పాల కల్తీ నెపం రైతులపైకా?: గడికోట | Gadikota srikanth takes on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

పాల కల్తీ నెపం రైతులపైకా?: గడికోట

Published Fri, Nov 14 2014 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM

పాల కల్తీ నెపం రైతులపైకా?: గడికోట

పాల కల్తీ నెపం రైతులపైకా?: గడికోట

‘హెరిటేజ్’పై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట మండిపాటు
సాక్షి, హైదరాబాద్: హెరిటేజ్ పాలల్లో కల్తీ నెపాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రైతులపైకి నెట్టడం దారుణమని వైఎస్సార్‌సీ శాసనసభాపక్షం కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. రైతులు తమ గేదెల నుంచి అమృతాన్ని హెరిటేజ్ సంస్థకు అప్పగిస్తే ప్యాకింగ్ సందర్భంగా వాటిలో విషం కలిస్తే అందుకు బాధ్యత రైతులదవుతుందా? అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శ్రీకాంత్‌రెడ్డి గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాటాడారు. హెరిటేజ్‌లో విష పదార్థాలున్నాయని చెబితే తమకు గేదెలు లేవని రైతుల నుంచే పాలు సేకరిస్తున్నామని చెప్పడం అర్థమేమిటని ప్రశ్నించారు. విషపదార్థాలున్నాయని ఎవరైనా చెబితే హెరిటేజ్ పాలల్లో అలాంటివి లేవని నాణ్యతా పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ పొంది ప్రజలకు చెప్పాలే గాని, ఆ నెపాన్ని రైతులపై తోసి వేయకూడదన్నారు.
 
‘పాల్మాలిన్’ అనే  పదార్థం హెరిటేజ్ పాలల్లో ఉన్నందువల్ల నిషేధిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం తన గెజిట్‌లో ప్రకటించిందని వెల్లడిస్తూ దాని ప్రతిని విలేకరులకు చూపించారు. థర్డ్‌పార్టీ నిపుణులతో వాటిని పరీక్షింపజేసి, ఆ పాలు ఆరోగ్యరీత్యా సురక్షితమైనవేనని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. వాస్తవానికి ప్రస్తుతం మార్కెట్‌లో అన్ని రకాల ఆహారపదార్థాల్లోనూ విపరీతంగా కల్తీ జరుగుతోందని, దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి తీరని హాని కలుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజల ఆరోగ్యం కన్నా తన కుమారుడి వ్యాపారం బాగుంటే చాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారని విమర్శించారు. ఒక్క హెరిటేజ్‌వే కాదు, మార్కెట్‌లో ఉన్న అన్ని బ్రాండ్‌ల ఆహారపదార్థాలపైనా ఇదే విధమైన తనిఖీని నిర్వహించి వాటిలో ఎలాంటి కల్తీ లేదని, విషపూరితాలు లేవని సర్టిఫికెట్లు ఇవ్వాలని సూచించారు. తాము ఎవరిమీదనో బురద జల్లే ఉద్దేశ్యంతోనో, రాజకీయ లబ్ధి కోసమో ఈ అంశాలు చెప్పడం లేదని ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విషయాలు చెబుతున్నామని ఆయన తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement