అసెంబ్లీలో దుమారం రేపిన 'హెరిటేజ్' | Revanth Reddy Vs KTR over Heritage milk issue in Telangana assembly | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో దుమారం రేపిన 'హెరిటేజ్'

Published Wed, Nov 12 2014 11:48 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

అసెంబ్లీలో దుమారం రేపిన 'హెరిటేజ్' - Sakshi

అసెంబ్లీలో దుమారం రేపిన 'హెరిటేజ్'

హైదరాబాద్ : ప్రశాంతంగా సాగుతున్న తెలంగాణ అసెంబ్లీలో బుధవారం 'హెరిటేజ్‌' అంశం దుమారం రేపింది. వెటర్నరీ డిపార్ట్‌మెంట్‌ కునారిల్లిపోయిందంటూ తెలంగాణ టిడిపి సభ్యులు లేవనెత్తిన అంశంపై టీఆర్‌ఎస్‌ ధీటుగా జవాబిచ్చింది. పాలల్లో కల్తీ జరుగుతోందని టిడిపి సభ్యులు దాడి చేయగా.. ఆ కల్తీ వెనక టిడిపి నేత చంద్రబాబు నాయుడు నడిపిస్తున్న కంపెనీ ఉందంటూ ఎదురు దాడికి దిగింది. హెరిటేజ్‌ పాలను ఇప్పటికే కేరళ ప్రభుత్వం నిషేధించిందని.., అలాంటి పాలను తెలంగాణలో ఎలా విక్రయిస్తారంటూ టీఆర్‌ఎస్‌ సభ్యులు దాడికి దిగారు.

చర్చ సందర్భంగా రెండు పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. చంద్రబాబు ఏజెంట్లుగా టిటిడిపి సభ్యులు వ్యవహరిస్తున్నారని, హెరిటేజ్‌ సంస్థ ప్రతినిధులుగా మాట్లాడుతున్నారని కేటీఆర్‌ ధ్వజమెత్తారు.హెరిటేజ్‌ సంస్థపై కేరళ ప్రభుత్వం నిషేధం విధించడం వాస్తవమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై వాస్తవాలు వెల్లడిస్తుంటే టీడీపీ సభ్యులు ఎందుకు ఉలికిపడుతున్నారని కేటీఆర్‌ ప్రశ్నించారు. సభలో కొందరు ఆంధ్రప్రదేశ్‌కు, హెరిటేజ్‌ సంస్థకు ప్రతినిధులుగా మాట్లాడటం భావ్యం కాదన్నారు.

మంత్రి రాజయ్య హెరిటేజ్ గురించి మాట్లాడితే టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. హెరిటేజ్ పాలను నిషేధించిన కేరళ ప్రభుత్వ జీవోలను సభకు సమర్పిస్తున్నామని, కల్తీ పాలు అమ్ముతుందనే కారణంగా కేరళ ప్రభుత్వం హెరిటేజ్ పాలను నిషేధించిందన్నారు. కేరళ ప్రభుత్వ నిర్ణయం గురించి మాట్లాడితే టీడీపీ ఎమ్మెల్యేలకు ఉలుకెందుకని ప్రశ్నించారు.  టీడీపీ ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ నామినేట్ చేసిన తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున మాట్లాడటం లేదని విమర్శించారు.

సభలో హెరిటేజ్ డైరెక్టర్లు గానీ, సంస్థ ప్రతినిధులు కానీ లేరని అన్నారు. హెరిటేజ్ గురించి మాట్లాడితే తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు ఊగిపోతున్నారో అర్థం కావటం లేదన్నారు. పాలు అనేది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశమని, దానికి అడ్డుపడితే ఎలా అని ప్రశ్నించారు.చంద్రబాబుకు తొత్తుల్లా టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల తీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల దురదృష్టంగా భావిస్తున్నారన్నారు.

ఎలాంటి చర్యలు తీసుకుంటారు: రెడ్యా నాయక్

హైదరాబాద్‌లోనే పాలు కల్తీ జరుగుతుంటే... ఇక జిల్లాల్లో, పల్లెల్లో జరుగుతున్న కల్తీ వ్యవహారంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని రెడ్యా నాయక్‌ ప్రశ్నించారు. కల్తీ వ్యవహారాలపై దాడులు నిర్వహించేందుకు ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారో వెల్లడించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కేరళలో హెరిటేజ్‌ పాలు నిషేధించారని... తెలంగాణలోనూ అలాంటి నిర్ణయం ఏమైనా తీసుకున్నారా అని ప్రశ్నించారు.

కల్తీని తీవ్రంగా పరిగణించాలి: గీతారెడ్డి

పాలల్లో కల్తీ అంశం చాలా తీవ్రమైనదని కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి అన్నారు. ఫ్లోరైడ్ కలిపిన నీళ్లను పాలలో కలుపుతున్నారని, రాజకీయాలు పక్కనపెట్టి పాల కల్తీని తీవ్రంగా పరిగణించాలని ఆమె కోరారు. ఇదే అంశంపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాలల్లో కల్తీ అంశం చాలా తీవ్రమైనదని, హైదరాబాద్లోనే కాదని, అన్ని గ్రామాల్లో కల్తీ పాలు అమ్ముతున్నారన్నారు.

హెరిటేజ్ పాల నాణ్యతను పరిశీలిస్తాం: రాజయ్య

కేరళలో హెరిటేజ్ పాలను నిషేధించిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని డిప్యూటీ సీఎం రాజయ్య అన్నారు. అధికారికంగా హెరిటేజ్ పాల నాణ్యతను పరిశీలిస్తామని, తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. ఫుడ్ సేఫ్టీ కమిషనరేట్ ద్వారా పాల భద్రత, నాణ్యత పరిశీలిస్తామని రాజయ్య తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement