సాక్షి, తాడేపల్లి: చంద్రబాబే దేశంలోనే ధనవంతుడైన సీఎం అని.. మిగతా అందరి సీఎంల అందరి ఆస్తులు కలిపినా చంద్రబాబు కంటే తక్కువేనంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి (Gadikota Srikanth Reddy) వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన వైఎస్సార్‌సీపీ(YSRCP) కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు(Chandrababu) వలన రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేకపోగా, ఆయన మాత్రమే సంపద సృష్టించుకున్నారన్నారు.
‘‘సంక్రాంతి పండుగ వచ్చినా ఏ కానుకలూ ప్రజలకు ఇవ్వలేదు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశన్నంటాయి. రిజిస్ట్రేషన్ ఛార్జీలను విపరీతంగా పెంచేశారు. మేనిఫెస్టోకి అర్థం లేకుండా చేశారు. జగన్ అధికారంలో ఉన్నట్లయితే ఇప్పటికే అనేక పథకాల కింద ప్రజల చేతుల్లో డబ్బులు ఉండేవి. చంద్రబాబు ఇవేమీ ఇవ్వకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు
..మెగా డీఎస్సీ అంటూ చంద్రబాబు పెట్టిన మొదటి సంతకానికే దిక్కు లేకుండా పోయింది. నిరుద్యోగులను నిలువునా మోసం చేశారు. మహిళలకు అనేక పథకాల ఆశలు చూపించి గొంతు కోశారు. ఆరోగ్యశ్రీని ప్రయివేటు పరం చేయబోతున్నారు. రూ.25 లక్షల విలువైన వైద్యాన్ని సైతం పేదలకు జగన్ అందిస్తే.. చంద్రబాబు దాన్ని పక్కన పెట్టారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేశారు.
ఇదీ చదవండి: ఇదీ వాస్తవం.. గణాంకాలతో సహా వివరించిన మార్గాని భరత్
..జగన్ తెచ్చిన ప్రాజెక్టులకు చంద్రబాబు ప్రధానితో శంకుస్థాపన చేయిస్తున్నారు. చంద్రబాబు ప్రత్యేకంగా తెచ్చిన ప్రాజెక్టు ఒక్కటీ తేలేదు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఇప్పటికే మూడు లక్షల ఉద్యోగాలు తొలగించారు. రెండేళ్లపాటు అసలు మాట్లాడకూడదనుకున్నాం. కానీ చంద్రబాబు చేస్తున్న మోసాలు, దోపిడీలపై పోరాటం చేయక తప్పటం లేదు. ఎక్కడ చూసినా గంజాయి, మద్యం షాపులే కనిపిస్తున్నాయి. ఇదేనా చంద్రబాబు సాధించిన ప్రగతి?’’ అంటూ శ్రీకాంత్‌రెడ్డి విమర్శలు గుప్పించారు.
..మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే ప్రభుత్వంలో కనీసం స్పందనేలేదు. జగన్ కార్యకర్తలకు మంచి భరోసా ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు పాలనపై ఎక్కువ దృష్టి పెట్టటం వలన కొన్ని సమస్యలు వచ్చాయి. ఇక మీదట కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుందని జగన్ చెప్పారు. పోర్టులు, మెడికల్ కాలేజీలు అన్నీ జగన్ తెచ్చినవే. రాష్ట్రంలో జగన్ హయాంలో పెట్టుబడులు వచ్చాయి. వాటికే చంద్రబాబు ఇవ్వాళ శంకుస్థాపన చేసుకుంటున్నారు’’ అని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment