్యాక్టరీతో అన్నీ యధావిధిగా కొనసాగితే దాదాపు కరెంటు బిల్లే నెలకు రూ.40 లక్షల వరకూ వచ్చేది. 


పాల పొడి ఫ్యాక్టరీ ఆశలు గాలికి
నూతన పాలక మండలి చైర్మన్‌ జె.మురళి కొత్తల్లో కర్నాటక నుంచి పాలు తెప్పించి పాలపొడి ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని సర్వసభ్య సమావేశంలోనే చెప్పారు. అధికారులతో కూడిన బృందం కూడా బెంగళూరుకు వెళ్లి పరిశీలన కూడా చేసి వచ్చారు. మరి ఏమైందో ఏమో కానీ కర్నాటక  పాలు సంగతి ఆ తరువాత ఊసే లేదు. పాలపొడి ఫ్యాక్టరీని రూ.లక్షలు వెచ్చించి మరీ బాగు చేయించారు కూడా. ఆ నిధులన్నీ పాలలో పోసిన పన్నీరుగానే మిగిలిపోయాయి. 

మూడు పాల శీతలీకరణ కేంద్రాలు మూత
ఒంగోలు డెయిరీకి అనుబంధంగా జిల్లాలో ఐదు పాలశీతలీకరణ కేంద్రాలు ఉన్నాయి. డెయిరీని నష్టాల్లోకి నెట్టి కునారిల్లేటట్లు చేయటంతో చివరకు మూడు కేంద్రాలు మూతపడిపోయాయి. ప్రస్తుతం రెండు మాత్రమే అంతంతమాత్రంగా నడుస్తున్నాయి. మూతపడిన వాటిలో కనిగిరి, కంభం, దర్శి ఉన్నాయి. అంతంత మాత్రంగా నడుస్తున్న వాటిలో కొండమంజులూరు, యర్రగొండపాలెం ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement