శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేష్ బాబు వ్యాపారాల కోసం ప్రజల ఆరోగ్యం పణంగా పెడుతున్నారని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. హెరిటేజ్ పాలలో కల్తీ జరుగుతుందంటూ కేరళ ప్రభుత్వం గతంలో నిషేధం విధిస్తూ గెజిట్లో కూడా ఇచ్చిందని తెలిపారు. హెరిటేజ్ పాలలో కల్తీని రైతులపై నెట్టడం సరికాదన్నారు. ప్రజల భద్రత కోసం ఆలోచన చేసి మాట్లాడాలన్నారు. ధైర్యముంటే తమ కంపెనీలో ఎలాంటి కల్తీలేదని చెప్పాలని సవాల్ విసిరారు. తప్పులను ఇతరులపై నెట్టడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. రైతులు అమృతం ఇస్తే, తను ప్రజలకు విషం ఇస్తున్నాడన్నారు.
నిపుణులతో తనిఖీలు చేయించేంత వరకు హెరిటేజ్ ఉత్పాదనలు నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. హెరిటేజ్ పాలలో క్యాన్సర్ కారక ఉత్ప్రేరకాలు ఉన్నాయా? లేదా? అన్నది స్పష్టం చేయాలన్నారు. ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని తాము డిమాండ్లు చేస్తున్నట్లు తెలిపారు. తమకు ఎటువంటి దురుద్దేశాలు లేవని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.
**